వెల్లోకి దూసుకెళ్లిన సోనియా.. సభ వాయిదా
న్యూఢిల్లీ: ఎట్టకేలకు లలిత్ గేట్ వివాదంపై లోక్సభలోచర్చకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో చర్చ వాడి వేడిగా సాగింది. కాంగ్రెస్ ఆరోపణలపై బీజేపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగారు. కాంగ్రెస్ ఎంపీలు సహా సోనియా గాంధీ స్పీకర్ పోడియం ముందుకు దూసుకు రావడంతో గందరగో్ళం చెలరేగింది. దీంతో స్పీకర్ సుమిత్ర మహాజన్ సభను వాయిదా వేశారు.
సభలో చర్చ సందర్భంగా కాంగ్రెస్ ఎంపీ మల్లి ఖార్జున ఖర్గే తన విశ్వ రూపాన్ని చూపించారు. ప్రధాని నరేంద్రమోదీపై తన దాడిని ఎక్కుపెట్టారు. టీవీలు, రేడియోల్లో మాట్లాడుతారుగానీ చట్టసభలో ఎందుకు మాట్లాడరని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ సభ్యుల మధ్య వర్డ్ వార్ జరిగింది. దీంతో సోనియా సహా మిగిలిన ఎంపీలందరూ స్పీకర్ పోడియాన్ని చుట్టుముట్టారు. నినాదాలతో హోరెత్తించారు. కాంగ్రెస్ నినాదాలతో, ఆందోళనతో సభ దద్దరిల్లిపోయింది. దీంతో 2.30 వరకు సభను వాయిదా వేశారు.
అటు రాజ్యసభలో్ గందరగోళం కొనసాగుతోంది. విపక్షాల నిరసనలతో ఇప్పటికి రెండు సార్లువాయిదా పడింది.
కాగా వర్షాకాల సమావేశాల ప్రారంభం నుంచి ఈ విషయంపై మొండిగా వ్యవహరించిన కేంద్రం ప్రతిపక్షాల ఆందోళనతో దిగొచ్చింది. కాంగ్రెస్ సభ్యులు ఇచ్చిన వాయిదా తీర్మానంపై చర్చకు స్పీకర్ సుమిత్ర మహాజన్ బుధవారం అంగీకరించారు.