చైనాపై సర్జికల్ స్ట్రైక్స్..!
కేంద్రానికి ఆ ఉద్దేశం ఉందా?
ఉడీ ఉగ్రవాద దాడి నేపథ్యంలో పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం వీరోచితంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు సరిహద్దుల్లో చైనా దుందుడుకుగా వ్యవహరిస్తోంది. ఇటీవల లడఖ్‌లో చైనా సైన్యం చొచ్చుకొని వచ్చినట్టు కథనాలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ దేశానికి వ్యతిరేకంగా సర్జికల్ స్ట్రైక్స్ చేసే ఉద్దేశం కేంద్ర ప్రభుత్వానికి ఉందా? అంటూ మిత్రపక్షం శివసేన ప్రశ్నించింది.
‘పాకిస్థాన్‌లో జరిగిన సర్జికల్ స్ట్రైక్స్ తో మేం గర్వంగా ఉన్నాం. పాకిస్థాన్‌లో జరిగిన తరహాలోనే చైనాలోనూ సర్జికల్ స్ట్రైక్స్ జరిగే అవకాశముందా’ అని శివసేన అధికార పత్రిక ‘సామ్నా’ తన సంపాదకీయంలో ప్రశ్నించింది. రక్షణమంత్రి మనోహర్ పరీకర్ సొంత డబ్బా కొట్టుకునే వ్యక్తిని విమర్శించింది.
‘చైనా చొరబాటుకు వ్యతిరేకంగా మన సైనికులు ఏం చర్య తీసుకున్నారో బడాయిలు చెప్పుకొనే రక్షణమంత్రి వెల్లడించాలి. కేవలం పాకిస్థాన్‌కు హెచ్చరికలు జారీచేస్తే సరిపోదు. రక్షణమంత్రిగా చైనాతో మన సరిహద్దులను భద్రంగా చూసుకోవాల్సిన బాధ్యత ఆయనపై ఉంది. ర్యాలీల్లో పాకిస్థాన్‌కు వ్యతిరేకంగా మాట్లాడితే హర్షాతిరేకాలు లభిస్తాయి. రాజకీయ హర్షాతిరేకాల కోసం కాకుండా దేశ సమగ్ర భద్రతపై దృష్టి పెట్టాల్సిన తరుణమిది’ అని ‘సామ్నా’ పేర్కొంది. ఇతర సరిహద్దుల్లో భద్రతను గాలికొదిలేసి కేవలం పాకిస్థాన్‌తో ఉన్న సరిహద్దులపైనా కేంద్రం దృష్టి పెట్టినట్టు కనిపిస్తోందని విమర్శించింది.
‘చైనా పట్ల మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. పాకిస్థాన్‌కు ఒక్క అంగుళం కూడా విడిచిపెట్టే ప్రసక్తి లేదని మనం మాట్లాడుతాం. అదే సమయంలో లేహ్‌లో, లడఖ్‌లో, అరుణాచల్‌ప్రదేశ్‌లో చైనా తీవ్రంగా చొచ్చుకొచ్చిన మనం మాట్లాడటం లేదు. ఇది సరికాదు’ అని పేర్కొంది. కేంద్రంలో బీజేపీ సర్కారుకు మిత్రపక్షంగా కొనసాగుతున్నప్పటికీ ఆ పార్టీతో అంటీముట్టినట్టు వ్యవహరిస్తూ గతకొన్నాళ్లుగా శివసేన విమర్శలు సంధిస్తున్న సంగతి తెలిసిందే.