గుజరాత్ సీఎంగా రూపానీ ప్రమాణ స్వీకారం
గాంధీనగర్: గుజరాత్ సీఎంగా విజయ్ రూపానీ ఆదివారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇక్కడి మహాత్మా మందిర్‌లో గవర్నర్ ఓపీ కోహ్లి మధ్యాహ్నం ఆయనతో ప్రమాణం చేయించారు. ఉప ముఖ్యమంత్రిగా నితిన్ పటేల్ ప్రమాణం చేశారు. వచ్చే ఏడాది జరగనున్న ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా డిప్యూటీ సీఎం పదవి ఏర్పాటు చేశారు. నితిన్‌తో సహా 8 మంది కేబినెట్ మంత్రులు, 16 మంది సహాయ మంత్రులు వెరసి 24 మంది మంత్రులు ప్రమాణం చేశారు. పాత మంత్రివర్గంలో నుంచి ఆనందీబెన్ పటేల్ వర్గానికి చెందిన ఇద్దరు, మరో ఏడుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు.
ఆనందీబెన్ వర్గీయులైన హోం సహాయ మంత్రి రజనీభాయ్ పటేల్, స్త్రీ, శిశు అభివృద్ధి శాఖ మంత్రి వసుబెన్ త్రివేదిలను కొత్త కేబినెట్‌లోకి తీసుకోలేదు. ఆర్థిక మంత్రి సౌరభ్, సాంఘిక న్యాయ మంత్రి వోరా, శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞాన మంత్రి గోవింద్ పటేల్‌లకు ఉద్వాసన పలికారు. వచ్చే ఏడాది ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా మంత్రివర్గంలో అన్ని కులాలకు, ప్రాంతాలకు ప్రాతినిధ్యం కల్పించేందుకు ప్రయత్నించారు. పటేల్ వర్గానికి చెందిన 8 మందికి మంత్రివర్గంలో స్థానం కల్పించారు.
కేబినెట్‌లోకి ఒకే ఒక మహిళ (నరోడ ఎమ్మెల్యే నిర్మల వాధ్వానీ)ను తీసుకున్నారు. ఈ కార్యక్రమానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా, అగ్రనేత అద్వానీ కేంద్ర మంత్రులు అరుణ్ జైట్లీ, హర్షవర్ధన్, మహారాష్ట్ర, జార్ఖండ్, హరియాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవీస్, రఘుబర్ దాస్, మనోహర్ లాల్ ఖట్టర్, మాజీ సీఎం ఆనందీబెన్ పటేల్‌తో సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ప్రధాని మోదీ అభినందనలు
గుజరాత్ కొత్త సీఎం బాధ్యతలు చేపట్టిన రూపానీకి ప్రధానిమోదీ అభినందనలు తెలిపారు. తెలంగాణ పర్యటన వల్ల రూపానీ ప్రమాణ స్వీకారానికి హాజరు కాలేక పోయిన మోదీ.. రూపానీ, నితిన్ బృందం రాష్ట్రాభివృద్ధిలో పాలుపంచుకోవాలని ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగిన ఆనందీబెన్ పటేల్ సేవలు స్ఫూర్తిదాయకమని మరో ట్వీట్‌లో కొనియాడారు.