కెనడా హైకమిషనర్‌గా వికాస్ స్వరూప్
న్యూఢిల్లీ: విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ కెనడాలో భారత హైకమిషనర్‌గా నియమితులయ్యారు. ప్రçస్తుతం అదనపు కార్యదర్శి హోదాలో కొనసాగుతున్న ఆయన త్వరలోనే కొత్త బాధ్యతలు చేపడతారని విదేశాంగ శాఖ వెల్లడించింది. పాకిస్తాన్ అఫ్గానిస్తాన్ , ఇరాన్ డివిజన్ లో ఉమ్మడి కార్యదర్శిగా విధులు నిర్వర్తిస్తున్న గోపాల్ బాగ్లే స్వరూప్ స్థానంలో విదేశాంగ శాఖ నూతన అధికార ప్రతినిధిగా నియమితులవుతారు.
1986 బ్యాచ్ ఐఎఫ్‌ఎస్ అధికారి అయిన స్వరూప్ విదేశాంగ శాఖ సేవలను సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు చేరువచేయడంలో కీలకపాత్ర పోషించారు. ఆయన రాసిన తొలి నవల ‘క్యూ అండ్ ఏ’ను ఆస్కార్ అవార్డు గెలుపొందిన ‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ చిత్రంగా తీశారు.