తింటుండగా టీమిండియాకు మాల్యా షాక్
లండన్: భారీరుణ ఎగవేతదారుడు పారిశ్రామికవేత్త విజయమాల్యా (61) టీమిండియాకు షాకిచ్చాడు. విరాట్ కోహ్లీకి సంబంధించిన స్వచ్ఛంద సంస్థ ఒకటి ఏర్పాటుచేసిన ‘చారిటీ డిన్నర్’ హాజరై టీమిండియా క్రికెటర్లను అవాక్కయ్యేలా చేశాడు. దీంతో ముందు జాగ్రత్తగా ఎలాంటి వివాదాస్పదం కాకుడదనే ఉద్దేశంతో మాల్యాను వారు దూరం పెట్టారు. ఏ ఒక్కరూ కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయలేదని తెలిసింది. అంతేకాదు, ఆ డిన్నర్ కార్యక్రమాన్ని కూడా వారు త్వరత్వరగా పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. చాంపియన్స్ ట్రోఫీకోసం ప్రస్తుతం భారత్ టీం బ్రిటన్‌లో ఉన్న విషయం తెలిసిందే.
ఆదివారం ఎడ్జ్‌బాస్టన్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌కు భారత్‌లో పలు బ్యాంకులకు రుణాలు ఎగ్గొట్టిన విజయ్‌మాల్యా కూడా వచ్చాడు. గత కొంత కాలంగా అతడిని తిరిగి భారత్‌కు రప్పించి రుణాలు మొత్తం వసూలు చేయాలనుకుంటున్న భారత్‌కు మాల్యా పెద్ద తలనొప్పిగా మారాడు. అలాంటి మాల్యా తాము వెళ్లిన ఓ డిన్నర్‌కు హాజరవడంతో షాకయ్యారు. దీనిపై బీసీసీఐ వర్గాలు స్పష్టతనిస్తూ ‘చూడండి.. విరాట్‌గానీ, ఆయన ఫౌండేషన్‌గానీ మాల్యాను ఆ కార్యక్రమానికి పిలవలేదు.
సాధారణంగా చారిటీ డిన్నర్ అంటే ఎవరైనే ఇష్టపూర్తిగా వచ్చి టేబుల్‌ను కొనుక్కొని తనకు నచ్చినవారిని ఆహ్వానించుకునే అవకాశం ఉంటుంది. అలాగే, ఎవరు ఆ టేబుల్‌ను కొనుక్కున్నారో బహుశా వారే అతడిని పిలిచి ఉంటారు. మాల్యా వచ్చాక ఇండియా టీం ఏమాత్రం సౌకర్యంగా లేరు. చాలా హుందాగా అతడి నుంచి దూరం జరిగారు. వారు ఆ డిన్నర్ నుంచి వెళ్లిపోవడానికి మాల్యా కూడా ఒక కారణమే. అతడిని వెళ్లిపోమని చెప్పే పరిస్థితి లేకపోవడం వల్లే తీవ్ర అసౌకర్యంగా భావించిన టీమిండియా క్రీడాకారులు త్వరగా వెళ్లిపోయారు.