
హోలీ ఆడేందుకు పోలీసులు ఏకంగా...
దేశవ్యాప్తంగా గురువారం రంగులపండువ హోలీని సంబంరంగా జరుపుకున్నారు.
మొరాదాబాద్: దేశవ్యాప్తంగా గురువారం రంగులపండువ హోలీని సంబంరంగా జరుపుకున్నారు. పార్టీల అధినేతలు, సినీ ఇండస్ట్రీ సెలబ్రిటీలు, సామాన్య ప్రజానికం అనే లేకుండా అందరూ రంగుల్లో మునిగితేలారు. ఉత్తరప్రదేశ్ లో మాత్రం అగ్నిమాపక సిబ్బంది కాస్త భిన్నంగా హోలీని జరుపుకుంది. అగ్ని ప్రమాదాలు సంభవిస్తే వెళ్లి సహాయక చర్యలను చేపట్టాల్సిన ఆ సిబ్బంది, తాము విధినిర్వహణలో వాడే ఫైరింజన్ నే హోలీ సంబరంలో భాగం చేశారు. యూపీలోని మొరాదాబాద్ లో పోలీసు సిబ్బంది ఫైరింజన్ వాహనంపై రోడ్లపై చక్కర్లు కొడుతూ హల్ చల్ చేశారు.
అగ్నిమాపక సిబ్బంది ఫైరింజన్ వాహనంపై మొరాదాబాద్ లో చక్కర్లు కొడుతూ ఎంజాయ్ చేస్తూ హోలీ జరుపుకున్నారు. ఆ పోలీసులు జరుపుకున్న హోలీ సంబరాలను, వాహనంపై వారు తిరగడం, ఫైరింజన్ వాహనం నుంచి నీళ్లను హోలీ కోసం వాడుకుంటున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఈ విషయం ఇప్పటికే ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలుస్తోంది. హోలీ జరుపుకునేందుకు ప్రభుత్వ వాహనాన్ని, అందులో విధినిర్వహణకు అత్యవసరంగా అందుబాటులో ఉండాల్సిన వాహనాన్ని అగ్నిమాపక సిబ్బంది పండుగకు వాడటాన్ని చాలా మంది వ్యతిరేకిస్తూ ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో పదే పదే షేర్ చేస్తున్నారు.