అహ్మదాబాద్ : నూతన మోటారు వాహన సవరణ చట్టంపై దేశ వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్న వేళ గుజరాత్‌లోని బీజేపీ ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త మోటారు వాహన చట్టాన్ని అమలుచేస్తూనే.. అందులోని జరిమానాలను సగానికి సగం తగ్గిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త మోటారు వాహన చట్టంలో భారీగా జరిమానాలు విధిస్తుండటంతో వాహనదారులు బండిని బయటకు తీయాలంటేనే బెదిరిపోతున్నారు. భారీగా ట్రాఫిక్ చలాన్లు విధిస్తుండటంపై సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గుజరాత్ సీఎం విజయ్‌రూపానీ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ ట్రాఫిక్ ఉల్లంఘనలపై తాజాగా విధిస్తున్న జరిమానాలను తగ్గిస్తున్నామని ప్రకటించారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు తెచ్చిన చట్టాన్ని గుజరాత్‌లోని సొంత పార్టీ సర్కారే యథాతథంగా అమలుచేయకపోవడం గమనార్హం. సాక్షాత్తు గుజరాత్‌లోనే ఈ నిర్ణయం తీసుకోవడంతో పలు రాష్ట్రాలు కూడా ఇదే దారిలో సాగే అవకాశముందని అంటున్నారు.
గుజరాత్ ప్రభుత్వం తాజాగా సవరించిన జరిమానాలివి..
- హెల్మెట్ లేకుండా వాహనం నడిపితే రూ.1,000 జరిమానా విధిస్తుండగా.. దానిని రూ.500కి తగ్గించింది.
- డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే రూ. 5వేల జరిమానాను విధిస్తుండగా.. దానిని రూ.3వేలకు తగ్గించింది.
- సీటు బెల్టు పెట్టుకోకుండా డ్రైవ్ చేస్తూ పట్టుబడితే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది.
- ఆర్సీ, పీయూసీ, ఇన్సూరెన్స్ తదితర పేపర్లు లేకుంటే రూ.1,000గా ఉన్న జరిమానాను రూ.500కి తగ్గించింది.
- ట్రిపుల్ రైడింగ్ చేస్తే రూ.1,000 జరిమానాను ఏకంగా రూ.100కి తగ్గించింది
- వాహన కాలుష్యంపై రూ.10వేల జరిమానాను చిన్న వాహనాలకు రూ.1,000, పెద్ద వాహనాలకు రూ. 3వేలు తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది.
ప్రజలు ట్రాఫిక్ చట్టాలను చాలా తేలికగా తీసుకుంటున్నారని, చట్టం పట్ల భయంకానీ, గౌరవంకానీ లేనందుకే కఠినమైన చట్టం తీసుకొచ్చామని మోటారు వాహన చట్టం సవరణ సందర్భంగా కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యానించడం తెలిసిందే. జరిమానాలు తగ్గించడం ద్వారా గడ్కరీ అభిప్రాయంతో రూపానీ సర్కారు పరోక్షంగా విభేదించినట్టయిందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చదవండి : లుంగీకి గుడ్‌బై చెప్పకపోతే.. మోత మోగుడే
Comments
Please login to add a commentAdd a comment