'మాల్యా ఓ ఆర్థిక ఉగ్రవాది'
ముంబయి: విజయ్ మాల్యా విషయంలో శివసేన నిప్పులు చెరిగింది. విజయ్ మాల్యా ఒక భారత ఆర్థిక ఉగ్రవాది అని అభివర్ణించింది. అలాంటి వ్యక్తికి ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా కేంద్ర ప్రభుత్వమే పెద్ద రక్షణ కవచంగా నిలుస్తోందని మండిపడింది. అటు కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ యూపీఏ హయాంలో లెక్కలేనన్ని లోన్లు ఇచ్చారని.. ఇప్పుడేమో వాటిని ఎగ్గొట్టి పారిపోయేందుకు ఎన్డీయే ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొంది.
శుక్రవారం తన అధికారిక పత్రిక సామ్నాలో శివసేన ఈ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసింది. వేల కోట్లలో కుంభకోణానికి పాల్పడి ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నుంచి కాక ఎదుర్కొంటున్న మాల్యాకు కేంద్ర ప్రభుత్వమే రక్షణగా నిలిచిందని కథనం వెలువరించింది. 'పారిపోయేందుకు కేంద్ర ప్రభుత్వం అవకాశం ఇచ్చిన విజయ్ మాల్యా ఓ భారత ఆర్థిక ఉగ్రవాది' అని సామ్నా పేర్కొంది. 'మాల్యాకు అనుకూలంగా ఎంతోమంది రాజకీయ నాయకులు అధికారులు ఉన్నారు. అందుకే ఇంతపెద్ద మొత్తం కుంభకోణం జరిగింది. ఇప్పుడు అదే నాయకుల సహాయం తీసుకొని మాల్యా పారిపోయాడు' అని సేన ఆరోపించింది.