
సాక్షి, న్యూఢిల్లీ : రాజస్థాన్‌లోని జైపూర్‌లో శనివారం జరిగిన ప్రధాని నరేంద్ర మోదీ బహిరంగ సభకు భారీ ఎత్తున ప్రజలను సమీకరించేందుకు ప్రభుత్వం నిధులను భారీగా ఖర్చు చేయడం ఎంత మేరకు భావ్యమని విజ్ఞులు, రాజకీయ విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. భారీ ఎత్తున సభకు తరలి వచ్చిన ప్రజల రవాణా సౌకర్యాల కోసం 7.23 కోట్ల రూపాయల ఖర్చు చేస్తున్నట్లు ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. సభకు వచ్చిన ప్రజల అన్న పానీయాల కోసం, ముందస్తుగా వచ్చిన వారి వసతి కోసం మరిన్ని కోట్ల రూపాయలను రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది.
ప్రధాని మాట్లాడిందీ రాజకీయ సభలోకాదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసిన ప్రభుత్వ స్కీముల గురించి ప్రజలకు తెలియజేయడం కోసం ప్రభుత్వమే ఏర్పాటు చేసిన సభని ఎవరైన వాదించవచ్చు. సభలో ప్రధాని నరేంద్ర మోదీ రాజకీయాలే ఎక్కువ మాట్లాడారని సభకు హాజరైన ఎవరినడిగినా చెబుతారు. కాంగ్రెస్‌ను ‘బెయిల్ బండి’ అంటూ మోదీ చేసిన వ్యాఖ్యలను ఎవరు మరచిపోలేరు. అయినా ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలంటే వాటిని సక్రమంగా అమలు చేయడానికి డబ్బులు ఖర్చు పెట్టాలిగానీ ఇలా సభల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేయడం ఏమిటన విజ్ఞులు ప్రశ్నిస్తున్నారు. రానున్న రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఈ భారీ సభను ఏర్పాటు చేశారని వారు విమర్శిస్తున్నారు.
కేంద్ర, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఇప్పటికే కొన్ని వందల కోట్ల రూపాయలను వాణిజ్య ప్రకటనల రూపంలో ఖర్చు పెట్టారు. ఇప్పుడు సభల కోసం భారీగా నిధులు ఖర్చు చేయడం వల్ల ప్రజా జీవితాల్లో మార్పులు వస్తాయా, వారి జీవణ ప్రమాణాలు పెరుగుతాయా? డబ్బును ఇలా వృథా చేయడానికి బదులు ప్రజల అభ్యున్నతి కోసం ఖర్చు చేస్తే వారి జీవన ప్రమాణాలు మెరగుపడవా? అవకాశం వచ్చినప్పుడల్లా ప్రతిపక్షాల అవినీతి గురించి ప్రస్తావించే మోదీకి ఇలా ప్రజా సొమ్మును వృథా చేయడం కూడా ఓ రకమైన అవినీతేనని అనిపించలేదా? అంటూ విజ్ఞులు, విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.