సాక్షి, హైదరాబాద్ : ఆదాయానికిమించి ఆస్తులు ఆరోపణలతో అడ్డంగా దొరికిపోయిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మాజీ అధికారి, జీఎస్టీ సూపరింటెండెంట్ బొల్లినేని శ్రీనివాస గాంధీకు సీబీఐ నోటీసులు జారీ చేసింది. ఆయన ఆదాయానికి మించి విచ్చలవిడిగా ఆస్తులు కూడబెట్టినట్లు గుర్తించిన సీబీఐ అధికారులు నిన్న ఏకకాలంలో దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్న అధికారులు ఎప్పుడు పిలిచినా విచారణకు హాజరు కావాలని ఆ నోటీసుల్లో పేర్కొంది. కాగా జీఎస్‌టీ పన్ను ఎగవేత విభాగం సూపరింటెండెంట్‌గా కూడా ఆయన పలు కంపెనీలను ఇబ్బందులకు గురిచేశారన్న ఆరోపణలతో వీటిపై కూడా సీబీఐ దర్యాప్తు చేపట్టింది. అలాగే హై ప్రొఫైల్ కేసులను డీల్ చేయడంలో పాటు, సీరియస్ కేసులను... చిన్న కేసులుగా మార్చి ఆ కేసులను మూసివేయడంలో ఘనాపాటీ అని ఆరోపణలు వెల్లువెత్తాయి.
చదవండి: సీబీఐకి బుక్కయిన బొల్లినేని గాంధీ
భారీ బ్యాంక్ ఫ్రాడ్ కేసులైన ఫోనిక్స్ గ్రూప్, ముసద్దీలాల్ జువెల్లరీ, లాంకో గ్రూప్, సుజనా గ్రూప్, క్యూ సిటీ గ్రూప్ కేసులను డీల్ చేసి... నిందితులకు సహకరించారని బొల్లినేని గాంధీపై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా ఆయన డీల్ చేసిన ఏ కేసు కూడా ఓ కొలిక్కి రానివ్వరంటూ ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే పూర్తి ఆధారాలున్నా కూడా సుజనా కంపెనీలపై ఎటువంటి చర్యలు తీసుకోలేదన్న ఫిర్యాదులు గాంధీపై వెల్లువెత్తాయి. ఇదే రీతిలో పలు కంపెనీల విషయంలోనూ గాంధీ చూసీచూడనట్లు వ్యవహరించారని.. ఫైళ్లను తారుమారు చేశారని కేంద్ర ఆర్థిక శాఖకు గతంలోనే పెద్ద సంఖ్యలో ఫిర్యాదులు అందాయి. చంద్రబాబు రాజకీయ ప్రయోజనాలను కాపాడిన నేపథ్యంలోనే గాంధీ ఇంత భారీస్థాయిలో అక్రమాస్తులను కూడబెట్టినట్లు సీబీఐ అధికారులు అనుమానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment