
దావుద్ లొంగిపోతానంటే వదిలేస్తామా?..
హైదరాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం లొంగబాటు గురించి ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను అప్పటి సీబీఐ చీఫ్ విజయ రామారావు తీవ్రంగా ఖండించారు. తాను సీబీఐ చీఫ్గా ఉన్నప్పుడు దావుద్కు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు. దావుద్ కోసం ఇప్పటికీ అనేక దేశాలు వెతుకుతున్నాయని లొంగిపోతానంటే వదిలేస్తామా అని విజయ రామారావు ప్రశ్నించారు.
దావుద్ లొంగుబాటుపై అప్పట్లో తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అతని గురించి చాలా సమాచారం మాత్రం వచ్చిందని, అయితే లొంగుపోతానని దావుద్ ప్రతిపాదన చేయలేదన్నారు. తాను సీబీఐ చీఫ్గా ఉన్నప్పుడు దావుద్ కోసం దుబాయ్ సహా అనేక దేశాల్లో ఎంతో గాలించామని విజయ రామారావు తెలిపారు. దావుద్ సరెండర్ అవుతానన్న విషయం తనకు ఏ అధికారి చెప్పలేదని, ఏ సమాచారం ఇచ్చినా రికార్డు అవుతుందని ఆయన పేర్కొన్నారు.
కాగా ముంబై వరుస పేలుళ్లు జరిగిన 15 నెలలకే ప్రధాన సూత్రదారి దావుద్ లొంగిపాతానని రాయబారం నడిపినట్టు నీరజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి సీబీఐ డీఐజీగా ఉన్న తనకు దావుద్ మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు ఆయన చెప్పారు. భారత్ వస్తే ప్రత్యర్థులు తనని హతమారుస్తారెమోననే భయంతోనే దావుద్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు నీరజ్ తెలిపారు. కానీ అతను లొంగిపోతానన్న ప్రతిపాదనని అప్పటి సీబీఐ చీఫ్ విజయ రామారావు అంగీకరించలేదని అన్నారు.