రోహింగ్యా శరణార్థుల శిబిరంలో చిన్నారులతో ముచ్చటిస్తున్న ప్రియాంక చోప్రా
లక్నో : రోహింగ్యా శరణార్థులను సందర్శించడానికి వెళ్లిన వారెవరైనా దేశం విడిచి వెళ్లిపోవాలంటూ ప్రియాంక చోప్రాను ఉద్దేశించి ఉత్తరప్రదేశ్ బీజేపీ నేత వినయ్ కతియార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. జాతీయ మీడియా కథనం ప్రకారం..‘రోహింగ్యాల నిజ స్వరూపం ప్రియాంక వంటి వాళ్లకు తెలియకపోవచ్చు. ఆమె అసలు వాళ్లను కలవడానికి వెళ్లాల్సింది కాదు. రోహింగ్యా ముస్లింలకు ఇక్కడ(భారత్‌లో) చోటు లేదు. అలాగే వాళ్లకు సానుకూలంగా మాట్లాడే వారికి కూడా ఇక్కడ స్థానం లేదు. రోహింగ్యాల పట్ల సానుభూతి చూపడానికి ఢాకా వెళ్లిన ప్రియాంక, ఆమె లాంటి మరెవరైనా ఈ దేశాన్ని(భారత్) విడిచి వెళ్లాల్సి ఉంటుందంటూ’ వినయ్ కతియార్ వ్యాఖ్యానించారు.
యూనిసెఫ్ బాలల హక్కుల రాయబారిగా పనిచేస్తున్న ప్రియాంక.. బంగ్లాదేశ్‌లోని కుటుపలాంగ్‌తో పాటు కాక్స్ బజార్‌లో ఉన్న బలుఖలి శరాణార్ధుల శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి చిన్నారులతో కలిసి దిగిన ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి.. ‘ఒక చిన్నారి ఎక్కడ నుంచి వచ్చింది. ఎలాంటి పరిస్థితుల నుంచి వచ్చింది అనే విషయాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఫర్వాలేదు. కానీ భవిష్యత్తు పట్ల నమ్మకం లేని జీవితం మాత్రం ఏ చిన్నారికి ఉండవద్దు. ప్రపంచం వారి పట్ల శ్రద్ధ చూపాలి. దయచేసి చిన్నారులకు మీ మద్దతును అందివ్వండి’ అనే మెసేజ్ పెట్టారు. అయితే ప్రియాంక చేసిన పనిని కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుండగా.. ముస్లింలను పరామర్శించడమేమిటని మరికొందరు ట్రోల్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment