దిగొచ్చిన ధరలు
కాసింత ఊరట
- ఏపీఎంసీలోకి గణనీయంగా దిగుమతులు
- అమాంతం తగ్గిన కూరగాయల ధరలు
- వినియోగదారులకు కాసింత ఊరట
సాక్షి, ముంబై : కూరగాయల ధరలు తగ్గుముఖం పట్టడంతో గృహిణులకు కొంతమేర ఊరట లభించింది. మొన్నటి వరకు ధరలు మండిపోవడంతో ఆర్థికభారంతో ‘వంటి’ల్లు అతలాకుతలమైంది. వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) లోకి కూరగాయాల లోడుతో వస్తున్న ట్రక్కులు, టెంపోల సంఖ్య గణనీయంగా పెరిగిపోయింది. ఫలితంగా సరుకు నిల్వలు పెరిగిపోయి ధరలు దిగివచ్చాయి. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు ఏపీఎంసీలోకి కూరగాయల లోడుతో 614 వాహనాలు వచ్చాయి. మొన్నటితో పోలిస్తే వాహనాల సంఖ్య రెట్టింపు అయ్యింది. మరోపక్క వర్షాల కారణంగా అవి కుళ్లిపోయే ప్రమాదం ఏర్పడింది. ఇక తప్పని పరిస్థితుల్లో వ్యాపారులు ఒక్కసారిగా ధరలు తగ్గించేశారు.
శ్రావణమాసంలో శాఖాహారులకు ఊరట
గత ఆదివారం నుంచి శ్రావణ మాస ఉపవాసాలు ప్రారంభమయ్యాయి. అత్యధిక శాతం ప్రజలు శాఖహారులుగా మారారు. గణేశ్ ఉత్సవాలు పూర్తయ్యే వరకు ఈ ఉపవాసాలు కొందరు నిష్టతో పాటిస్తారు. కూరగాయలు డిమాండ్ గణనీయంగా పెరగనున్నాయని ఆందోళన చెందిన వినియోగదారులకు ఏపీఎంసీలోకి సరుకు భారీగా రావడంతో పరిస్థితులు అనుకూలంగా మారాయి. మార్కెట్లో దాదాపు 30-40 శాతం ధరలు దిగివచ్చాయి.
నిల్వచేయడమూ కష్టమే..
ఏపీఎంసీలోకి ట్రక్కులు, టెంపోలు పెద్ద సంఖ్యలో రావడంతో వాటిని ఎక్కడ నిలపాలనేది వ్యాపారులకు తలనొప్పిగా మారింది. ఖాళీ చేస్తే తప్ప వాహనాలు బయటకు వెళ్లలేవు. పగలు, రాత్రి తేడాలేకుండా టెంపోలు, ట్రక్కులు వస్తూనే ఉన్నాయి. వీటిని క్రమబద్ధీకరించడం పెద్ద సవాలుగా మారింది. అడ్డగోలుగా ధరలు తగ్గించి కూరగాయలను విక్రయించేందుకు నానా తంటాలు పడుతున్నారు.
మొన్నటి వరకు రూ.90 చొప్పున విక్రయించిన కేజీ టమాటలు ప్రస్తుతం రూ.60-65 వరకు దిగివచ్చాయి.వర్షాలు ఇలాగే కురిస్తే కూరగాయల దిగుబడి మరింత పెరగనుంది. మొన్నటి వరకు పేదలకే కాకుండా మధ్య తరగతి కుటుంబాలకు కూడా అందకుండాపోయిన కూరగాయలు ఒక్కసారిగా అందరికీ అందుబాటు ధరల్లోకి వచ్చాయి.