మోదీకి ఇప్పుడు పాక్ ఓ అగ్ని పరీక్ష
న్యూఢిల్లీ: కశ్మీర్‌లోని ఉడి సెక్టార్‌పై టెర్రరిస్టుల దాడి సృష్టించిన వేడితో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య భారీగా మాటల యుద్ధం కొనసాగుతోంది. టెర్రరిజాన్ని నిర్మూలించి పాకిస్థాన్‌ను దారికి తీసుకొచ్చే సత్తావున్న నాయకుడిగా 2014 పార్లమెంట్ ఎన్నికల ప్రచారం సందర్భంగా పేరు తెచ్చుకున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇప్పుడు అసలైన అగ్ని పరీక్ష ఎదురైంది. సరిహద్దుల గుండా టెర్రరిజాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్థాన్‌కు ఎలా బుద్ధి చెప్పాలన్న అంశంపై ఆయన సంబంధిత రంగాల నిపుణులను, సలహాదారులతో సమాలోచనలు సాగిస్తున్నారు.
పాకిస్థాన్‌కు శాశ్వతంగా గుణపాఠం చెప్పేందుకు సమాలోచనలతో కాలయాపన చేయడం కంటే కదన రంగానికి కాలు దువ్వడమే మంచిదనే వాదన కూడా ప్రభుత్వ వర్గాల్లో ఎక్కువగా వినిపిస్తోంది. ‘పాకిస్ధాన్‌తో స్నేహం కోసం నరేంద్ర మోదీ పదే పదే ప్రయత్నించి అలసిపోయారు. శాంతి కోసం ప్రయత్నించినప్పుడల్లా వారు టెర్రరిస్టు దాడులతో సమాధానం ఇచ్చారు. ఇక పాకిస్థాన్‌తో సంబంధాలు మునుపటిలా ఉండవు’ అని కేంద్ర చట్ట, న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు కూడా ప్రభుత్వ వర్గాల ధోరణిని సూచిస్తున్నాయి.
పాకిస్తాన్‌పై భారత్ యుద్ధం చేసేందుకు మెజారిటీ దేశ ప్రజల మద్దతు కూడా ఉందని ‘ప్యూ రిసెర్చ్ సెంటర్’ ఇటీవల నిర్వహించిన సర్వే వెల్లడించిన విషయం తెల్సిందే. సాయుధ దళాలతోనే టెర్రరిజాన్ని అణచివేయాలని 62 శాతం మంది ప్రజలు తమ సర్వేలో అభిప్రాయపడ్డారని ఆ సెంటర్ సోమవారం నాడు ప్రకటించింది. ప్రభుత్వం ఏదో ఒకటి చేయాలని, ప్రత్యక్ష కార్యాచరణకు దిగాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారని కార్గిల్ యుద్ధం సందర్భంగా భారత ఆర్మీ చీఫ్‌గా పనిచేసిన రిటైర్డ్ జనరల్ వేద్ ప్రకాష్ మాలిక్ వ్యాఖ్యానించారు.
ఏదిఏమైనా న్యూయార్క్‌లో ఈ వారంలో జరుగనున్న ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశాన్ని ఉపయోగించుకొని ప్రపంచం ముందు పాకిస్థాన్‌ను దోషిగా నిలబెట్టాలని, దౌత్యపరంగా ఒంటరిదాన్ని చేసేందుకు అన్ని రకాలుగా కృషి చేయాలని, ముఖ్యంగా ముందుగా పాకిస్థాన్‌తోని అన్ని వాణిజ్య, జల ఒప్పందాలను రద్దు చేసుకోవాలని నిపుణులు, సలహాదారులు ప్రధానికి సూచిస్తున్నట్లు తెలుస్తోంది.
గత పార్లమెంట్ ఎన్నికలకు ముందు పాకిస్థాన్ పట్ల అప్పటి యూపీఏ ప్రభుత్వం మెతక వైఖరిని అవలంభిస్తోందని ఆరోపించిన నరేంద్ర మోదీ ‘మీరు బలహీనులా?’ అంటూ ప్రభుత్వ నాయకత్వాన్ని ఉద్దేశించి ట్వీట్ చేశారు. మరి ఇప్పుడు బలమైన నాయకుడిగా ఆవిర్భవించిన మోదీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్న విషయంపై అందరి దృష్టి కేంద్రీకృతమై ఉంది.