
ముంబై: ఓ వయసొచ్చాక తోడు కోరుకోవడం మనుషులకు ఎంత సహజమో జంతువులకు కూడా అంతే సహజం. లేకపోతే ఆ పులి తన జోడీని వెతుక్కుంటూ ఏకంగా రెండు వేల కిలోమీటర్లు తిరగడం అంటే మామూలు విషయమా! కానే కాదు. పర్వీన్ కస్వాన్ అనే అటవీ అధికారి ఓ పులి ప్రేమ ప్రయాణాన్ని ట్విటర్‌లో పంచుకోగా అది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. గమ్యం ఎరుగని బాటసారిలా నడక ప్రారంభించిన పులి గురించి చెప్తూ..‘ అది తనకు తోడును కోరుకుంటూ అన్వేషణ ప్రారంభించింది. కాలువలు, పొలాలు, అడవులు, రోడ్లు, గుట్టలు అడ్డొచ్చిన ప్రతిదాన్ని దాటుకుంటూ వెతుకులాడుతోంది. ఎదురయ్యే ప్రతిప్రాంతాన్ని జల్లెడపడుతోంది. పగటి పూట విశ్రాంతి తీసుకుంటూ రాత్రి పూట మాత్రమే నడక సాగించింది. ప్రస్తుతం అది మహారాష్ట్రలోని ద్యాన్‌గంగాకు చేరింది’ అని పేర్కొన్నారు.
పులికి అమర్చిన జీపీఎస్ ద్వారానే అది ప్రయాణించిన దూరాన్ని కనుక్కోగలిగామని పర్వీన్ తెలిపారు. అంతేకాక అది నడిచిన మార్గాన్ని తెలిపే మ్యాప్‌ను సైతం పంచుకున్నారు. ఇందులో మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అభయారణ్యం నుంచి బయలు దేరిన పులి ఎన్నో జిల్లాలు దాటుకుంటూ అలుపెరగకుండా ప్రయాణించి చివరాఖరకు ద్యాన్‌గంగా అభయారణ్యానికి చేరింది. పులి తన భాగస్వామికోసం వెతుకలాడిన తీరుపై కొందరు సెటైర్లు వేస్తుండగా మరికొందరు మాత్రం దానికి దక్కే ఆడపులి నిజంగా అదృష్టవంతురాలు అని ప్రశంసిస్తున్నారు. ‘అయ్యో, పులికి టిండర్ యాప్ ఉంటే బాగుండు’ అని కొందరు నెటిజన్లు జోకులు కూడా విసురుతున్నారు. ‘లేదు.. ఆ పులిని దాని బంధువులు వెళ్లగొట్టుంటారు’ అని ఓ నెటిజన్ ఛలోక్తి విసిరాడు. (విమానంలోకి పావురం ఎలా వచ్చిందో!)
Comments
Please login to add a commentAdd a comment