మీ నెట్ ఎందుకు స్లో అయిందో తెలుసా?
మీ నెట్ ఎందుకు స్లో అయిందో తెలుసా?
Published Wed, Dec 14 2016 9:15 AM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
గత రెండు రోజులుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇంటర్‌నెట్ బాగా స్లో అయ్యింది. పేజీలు లోడ్ కావడానికి ఇంతకుముందు కంటే ఎక్కువ సమయం పడుతోంది. ఏం జరిగిందోనని కొంతమంది ఆందోళనతో తమ సర్వీస్ ప్రొవైడర్లకు ఫోన్లు చేశారు. కానీ తప్పు వాళ్లది కాదు.. వర్ధా తుపానుది! అవును.. వర్ధా తుపాను తీవ్రత కారణంగా సముద్రగర్భంలో ఉన్న పలు టెలికం కంపెనీలకు చెందిన కేబుళ్లు దెబ్బతిన్నాయి. ఎయిర్‌టెల్ కేబుళ్లు బాగా ఎక్కువగా దెబ్బతిన్నాయని, ఇతర కంపెనీలకు చెందిన కేబుళ్లు కూడా దెబ్బతినడంతో నెట్ బాగా స్లో అయిందని నిపుణులు చెబుతున్నారు. చెన్నై తీరంలో సంభవించిన తీవ్ర పెనుతుపాను కారణంగా సముద్రగర్భంలో ఉన్న తమ అంతర్జాతీయ కేబుళ్లు దెబ్బతిన్నాయని, దాంతో ఇంటర్నెట్ ట్రాఫిక్ పాక్షికంగా ప్రభావితం అయ్యిందని.. అందుకే కొన్ని ప్రాంతాల్లో ఇంటర్‌నెట్/డేటా స్పీడు బాగా తగ్గిందని ఎయిర్‌టెల్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.
ఈ విషయమై కస్టమర్లకు కూడా పలువురు సర్వీస్ ప్రొవైడర్లు ఎస్ఎంఎస్‌లు పంపుతున్నారు. దెబ్బతిన్న కేబుళ్లను సరిచేసేందుకు, ఆపరేషన్లను సాధారణ స్థితికి తెచ్చేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈలోపు అంతర్జాతీయ ఇంటర్నెట్ ట్రాఫిక్‌ను మళ్లించేందుకు ప్రత్యామ్నాయ చర్యలు కూడా తీసుకుంటున్నారు. తమ కేబుళ్లు కూడా దెబ్బతిన్నాయని వోడాఫోన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. టాటా కమ్యూనికేషన్స్, రిలయన్స్ కమ్యూనికేషన్స్.. ఇలా ప్రతి ఒక్కరికి సంబంధించిన కేబుళ్లు కూడా దారుణంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement