వివాదాలు.. నినాదాలు! | uproar in parliament , both houses adjurned | Sakshi
Sakshi News home page

వివాదాలు.. నినాదాలు!

Published Thu, Jul 23 2015 1:23 AM | Last Updated on Tue, Jun 4 2019 8:03 PM

వివాదాలు.. నినాదాలు! - Sakshi

వివాదాలు.. నినాదాలు!

పతిపక్షం పట్టు విడవలేదు. ప్రభుత్వం బెట్టు వీడలేదు. పంతాలపై ఎవరూ తగ్గలేదు. పార్లమెంటు స్తంభించిపోయింది. నినాదాలతో దద్దరిల్లింది. వాగ్వాదాలతో గందరగోళంగా మారింది. వాయిదాలపై వాయిదాలతో గడచిపోయింది. వర్షాకాల సమావేశాల్లో బుధవారం రెండో రోజూ ఏ చర్చా లేకుండానే తుడిచిపెట్టుకుపోయింది. ప్రతిపక్షాల దాడిని.. కాంగ్రెస్ పాలనలోని రాష్ట్రాల్లో అవినీతి ఆరోప ణలను ప్రస్తావిస్తూ అధికారపక్షం ఎదురు దాడిని ఉధృతం చేసింది.  కోల్‌స్కాం నిందితుడికి పాస్‌పోర్ట్ ఇప్పించాలంటూ తనను ఒత్తిడి చేశారని సుష్మా..

ఉత్తరాఖండ్ సీఎం హరీశ్‌రావత్‌పై స్టింగ్ ఆపరేషన్ సీడీలను బయటపెట్టిన నిర్మలాసీతారామన్.. వెరసి.. ప్రభుత్వంపై విపక్షం దాడి, అధికారపక్షం ఎదురు దాడిగా ఘర్షణ మరింతగా ముదురుతోంది.

 
* పార్లమెంటులో ప్రతిష్టంభన  
* ఉభయసభలూ వాయిదా
* వ్యాపమ్, లలిత్‌గేట్‌లపై లోక్‌సభ వెల్‌లో విపక్షాల ఆందోళన
* సుష్మా, రాజే, చౌహాన్‌లు రాజీనామా చేయాలని డిమాండ్: నినాదాలు, ప్లకార్డుల ప్రదర్శన
* సభ్యులపై స్పీకర్ ఆగ్రహం.. క్రమశిక్షణ చర్యలకు హెచ్చరిక; అధికార పక్షం ఎదురుదాడి
* కాంగ్రెస్ రాష్ట్రాల సీఎంల అవినీతిపై చర్చిద్దామన్న జైట్లీ
 
సాక్షి, న్యూఢిల్లీ: లలిత్‌మోదీ వివాదం, వ్యాపమ్ కుంభకోణాలపై ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ నేతలను పదవుల నుంచి తొలగించాలన్న డిమాండ్‌తో ప్రతిపక్షాలు పార్లమెంటు ఉభయసభల్లోనూ తీవ్రస్థాయిలో నిరసనకు దిగాయి. విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్, రాజస్తాన్ ముఖ్యమంత్రి వసుంధరరాజే, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్‌లు పదవులకు రాజీనామా చేయనిదే ఎటువంటి చర్చనూ జరగనివ్వబోమని లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్, వామపక్షాలు, ఎస్‌పీ, బీఎస్‌పీ, ఎన్‌సీపీ తదితర పార్టీలు రెండోరోజూ భీష్మించాయి.

ఆ పార్టీల సభ్యులు తమ డిమాండ్లతో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేస్తుంటే.. అధికారపక్షం ప్రతి నినాదాలకు దిగింది. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఆరోపణలను ప్రస్తావిస్తూ ఎదురుదాడి చేసింది. గందరగోళాల మధ్య ఉభయసభలూ ఎటువంటి కార్యకలాపాలూ జరపకుండానే గురువారానికి వాయిదాపడ్డాయి.
 
లోక్‌సభలో విపక్షాల హోరు...
బుధవారం ఉదయం 11 గంటలకు సభ సమావేశమైన తర్వాత వివిధ ప్రాంతాల్లో ప్రమాదాలు, దుర్ఘటనల్లో మరణించిన వారికి నివాళులర్పించింది. రాజమండ్రి తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన 29 మందికి కూడా నివాళులు తెలిపింది. ఆ తరువాత విపక్షాల ఆందోళన, నిరసనలతో సభ హోరెత్తింది. తొలుత టీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణకు తక్షణమే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ వెల్‌లోకి దూసుకెళ్లారు.

ఆ వెంటనే కాంగ్రెస్, వామపక్షాలు, ఎన్‌సీపీ తదితర పార్టీల సభ్యులు వ్యాపమ్, లలిత్‌గేట్ వివాదాలపై నినాదాలు చేస్తూ దూసుకొచ్చారు. తృణమూల్ కాంగ్రెస్, ఆర్‌జేడీ సభ్యులు వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంలో స్పీకర్ సుమిత్రా మహాజన్.. వివిధ అంశాలపై వాయిదా తీర్మానాల కోసం సభ్యులు ఇచ్చిన నోటీసులను తిరస్కరిస్తున్నట్టు తెలిపారు.
 
మరోవైపు.. ‘బడే మోదీ మెహర్బాన్, తో చోటే మోదీ పెహల్వాన్’ (బలవంతుడైనవ్యక్తి మద్దతుతో చిన్న వ్యక్తి కూడా బలవంతుడవుతాడనే హిందీ సామెతను నరేంద్రమోదీ, లలిత్‌మోదీలకు అన్వయించిన నినాదం), ‘ప్రధాని మౌనం వీడాలి’, ‘మోదీ గారూ 56 అంగుళాలు చూపండి.. సుష్మా, రాజేలను త్వరగా తొలగించండి’ అనే నినాదాలు రాసిన ప్లకార్డులు ప్రదర్శించారు. సుష్మా అధికారపక్షం వైపు మొదటి వరుసలో హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్, రవాణామంత్రి నితిన్‌గడ్కారీల పక్కన కూర్చున్నారు.

కాంగ్రెస్ సభ్యులు తమ చేతులపై నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. నల్ల బ్యాడ్జీలు, ప్లకార్డులు ప్రదర్శించవద్దని స్పీకర్ హెచ్చరించినా వారు వాటిని కొనసాగించారు. నిరసన తెలుపుతున్న సభ్యుల చర్యను స్పీకర్ తప్పుపట్టారు. గందరగోళం కొనసాగటంతో ప్రారంభమైన 9 నిమిషాలకే సభను స్పీకర్ 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు.
 
క్రమశిక్షణ చర్యలకు స్పీకర్ హెచ్చరిక...
సభ తిరిగి 12 గంటలకు ప్రారంభమైన తర్వాత.. సానియామీర్జా సహా అంతర్జాతీయ విజయాలు సాధించిన పలువురు క్రీడాకారులకు స్పీకర్ అభినందనలు తెలిపారు. అనంతరం.. సభలో వ్యవహరించాల్సిన తీరు, సభామర్యాదలకు సంబంధించి స్పీకర్ ప్రకటన చేస్తూ 349, 351, 352 నిబంధనలను చదివి వినిపించారు. సభ్యులు వీటికి కట్టుబడి ఉండడం లేదని, వీటిని అనుసరించని పక్షంలో తగిన క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సి వస్తుందని స్పీకర్ హెచ్చరించారు. దీంతో కాంగ్రెస్, వామపక్షాల ఆగ్రహానికి ఆజ్యం పోసినట్లయింది.

వారు మళ్లీ వెల్‌లోకి దూసుకెళ్లారు. టీఆర్‌ఎస్ సభ్యులు కూడా తమ ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో వెల్‌లోకి వెళ్లి నినాదాలు చేశారు. దీంతో పది నిమిషాల్లోనే స్పీకర్ సభను 2 గంటల పాటు వాయిదా వేశారు. తిరిగి మధ్యాహ్నం 2 గంటలకు సభ సమావేశమైన తర్వాత కూడా ఇదే పరిస్థితి కొనసాగటంతో రెండు నిమిషాలకే ఉప సభాపతి ఎం.తంబిదురై సభను గురువారానికి వాయిదా వేశారు. ఈ గందరగోళం మధ్యలోనే.. భూసేకరణ బిల్లును పరిశీలిస్తున్న సంయుక్త పార్లీమెంటరీ సంఘం గడువును పొడిగించాలన్న తీర్మానానికి ఆమోదం తెలిపారు.
 
రాజ్యసభలో వాగ్వాదాల జోరు: అటు రాజ్యసభలోనూ అదే  పరిస్థితి. బుధవారం ఉదయం సమావేశమయ్యాక.. వివిధ ప్రమాదాల్లో మృతిచెందిన వారికి నివాళులు అర్పించిన వెంటనే కాంగ్రెస్, బీఎస్‌పీ, వామపక్షాలు  సుష్మా, వసుంధర, చౌహాన్‌లు పదవులకు రాజీనామాలు చేయనిదే సభలో ఎలాంటి చర్చా సాధ్యం కాదని భీష్మించాయి. సాధారణ కార్యకలాపాలను నిలిపివేసి లలిత్‌మోదీ, వ్యాపమ్‌స్కాంపై చర్చ జరపాలని 267 నిబంధన కింద నోటీసులు ఇచ్చినట్లు సతీశ్‌చంద్రమిశ్రా (బీఎస్‌పీ), నరేశ్‌అగర్వాల్ (ఎస్‌పీ), తపన్‌కుమార్‌సేన్ (సీపీఎం), డి.రాజా (సీపీఐ)లు తెలిపారు.
 
లలిత్‌కు సాయం చేయటంలో చట్టంలోని ఏ ఒక్క నిబంధనను సుష్మా ఉల్లంఘించారో స్పష్టంగా చెప్పాలని.. సభా నాయకుడు అరుణ్‌జైట్లీ విపక్షాలను ప్రశ్నించారు. విపక్ష నేత గులాం నబీ ఆజాద్ మాట్లాడుతూ.. వాయిదానోటీసులు ఇచ్చిన  సభ్యు లు మాట్లాడేందుకు అనుమతించాలని పేర్కొనగా.. అందుకు జైట్లీ నిరసన వ్యక్తం చేస్తూ ఇటువంటి ఆచరణను ప్రతిరోజూ అనుమతించవచ్చా అని ప్రశ్నించారు. ‘‘నినాదాల  రాజకీయాలు చాలు. మీరు చర్చ ప్రారంభించండి.’’ అని అన్నారు.
 
వారు రాజీనామా చేయాలి: విపక్ష నేతలు
‘నేను తినను, తిననివ్వను’ అని బీరాలు పోయిన వారి బండారాన్ని వ్యాపమ్‌స్కాం బయటపెట్టిందని బీఎస్‌పీ అధినేత్రి మాయావతి ప్రధానిపై విమర్శలు ఎక్కుపెట్టారు. వివాదాల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రులు రాజీనామా చేయాలని జేడీయూ నేత శరద్‌యాదవ్ పేర్కొన్నారు. దర్యాప్తులో వారు నిర్దోషులుగా తేలితే వారు మరింత బలపడతారని వ్యాఖ్యానించారు. ఇందుకు ఉదాహరణగా.. 1990ల్లో జైన్ హవాలా కేసులో తమ పేర్లు వచ్చినపుడు తాను, బీజేపీ నేత అద్వానీ రాజీనామాలు చేసిన ఉదంతాన్ని ప్రస్తావించారు.
 
‘వ్యాపమ్’ ఒక రాష్ట్ర అంశం: జైట్లీ
వ్యాపమ్ కుంభకోణం అనేది ఒక రాష్ట్ర అంశమని.. రాష్ట్ర అంశాలను పార్లమెంటులో చర్చించేలా నిబంధనలు మార్చి, కొత్త సంప్రదాయాలు నెలకొల్పాలని విపక్షం భావిస్తే.. తొలుత కేరళ, హిమాచల్‌ప్రదేశ్, పుదుచ్చేరీ అస్సాం, గోవాలకు సంబంధించిన అంశాలను చర్చించాలని.. జైట్లీ ఎదురుదాడికి దిగారు. సుష్మాస్వరాజ్‌కు సంబంధించిన విషయాన్ని చర్చించాలని ప్రతిపక్షాలు కోరుకుంటే.. ఆ చర్చను ప్రారంభించాలన్నారు.

అయితే.. వ్యాపమ్ ఒక రాష్ట్రానికి పరిమితమైన అంశం కాదని, ఆ స్కాంతో సంబంధమున్న వారు మధ్యప్రదేశ్‌కు వెలుపల అనుమానాస్పదంగా చనిపోయారని సీపీఎం నేత సీతారాం ఏచూరి వాదించారు. సభ కొనసాగినంతసేపూ, వాయిదాలు వాగ్వివా దాలతోనే సాగింది. ఈ పరిస్థితుల్లో రాజ్యసభ రెండో రోజు కూడా ఎలాంటి కార్యక్రమాలు జరగకుండానే గురువారానికి వాయిదా పడింది.
 
పార్లమెంటులో పరిశోధన విభాగం: పార్లమెంట్లో కొత్తగా ఒక పరిశోధన విభాగం ఏర్పడనుంది. పార్లమెంట్లో జరిగే చర్చల్లో పాల్గొనేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్ సుమిత్ర మహాజన్‌కు విజ్ఞప్తి చేయడంతో స్పీకర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
 
ప్రత్యేక హైకోర్టు  కోసం టీఆర్‌ఎస్ ఎంపీల నిరసన
తెలంగాణ రాష్ట్రానికి తక్షణమే ప్రత్యేక హైకోర్టును ఏర్పాటు చేయాలంటూ తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీలు బుధవారం లోక్‌సభలో ఆందోళనకు దిగారు. సభ సమావేశమైన వెంటనే.. టీఆర్‌ఎస్ ఎంపీలు పది మంది వెల్‌లోకి దూసుకెళ్లి నినాదాలు మొదలుపెట్టారు. ప్రత్యేక హైకోర్టు డిమాండ్‌తో ప్లకార్డులు ప్రదర్శించారు. వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, టీడీపీ ఎంపీ చామకూర మల్లారెడ్డి తమ తమ స్థానాల్లో నిల్చొని ప్రత్యేక హైకోర్టు కావాలని ఆందోళన వ్యక్తంచేశారు.

అనంతరం పార్లమెంటు ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద టీఆర్‌ఎస్ ఎంపీలు ధర్నా చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ లోక్‌సభాపక్ష నేత ఎ.పి.జితేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రం విడిపోయి సంవత్సరమైంది. ఇప్పటివరకు పార్లమెంటు నాలుగు పర్యాయాలు సమావేశమైంది. ప్రతి సమావేశాల్లోనూ ప్రత్యేక హైకోర్టు ఇవ్వాలని అడుగుతున్నాం. మా ముఖ్యమంత్రి.. రాష్ట్రపతి, ప్రధానమంత్రి, న్యాయమంత్రి, హోంమంత్రిని కలిశారు. తప్పకుండా చేస్తామన్నారు. కానీ చేయలేదు.

రాష్ట్రం విడిపోయినప్పుడు మొట్టమొదట హైకోర్టు ఏర్పాటుచేస్తారు. కానీ కేంద్ర కేబినెట్ మంత్రులు ఉద్దేశపూర్వకంగా అడ్డుపడుతూ రావాల్సిన హైకోర్టు రాకుండా చేస్తూ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారు. తెలంగాణ కేసులన్నీ కూడా ఆంధ్రా హైకోర్టు న్యాయమూర్తుల వద్దకు వెళితే మాకు న్యాయం జరగడం లేదని మొదటి నుంచి చెప్తున్నాం. హైకోర్టు మాకు వచ్చేంతవరకు మేం నిరసన తెలుపుతాం’’ అని పేర్కొన్నారు.

ఎంపీ కె.కవిత మాట్లాడుతూ ‘‘ఈ ప్రధానమంత్రి కేబినెట్‌లోని సీనియర్ మంత్రులు కొందరు హైకోర్టు విభజన కాకుండా ఆపుతున్నారని తెలిసింది. అందువల్ల ఈ విషయంలో ప్రధానమంత్రి జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆయన తెలంగాణ ప్రజల పక్షాన నిలుస్తారని ఆశిస్తున్నాం. ఈ సమావేశాలు ముగిసేంతవరకు రోజూ నిరసన కొనసాగిస్తాం. పార్లమెంటును స్తంభింపజేసేందుకు ప్రయత్నిస్తాం’’ అని చెప్పారు.
 
కోల్‌గేట్ నిందితుడికి పాస్‌పోర్ట్ కోసం ఒత్తిడి చేశారు: సుష్మా
న్యూఢిల్లీ: కోల్‌గేట్ కుంభకోణంలో నిందితుడు సంతోష్ బగ్రోదియాకు ‘డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్’ ఇప్పించాలంటూ కాంగ్రెస్ నేత ఒకరు తనపై ఒత్తిడి తెచ్చారంటూ కేంద్రమంత్రి సుష్మ ట్విటర్‌లో బాంబు పేల్చారు. ‘‘కోల్ స్కాం నిందితుడు సంతోష్ బగ్రోదియాకు డిప్లొమాటిక్ పాస్‌పోర్ట్ ఇప్పించాల్సిందిగా కాంగ్రెస్ సీనియర్ నేత ఒకరు నాపై తీవ్రస్థాయిలో ఒత్తిడి తీసుకొచ్చారు. ఆ నేతపేరును పార్లమెంటులో వెల్లడిస్తా..’’అని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో.. పార్లమెంటు ఆవరణలో చేపట్టదలచిన మౌన దీక్షను కాంగ్రెస్ వాయిదా వేసుకుంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement