
డెహ్రాడూన్ : సకాలంలో ప్రమోషన్లు, అలవెన్సులతో పాటు ఇతర డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ఉత్తరాఖండ్ ప్రభుత్వ ఉద్యోగులు గురువారం మూకుమ్మడి సమ్మె చేపట్టారు. తమ డిమాండ్లను పరిష్కరించకుంటే ఫిబ్రవరి 4న రాష్ట్రవ్యాప్తంగా భారీ ర్యాలీలు నిర్వహిస్తామని, రాష్ట్రవ్యాప్త సమ్మెకు పిలుపిస్తామని సెక్రటేరియట్ యూనియన్ కార్యదర్శి వెల్లడించారు.
మరోవైపు ప్రభుత్వోద్యోగులు మూకుమ్మడి సెలవుపై వెళ్లడాన్ని ప్రభుత్వం అనుమతించందని అంతకుముందు ప్రభుత్వ అదనపు ప్రధాన కార్యదర్శి స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వోద్యోగులు ఇచ్చిన మాస్ లీవ్ పిలుపులో పాల్గొనకుండా విధులకు హాజరయ్యే సిబ్బందికి పూర్తి భద్రత కల్పిస్తామని పేర్కొన్నారు. కాగా,ఈనెల 31, ఫిబ్రవరి 4న సెలవు తీసుకునే ఉద్యోగులను సచివాలయ ప్రాంగణంలోకి అనుమతించరని, నిరసనల సీసీటీవీ ఫుటేజ్‌ను ప్రభుత్వం సేకరిస్తుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.