vijaya ramarao
-
తొలి జాబితా నిరాశ పరిచింది: రేణుకా చౌదరి
సాక్షి, న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తొలి జాబితా అందరినీ తీవ్రం గా నిరాశపరిచిందని కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అన్నారు. మంగళవారం ఆమె ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్ర ఉద్యమంలో కీలకపాత్ర పోషిం చిన యువతను విస్మరించారని, అభ్యర్థుల ఎం పికలో కొన్ని అవకతవకలు జరిగినట్టు అనిపిస్తోందన్నారు. ఈ విషయంపై తన పరిధిలో ఉన్నంత వరకు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తానని చెప్పారు. ఖమ్మం జిల్లాలో అధిక సంఖ్యలో ఉన్న కమ్మ సామాజిక వర్గానికి ఒక్క సీటు కూడా కేటాయించలేదన్నారు. పొత్తులో భాగంగా టీడీపీకి ఇచ్చామని చెప్పడం సరికాదని, కాంగ్రెస్ తరఫున ఆ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘18న ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తా’ సాక్షి, న్యూఢిల్లీ: స్టేషన్ ఘన్పూర్ అసెంబ్లీ స్థానానికి ఈ నెల 18న ఇండిపెండెంట్‌గా నామినేషన్ దాఖలు చేయనున్నట్లు కాంగ్రెస్ నుంచి ఆ సీటు ఆశించి భంగపడ్డ మాజీ మంత్రి విజయరామారావు ప్రకటించారు. మంగళవారం ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ.. స్టేషన్ ఘన్‌పూర్‌లో పార్టీని బలోపేతం చేసేందుకు తాను కృషి చేస్తే నియోజకవర్గంతో సంబంధం లేని వారికి టికెట్ కేటాయించినందుకు కాంగ్రెస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వం కూడా లేని ఇందిరకు టికెట్ ఇవ్వడం శోచనీయమని, ఆమె ఎలా గెలుస్తారో చూస్తానన్నారు. -
సుజనా కంపెనీల్లో పనిచేయడం వల్లే..
సాక్షి, హైదరాబాద్: సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లలో తమ సోదరుడు శ్రీనివాస్ పనిచేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సీబీఐ మాజీ డెరైక్టర్ విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ వ్యాఖ్యానించారు. సుజనా కంపెనీల్లో పనిచేస్తే ఏదో ఒకరోజు కుంభకోణంలో ఇరుక్కోవాల్సి వస్తుందని శ్రీనివాస్‌ను తమ తండ్రి విజయరామారావు గతంలో పదేపదే హెచ్చరించినట్లు తెలిపారు. చివరకు అనుకున్నట్లుగానే తమ సోదరుడిని కుట్రపూరితంగా సీబీఐ కేసులో ఇరికించారని వాపోయారు. సోమవారమిక్కడ ఆమె ఒక టీవీ చానల్‌తో మాట్లాడారు. తప్పుడు పత్రాల ద్వారా బ్యాంకులను మోసం చేసి రూ.304 కోట్లు రుణం తీసుకున్నారని, సీబీఐ తమ సోదరుడిపై కేసు నమోదు చేసినట్లు పేపర్లో వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయామన్నారు. ‘‘2012లో బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అప్పుడు శ్రీనివాస్ సుజనా కంపెనీలలో పనిచేసే వారు. సుజనా కంపెనీలలో శ్రీనివాస్ పనిచేయడం నాన్నకు మొదట్నుంచీ ఇష్టం లేదు. అందుకే ఆ కంపెనీల్లో పని చేయవద్దని పదేపదే హెచ్చరించారు. మా అనుమానాలు నిజం చేస్తూ చీటింగ్ కేసు నమోదైంది. కుట్రలో భాగంగానే మా సోదరుడిపై కేసు నమోదు చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే బ్యాంకుల నుంచి అంత పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాల్సిన అవసరం శ్రీనివాస్‌కు లేదన్నారు. రూ.లక్ష రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష ఆధారాలు, కొర్రీలు విధించే బ్యాంకులు వందల కోట్ల రూపాయలు ఎలా మంజూరు చేశాయో అర్థం కావడం లేదన్నారు. తప్పుడు పత్రాలు చూపి రుణం పొందారని బ్యాంకులు చేసిన ఫిర్యాదును తాము నమ్మడం లేదన్నారు. డబ్బుల పంపిణీ ఎక్కడ్నుంచి ఎక్కడికి జరిగిందో త్వరలో వెలుగులోకి వస్తుందన్నారు. ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో తమ సోదరుడు శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడిస్తారన్నారు. -
గ్రేటర్లో టీడీపీకి మరో షాక్
-
గ్రేటర్లో టీడీపీకి మరో షాక్
హైదరాబాద్: గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీకి మరో షాక్ తగిలింది. ఆ పార్టీకి మాజీ మంత్రి విజయ రామారావు రాజీనామా చేశారు. గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన మాజీ సీఎల్పీ నేత దివంగత పి.జనార్ధన్‌రెడ్డి(పీజేఆర్) పై గెలిచి మంత్రి అయిన సంగతి తెలిసిందే. అంతేకాక గతంలో సీబీఐ డైరెక్టర్‌గా విజయరామారావు పనిచేశారు. ప్రస్తుతం అధికార పార్టీ టీఆర్ఎస్లో విజయ రామారావు చేరతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఒకవేళ విజయ రామారావు టీఆర్ఎస్ పార్టీ లో చేరితే ఆపరేషన్ ఆకర్ష్ మరోసారి ఊపందుకున్నట్లే. జీహెచ్ఎంసీ ఎన్నికల హడావిడి మొదలైన నేపథ్యంలో ఆయా పార్టీల నుంచి అధికార టీఆర్ఎస్ లోకి భారీ వలసలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖర్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. -
నా వ్యాఖ్యలు వక్రీకరించారు
‘దావూద్ లొంగుబాటు’ వార్తలకు సీబీఐ మాజీ అధికారి నీరజ్ కుమార్ ఖండన దావూద్ లొంగిపోతాడన్న సమాచారం ఎవరూ ఇవ్వలేదు: విజయరామారావు న్యూఢిల్లీ/హైదరాబాద్: మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం 1993 ముంబై బాంబు పేలుళ్ల అనంతరం లొంగిపోతానని తనతో సంప్రదింపులు జరిపారని, అయితే అప్పటి ప్రభుత్వం చివరి క్షణంలో ఆ ప్రయత్నాలను వమ్ముచేసిందని తాను చెప్పినట్లు వచ్చిన వార్తలు అవాస్తవమని ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్, నాడు సీబీఐ డీఐజీగా ముంబై పేలుళ్ల కేసును దర్యాప్తు చేసిన నీరజ్‌కుమార్ ఖండించారు. ముంబై పేలుళ్లకు సూత్రధారిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దావూద్.. తనతో సంప్రదింపులు జరిపాడని, లొంగిపోవటానికి సంసిద్ధత తెలిపాడని, అయితే అప్పటి తన రాజకీయ బాసులు ఈ ప్రణాళికను చివరి క్షణంలో అడ్డుకున్నారని నీరజ్ తమకిచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నట్లు జాతీయ ఆంగ్ల దినపత్రిక శనివారం ఒక కథనం ప్రచురించింది. దీనిపై నీరజ్ స్పందిస్తూ.. తాను ఆ పత్రికకు ఇంటర్వ్యూ ఇవ్వలేదని, సదరు విలేకరి తనకు తెలుసునని, ఆయనతో మాట్లాడిన మాటలను వక్రీకరించారని.. అవి సరికాదని, దురదృష్టకరమైనవని శనివారం మీడియాతో అన్నారు. అయితే.. తాను సీబీఐ డీఐజీగా ముంబై పేలుళ్ల కేసును దర్యాప్తు చేసినపుడు దావూద్ తనతో మాట్లాడాడని, అది పేలుళ్లలో తన పాత్ర లేదని చెప్పటం కోసమే మాట్లాడాడని తెలిపారు. లొంగిపోతాడంటే వద్దని ఎవరంటారు? ఇదిలావుంటే.. దావూద్ లొంగిపోవటానికి సిద్ధపడినప్పటికీ, అప్పటి ప్రభుత్వం అడ్డుకుందని నీరజ్ అన్నట్లు వచ్చిన కథనాన్ని నాడు సీబీఐ డెరైక్టర్‌గా ఉన్న విజయరామారావు ఖండించారు. ‘ముంబై పేలుళ్లు జరిగిన 4 నెలలకు నేను సీబీఐ డెరైక్టర్‌గా బాధ్యతలు తీసుకున్నా. నేను ఉన్న మూడేళ్లు దావూద్‌ను పట్టుకునేందుకు చాలా ప్రయత్నాలు చేశాం. అప్పుడు దావూద్ కేసులో నీరజ్ సీబీఐలో చీఫ్ ఇన్వెస్టిగేటివ్ అధికారి. ఆయనపైన మరో అధికారి జాయింట్ డెరైక్టర్ హోదాలో ఉన్నారు. దావూద్ సరెండర్ అవడానికి సిద్ధంగా ఉన్నారనే సమాచారం.. ఏ అధికారీ నాకు చెప్పలేదు. దావూద్ లొంగిపోవడానికి ప్రయత్నాలు చేస్తే.. చేసి ఉండొచ్చు. లొంగిపోతాడంటే.. వద్దని ఎవరు చెప్తారు? అతడు లొంగిపోతాడనే సమాచారం నాకు ఎవ్వరూ ఇవ్వలేదు. నేను ఉన్న మూడేళ్ల కాలంలో ఎప్పుడూ దావూద్ లొంగిపోతాడన్న సమాచారం రాలేదు. ఒకవేళ లొంగిపోతానంటే.. పట్టుకోడానికి మాకేం అభ్యంతరం? ఎలాంటి సమాచారం వచ్చినా.. అది సీబీఐలో రికార్డు అవుతుంది. దావూద్గురించి అనేక సమాచారం వచ్చింది... కాని సరెండర్ సమాచారం మాత్రం రాలేదని కచ్చితంగా చెప్పగలను’ అని ఆయన శనివారం హైదరాబాద్‌లో ‘సాక్షి’ టీవీకి చెప్పారు. -
దావుద్ లొంగిపోతానంటే వదిలేస్తామా?..
హైదరాబాద్ : అండర్ వరల్డ్ డాన్ దావుద్ ఇబ్రహీం లొంగబాటు గురించి ఢిల్లీ మాజీ పోలీస్ కమిషనర్ నీరజ్ కుమార్ చేసిన వ్యాఖ్యలను అప్పటి సీబీఐ చీఫ్ విజయ రామారావు తీవ్రంగా ఖండించారు. తాను సీబీఐ చీఫ్‌గా ఉన్నప్పుడు దావుద్‌కు సంబంధించిన ఎలాంటి ప్రతిపాదనలు రాలేదని ఆయన శనివారమిక్కడ స్పష్టం చేశారు. దావుద్ కోసం ఇప్పటికీ అనేక దేశాలు వెతుకుతున్నాయని లొంగిపోతానంటే వదిలేస్తామా అని విజయ రామారావు ప్రశ్నించారు. దావుద్ లొంగుబాటుపై అప్పట్లో తనకు ఎలాంటి సమాచారం లేదన్నారు. అతని గురించి చాలా సమాచారం మాత్రం వచ్చిందని, అయితే లొంగుపోతానని దావుద్ ప్రతిపాదన చేయలేదన్నారు. తాను సీబీఐ చీఫ్‌గా ఉన్నప్పుడు దావుద్ కోసం దుబాయ్ సహా అనేక దేశాల్లో ఎంతో గాలించామని విజయ రామారావు తెలిపారు. దావుద్ సరెండర్ అవుతానన్న విషయం తనకు ఏ అధికారి చెప్పలేదని, ఏ సమాచారం ఇచ్చినా రికార్డు అవుతుందని ఆయన పేర్కొన్నారు. కాగా ముంబై వరుస పేలుళ్లు జరిగిన 15 నెలలకే ప్రధాన సూత్రదారి దావుద్ లొంగిపాతానని రాయబారం నడిపినట్టు నీరజ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పటి సీబీఐ డీఐజీగా ఉన్న తనకు దావుద్ మూడుసార్లు ఫోన్ చేసి మాట్లాడినట్టు ఆయన చెప్పారు. భారత్ వస్తే ప్రత్యర్థులు తనని హతమారుస్తారెమోననే భయంతోనే దావుద్ లొంగిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు నీరజ్ తెలిపారు. కానీ అతను లొంగిపోతానన్న ప్రతిపాదనని అప్పటి సీబీఐ చీఫ్ విజయ రామారావు అంగీకరించలేదని అన్నారు. -
దావుద్ లొంగుతానంటే వదిలేస్తామా?