సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ , లాక్‌డౌన్ సంక్షోభ కాలంలో నాలుగ్గోడలకే పరిమితమైన మీ ఇంటికి అనుకోని అతిధి వస్తే ఎలా వుంటుంది. అదీ ఒక అందమైన సోయగాల మయూరం వచ్చి వయ్యారంగా తలుపు తడితే..ఏం చేస్తారు..సరిగ్గా ఇలాంటి అనుభవమే ఎదురైంది ఓ నెటిజనుడికి. దీంతో పరవశించిపోయిన గుంజన్ మెహతా అనే యూజర్ ఈ అపురూప దృశ్యాన్ని తమ కెమెరాలో బంధించి ట్విటర్‌లో పోస్ట్ చేశారు.
ఎక్కడినుంచి తెలీదుగానీ, ఒక నెమలి కిటికీ మీద వాలి..ఎంతో పొందిగ్గా.. టక్..టక్.టక్.. ఎవరైనా ఉన్నారా లోపల అన‍్న చందంగా ముక‍్కుతో పొడుస్తున్న ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. టీ, కాఫీ ఇచ్చి అతిథి మర్యాదలు చేయమంటే కొందరు చమత్కరిస్తోంటే.. పాపం ఆకలేస్తోందేమే.. కొద్దిగా తృణధాన్యాలు, కాస్త నీరు ఇవ్వండి అని మరికొందరు సూచిస్తున్నారు.
కోరలు చాచిన కరోనా వైరస్ నుంచి తప్పించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా లాక్‌డౌన్ అమలవుతోంది. మనుషులంతా ఇంటికే పరిమితమవుతున్నారు. ఆహారం, నీరు లభ్యం కాక కొన్ని మూగ జీవులు, పక్షులు అల్లాడుతున్నాయి. మరోవైపు అన్ని రవాణా సేవలు నిలిచిపోవడంతో కాలుష్యం గణనీయంగా తగ్గి ప్రకృతి సేదతీరుతోంది.
చదవండి : మరో మెగా డీల్‌కు సిద్ధమవుతున్న అంబానీ
Comments
Please login to add a commentAdd a comment