సాక్షి, హైదరాబాద్: సుజనా గ్రూప్ ఆఫ్ కంపెనీస్‌లలో తమ సోదరుడు శ్రీనివాస్ పనిచేయడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని సీబీఐ మాజీ డెరైక్టర్ విజయరామారావు కుమార్తె అన్నపూర్ణ వ్యాఖ్యానించారు. సుజనా కంపెనీల్లో పనిచేస్తే ఏదో ఒకరోజు కుంభకోణంలో ఇరుక్కోవాల్సి వస్తుందని శ్రీనివాస్‌ను తమ తండ్రి విజయరామారావు గతంలో పదేపదే హెచ్చరించినట్లు తెలిపారు. చివరకు అనుకున్నట్లుగానే తమ సోదరుడిని కుట్రపూరితంగా సీబీఐ కేసులో ఇరికించారని వాపోయారు. సోమవారమిక్కడ ఆమె ఒక టీవీ చానల్‌తో మాట్లాడారు.
తప్పుడు పత్రాల ద్వారా బ్యాంకులను మోసం చేసి రూ.304 కోట్లు రుణం తీసుకున్నారని, సీబీఐ తమ సోదరుడిపై కేసు నమోదు చేసినట్లు పేపర్లో వచ్చిన వార్తలు చూసి ఆశ్చర్యపోయామన్నారు. ‘‘2012లో బ్యాంకుల నుంచి రుణం తీసుకున్నట్లు వార్తలొచ్చాయి. అప్పుడు శ్రీనివాస్ సుజనా కంపెనీలలో పనిచేసే వారు. సుజనా కంపెనీలలో శ్రీనివాస్ పనిచేయడం నాన్నకు మొదట్నుంచీ ఇష్టం లేదు. అందుకే ఆ కంపెనీల్లో పని చేయవద్దని పదేపదే హెచ్చరించారు. మా అనుమానాలు నిజం చేస్తూ చీటింగ్ కేసు నమోదైంది. కుట్రలో భాగంగానే మా సోదరుడిపై కేసు నమోదు చేశారు’’ అని ఆమె వ్యాఖ్యానించారు. అయితే బ్యాంకుల నుంచి అంత పెద్ద మొత్తంలో రుణం తీసుకోవాల్సిన అవసరం శ్రీనివాస్‌కు లేదన్నారు.
రూ.లక్ష రుణం మంజూరు చేయాలంటే సవాలక్ష ఆధారాలు, కొర్రీలు విధించే బ్యాంకులు వందల కోట్ల రూపాయలు ఎలా మంజూరు చేశాయో అర్థం కావడం లేదన్నారు. తప్పుడు పత్రాలు చూపి రుణం పొందారని బ్యాంకులు చేసిన ఫిర్యాదును తాము నమ్మడం లేదన్నారు. డబ్బుల పంపిణీ ఎక్కడ్నుంచి ఎక్కడికి జరిగిందో త్వరలో వెలుగులోకి వస్తుందన్నారు. ఈ విషయంపై రెండు, మూడు రోజుల్లో తమ సోదరుడు శ్రీనివాస్ మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు వెల్లడిస్తారన్నారు.
సుజనా కంపెనీల్లో పనిచేయడం వల్లే..
Published Tue, Feb 23 2016 3:03 AM | Last Updated on Sun, Sep 2 2018 5:11 PM
Advertisement
Advertisement