హేమమాలినికి శస్త్రచికిత్స
* కోలుకుంటున్న బాలీవుడ్ నటి
* ఆమె డ్రైవర్ అరెస్ట్, బెయిల్‌పై విడుదల
జైపూర్: రాజస్తాన్‌లోని దౌసా వద్ద గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన బాలీవుడ్ సీనియర్ నటి, బీజేపీ ఎంపీ హేమమాలినికి జైపూర్‌లోని ఫోర్టిస్ ఆస్పత్రి వైద్యులు 2 గంటలపాటు శస్త్రచికిత్స నిర్వహించారు. మత్తుమందు ఇచ్చి నుదురు, కుడి కనుబొమ్మ, ముక్కు వద్ద ఏర్పడిన గాయాలకు కుట్లు వేశారు. ముక్కు ఎముక వద్ద స్వల్ప ఫ్రాక్చర్ అయినట్లు ఆస్పత్రి ఫెసిలిటీ డెరైక్టర్ పి. తంబోలి తెలిపారు.
ముక్కు, కనుబొమల వద్ద ప్లాస్టిక్ సర్జరీ నిర్వహించామని, గాయాలు మానేందుకు 6 వారాల సమయం పడుతుందన్నారు. ఆమె ఐసీయూలో ఉన్నారని, మరో రెండు మూడు రోజులపాటు ఆమెను అబ్జర్వేషన్‌లో ఉంచాల్సి ఉందన్నారు. కాగా, కుమార్తె ఇషా డియోల్, రాజస్తాన్ సీఎం వసుంధర రాజే ఆస్పత్రిలో హేమమాలినిని పరామర్శించారు. మరోవైపు నిర్లక్ష్యంగా కారు నడిపి ఒకరి మరణానికి కారణమయ్యారన్న అభియోగాలపై హేమమాలిని డ్రైవర్ రమేశ్ చంద్ ఠాకూర్‌ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
అతన్ని స్థానిక కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం నిందితుడికి బెయిల్ మంజూరు చేసింది. హేమమాలిని ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ కారు ఎదురుగా వస్తున్న ఆల్టో కారును ఢీకొన్న ఈ ప్రమాదంలో నాలుగేళ్ల చిన్నారి మృతిచెందగా హేమమాలినితోపాటు మరో నలుగురు గాయపడటం తెలిసిందే. చిన్నారి మృతి తనను తీవ్రంగా కలచివేసిందని హేమమాలిని ఓ ప్రకటనలో తెలిపారు. కాగా, మృత్యువుతో పోరాడుతున్న నాలుగేళ్ల తన కూతురిని హేమమాలినితోపాటు కారులో వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి ఉంటే ఆమె బతికి ఉండేదని మృతురాలి తండ్రి హనుమాన్ మహాజన్ ఆరోపించారు. ధ్వంసమైన కారులో 25నిమిషాలు చిక్కుకుపోయామని తెలిపారు.