సోనియాకు కోపమొచ్చింది!
న్యూఢిల్లీ: లోక్‌సభలో బీజేపీ సభ్యుడొకరు తనపై చేసిన ఆరోపణపై కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ అగ్గిమీద గుగ్గిలమయ్యారు! ఎప్పుడూ లేని విధంగా తన సీటు వద్ద నుంచి వెల్‌లోకి దూసుకువెళ్లి ఆందోళన చేశా రు. ‘ఆయన ఏమన్నారు? ఏంటిది?’ అని స్పీకర్‌ను ఉద్దేశించి ఆవేశంగా అన్నారు. ఆమెకు మద్దతుగా కాంగ్రెస్ సభ్యులంతా ఆందోళన చేయడంతో సభ గంటపాటు వాయిదా వేయాల్సి వచ్చింది. లలిత్‌మోదీ వ్యవహారంపై కాంగ్రెస్ పక్ష నేత మల్లిఖార్జున ఖర్గే మాట్లాడుతున్న సమయంలో.. బీజేపీ ఎంపీ ఒకరు నల్లధనం విషయంలో సోనియాపై ఆరోపణ చేయడం దీనికి కారణమైంది. అయితే బీజేపీ సభ్యుడు ఏమన్నారో తనకు వినబడలేదని, అభ్యంతరకర వ్యాఖ్యలు ఉంటే పరి శీలిస్తానని స్పీకర్ చెప్పారు.
అయినా సోనియాతోపాటు కాంగ్రెస్ సభ్యులు ఆందోళన కొనసాగించారు. బీజేపీ సభ్యుడు క్షమాపణ చెప్పాల్సిందేనని ఖర్గే డిమాండ్ చేశారు. గొడవ సద్దుమణగకపోవడంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2.45 వరకువాయిదా వేశారు. తర్వాత సభ సమావేశమైన తర్వాత కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ.. ఎవరు ఎవరిపైనా ఆరోపణ చేసుకోవద్దని కోరారు. సోనియాపై చేసిన వ్యాఖ్యలేవీ రికార్డుల్లోకి వెళ్లవని తెలిపారు. ఇదిలా ఉండ గా కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యు లకు అధ్యక్షురాలు సోనియాగాంధీ బుధవారం రాత్రి విందును ఇచ్చారు.