పౌరుల హక్కులకు భంగం వాటిల్లుతోంది
పెద్ద నోట్ల రద్దుపై ఎన్‌హెచ్‌ఆర్సీలో ఫిర్యాదు చేసిన ఎంపీ కేవీపీ
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజల కష్టార్జితాన్ని అవసరాలకు సకాలంలో వినియోగించనివ్వకుండా నోట్ల రద్దుతో పౌరుల రాజ్యాంగ హక్కులకు తూట్లు పొడిచారంటూ రాజ్యసభ సభ్యుడు కేవీపీ రాంచంద్రరావు జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్చార్సీ)కు సోమవారం ఫిర్యాదు చేశారు. ‘పౌరుల గౌరవాన్ని కేంద్ర ప్రభుత్వం నడిరోడ్డున నిలబెట్టింది. నోట్ల రద్దు కారణంగా షాక్‌కు గురై లేదా ఏటీఎం, బ్యాంకుల వద్ద క్యూలో నిలబడి ప్రాణాలు కోల్పోరుున వారి కుటుంబాలకు రూ.10 లక్షల మేర నష్టపరిహారం చెల్లించేలా ఆదేశాలివ్వాలి.
డిసెంబర్, జనవరి నెలల్లో నిత్యావసర వస్తువులు అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పౌర సరఫరా శాఖలు తీసుకుంటున్న చర్యలపై నివేదిక కోరండి. రూ.50, రూ.100 నోట్ల సరఫరా పెంచాలి. వేతన జీవులు ఇంటి అద్దె, స్కూలు ఫీజు, ఇంటి అవసరాలకు వెచ్చిం చేందుకు వీలుగా నెలలో ఒకేసారి రూ.50 వేలు ఉపసంహరించుకునే వెసులుబాటు కల్పించాలి. వీటన్నింటినీ అమలుచేసేలా ఆదేశాలు జారీచేయాలి..’ అని కోరారు.