దేశంలో 100 స్మార్ట్ సిటీల నిర్మాణం
న్యూఢిల్లీ : కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా వెంకయ్య నాయుడు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన తన కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి పూజ నిర్వహించారు. అనంతరం వెంకయ్యనాయుడు మీడియాతో మాట్లాడుతూ దేశంలో 100 స్మార్ట్ సిటీలను నిర్మిస్తామని ప్రకటించారు. రానున్న రోజుల్లో శాటిలైట్ టౌన్షిప్లు నిర్మిస్తామన్నారు. ప్రజా రవాణా వ్యవస్థను ప్రోత్సహిస్తామని ఆయన అన్నారు. దేశంలో ఈ పదేళ్లలో క్లాస్-1 నగరాలు 394 నుంచి 468కి పెరిగాయన్నారు. ఆధ్మాత్మిక నగరాలను పరిశుభ్రంగా ఉంచుతామని తెలిపారు.
పట్టణ ప్రాంతాల్లోని 43శాతం ప్రజలు మెట్రో నగరాల్లో నివసిస్తున్నారని వెంకయ్య పేర్కొన్నారు. 2015 నాటికి సగం జనాభా పట్టణాల్లో నివసిస్తారనే అంచనా ఉందన్నారు. 2020 నాటికి దేశంలో ప్రజలందరికీ పక్కా ఇళ్లు నిర్మించి ఇస్తామని వెంకయ్య హామీ ఇచ్చారు. పేదలకు పట్టణాల్లో ఆవాసాలు కల్పిస్తామని తెలిపారు.