'నేను చాలా హర్ట్ అయ్యాను'
పట్నా : బిహార్ కాంగ్రెస్‌లో ఇప్పుడు కొత్త చర్చ ఊపందుకుంది. రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ చీఫ్‌ను ఆహ్వానించకుండానే ఓ పదిమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి పిలిపించుకొని బిహార్ రాజకీయాలపై రాహుల్‌గాంధీ చర్చపెట్టడం ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. రాహుల్ గురువారం ఢిల్లీలో బిహార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో సమావేశం అయ్యారు. అయితే, ఈ సమావేశానికి బిహార్ కాంగ్రెస్ చీఫ్ అయిన అశోక్ చౌదరిని పిలవకుండా పక్కకు పెట్టారు. దీనిపై ఓ మీడియా సంస్థ చౌదరీని ప్రశ్నించగా 'నన్ను ఎందుకు పక్కకు పెట్టారో నాక్కూడా స్పష్టంగా తెలియదు. ఈ విషయం నన్ను చాలా బాధించింది' అని చెప్పారు.
ఆయన స్పందన ప్రకారం బిహార్ కాంగ్రెస్‌లో చీలిక ఏర్పడేందుకు మరింత అవకాశం ఏర్పడినట్లు కనిపిస్తోంది. బహుషా, ఏదైనా కారణం వల్ల అశోక్ కుమార్‌ను పిలవకపోయి ఉన్నప్పటికీ ప్రస్తుతం ఇదే హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా పదిమందిని పిలిపించుకొని రాహుల్ వారితో మాట్లాడుతూ గత నాలుగేళ్లుగా బిహార్ కాంగ్రెస్ బాధ్యతలు నిర్వహిస్తున్న అశోక్ కుమార్‌ను కొనసాగించాలా తొలగించాలా అనే విషయాన్ని అడిగినట్లు తెలుస్తోంది. అయితే, అదే జరిగితే.. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తనను తొలగిస్తే దాదాపు 18 నుంచి 27మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేల మద్దతు ఉన్న అశోక్ కుమార్ పార్టీని చీల్చే అవకాశం లేకపోలేదు.