పక్షి.. విమానం.. కాదు రైలే! | Vande Bharat Express Will Start On 15th February | Sakshi
Sakshi News home page

పక్షి.. విమానం.. కాదు రైలే!

Published Tue, Feb 12 2019 1:16 AM | Last Updated on Tue, Feb 12 2019 1:18 AM

Vande Bharat Express Will Start On 15th February - Sakshi

వందే భారత్‌ హైస్పీడ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలు ప్రారంభోత్సవానికి ముహూర్తం ముంచుకొస్తున్న వేళ రైల్వే మంత్రి పీయూష్‌ గోయల్‌ ఆ రైలు వీడియోను పోస్టు చేస్తూ రైల్వే శాఖ ఓ సంబరానికి సిద్ధమవుతోందంటూ ట్వీట్‌ చేశారు. ‘‘ఇదొక పక్షి. ఇదొక విమానం. మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా తయారైన మొట్టమొదటి సెమీ హైస్పీడ్‌ రైలు.. ఇదిగో చూడండి.. వందే భారత్‌ మెరుపు వేగంతో ఎలా దూసుకుపోతుందో’’అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా తన ఆనందాన్ని పంచుకున్నారు. కానీ ఆయనకి ఆ ఆనందం ఎంతో సేపు నిలవలేదు. ప్రతిపక్షాలు, కొందరు నెటిజన్లు దానిపై ట్రోలింగ్‌ మొదలుపెట్టారు.  

అదో మార్ఫింగ్‌ వీడియో అని, సహజంగా ఆ రైలు నడిచే స్పీడు కంటే ఎక్కువ వేగంతో వెళుతున్నట్టుగా చూపించడానికి టెక్నాలజీని వాడుకున్నారంటూ విమర్శలు చేశారు. ఈ విమర్శల్లో కాంగ్రెస్‌ పార్టీ ముందుంది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ఖుష్బూ సుందర్‌ వీడియో ఫ్రేమ్స్‌లో స్పీడు పెంచి రైలు మెరుపు వేగంతో వెళుతోందని వర్ణిస్తే సరిపోతుందా అంటూ ట్వీట్‌ చేశారు. మోదీ ప్రభుత్వం ఎలాంటి గిమ్మిక్కులైనా చేయగలదని పీయూష్‌ మరోసారి నిరూపించారని ఇండియన్‌ యూత్‌ కాంగ్రెస్‌ జాతీయ ప్రచార ఇన్‌చార్జి శ్రీవాత్సవ కామెంట్‌ చేశారు. ఇక తృణమూల్‌ కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి ఒకరు చీట్‌ ఇండియా ఎగ్జిబిట్‌ 420 అంటూ ట్వీట్‌ చేశారు. ఇక కాంగ్రెస్‌ పార్టీ తన అధికారిక ఖాతాలో ఆ రైలు ట్రయల్‌ రన్‌ సమయంలో తీసిన అసలు వీడియోను, పీయూష్‌ గోయల్‌ పోస్టు చేసిన వీడియోను పక్కపక్క బాక్స్‌ల్లో పెట్టి రైలు వేగంలో ఎంత తేడా ఉందో చూడండి అని పోస్టు పెట్టింది. రైలు వేగం కంటే సర్కారీ అబద్ధాల స్పీడు ఎక్కువని ఎద్దేవా చేసింది. ఫాస్ట్‌ ఫార్వార్డ్‌ మోడ్‌లో రైలుని చూపించారని కొందరు, మేకిన్‌ ఇండియా కాదు.. ఫూల్‌ ఇన్‌ ఇండియా అని ఇంకొందరు, పక్షీ కాదూ, విమానమూ కాదు అదో నత్తనడక అంటూ మరికొందరు విమర్శలు చేశారు. అయితే కొందరు నెటిజన్లు మాత్రం పీయూష్‌కి అండగా నిలిచారు. ఒక బలమైన వ్యక్తిత్వం కలిగిన పీయూష్‌ అలాంటి పనులు చేయరంటూ రివర్స్‌ అయ్యారు. వందే భారత్‌ రైలు ప్రారంభమయ్యాకే దానిలో ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో అనుభవంలోకి వస్తుందని కామెంట్లు చేశారు.
 
వందే భారత్‌కు ప్రత్యేకతలెన్నో..
మనదేశానికే గర్వకారణంగా భావిస్తున్న హైస్పీడ్‌ వందే భారత్‌ రైలుని ప్రధాని నరేంద్ర మోదీ ఈ నెల 15న ఉదయం 10 గంటలకు ప్రారంభించనున్నారు. ఈ రైలుకి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయి. మన దేశంలో అత్యంత వేగంతో నడిచే శతాబ్ది రైళ్ల స్థానంలో వీటిని నడపడానికి రైల్వే శాఖ సన్నాహాలు చేస్తోంది. మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా ఈ రైలుని తయారు చేశారు. ఒకప్పుడు దీనిని ట్రైన్‌ 18 అని పిలిచేవారు. ఆ తర్వాత వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ అని పేరు మార్చారు. ఢిల్లీ, వారణాసి మధ్య నడిచే ఈ రైలు ప్రతిరోజూ ఉదయం 6 గంటలకి ఢిల్లీలో బయల్దేరి మధ్యాహ్నం 2 కల్లా వారణాసి చేరుకుంటుంది. తిరిగి వారణాసిలో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరి రాత్రి 11కి ఢిల్లీ చేరుకుంటుంది. దేశంలోని మొట్టమొదటి ఇంజిన్‌ లేని రైలు ఇదే. గంటకి 180 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలు అత్యధికంగా 200 కి.మీ. వేగంతో ప్రయాణించగలదు. ఢిల్లీ, వారణాసి మధ్య ఉన్న దూరం 770 కి.మీ దూరాన్ని కేవలం 8 గంటల్లోనే చేరుకోగలదు. మేకిన్‌ ఇండియాలో భాగంగా చెన్నై ఇంటిగ్రేటెడ్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో 18 నెలల కాలంలోనే ఈ రైలుని తయారు చేశారు. ఈ రైలు తయారీకి రూ. 97 కోట్లు ఖర్చు చేశారు.
 
శతాబ్ది కంటే ఒకటిన్నర రెట్లు ధరలు ఎక్కువ..
శతాబ్ది రైళ్లలో కంటే ఈ రైలులో టికెట్‌ ధరలు ఒకటిన్నర రెట్లు ఎక్కువగా ఉన్నాయి. ఢిల్లీ నుంచి వారణాసికి ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌ టికెట్‌ ధర రూ. 3,520 కాగా, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ ధర రూ. 1,850. ఎగ్జిక్యూటివ్‌ క్లాస్‌లో ఉదయం టీ, బ్రేక్‌ఫాస్ట్, లంచ్‌ కోసం రూ. 399 వసూలు చేస్తారు. అదే నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌లో అదే మెనూకి రూ. 344 వసూలు చేస్తారు. ఇదంతా రైలు టికెట్‌లో భాగంగానే ఉంటుంది.  

రైలు కోచ్‌లు ఎలా ఉంటాయంటే.. 

  • ఇది ఏసీ రైలు. మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి. వీటిల్లో ఎగ్జిక్యూటివ్‌ క్లాస్, నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ చైర్‌ కార్‌ కోచ్‌లు ఉంటాయి.  
  • ఒక కోచ్‌ నుంచి మరో కోచ్‌లోకి వెళ్లే సదుపాయం ఉంది.... తలుపులన్నీ ఆటోమేటిక్‌గా తెరుచుకొని మూసుకుంటాయి. 
  • యూరోపియన్‌ స్టైల్‌లో ఎటు కావాలంటే అటువైపు తిరిగే సీట్లు ఎంతో సౌకర్యవంతంగా ఉంటాయి.  
  • ప్రయాణికుల కోసం వైఫై సౌకర్యం, ప్రతీ కోచ్‌లోనూ సీసీ టీవీల ఏర్పాటు  
  • కోచ్‌ల్లో జీపీఎస్‌ ద్వారా ప్రయాణికుల వివరాలున్న వ్యవస్థ  
  • బయో వ్యాక్యూమ్‌ వ్యవస్థ కలిగిన అత్యా ధునిక టాయిలెట్‌ సౌకర్యం. వికలాంగులు కూడా హాయిగా వాడుకునేలా టాయిలెట్లు  
  • రైలు మొత్తం ఎల్‌ఈడీ లైటింగ్‌లు 
  • బయట వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా రైలు లోపల ఆటోమేటిక్‌గా వాతావరణాన్ని నియంత్రించే వ్యవస్థ 
  • దుమ్ము, ధూళి మచ్చుకి కూడా కనిపించకుండా రైలు లోపలంతా ఆరోగ్యకరమైన వాతావరణం. మొత్తమ్మీద అంతర్జాతీయ ప్రమాణాలతో పోటీపడే ఈ రైలు బోగీలను ఎగుమతి చేసుకోవడానికి చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement