న్యూఢిల్లీ: ప్లాస్టిక్ వాడకం విపరీతంగా పెరిగిపోతుండటంతో.. ఈ సమస్య పెనుభూతంగా మారుతున్న సంగతి తెలిసిందే. ప్లాస్టిక్ కాలుష్యం వల్ల ప్రకృతికి, భవిష్యత్తులో మానవాళికి ముప్పు తప్పదని శాస్త్రవేత్తలు, పర్యావరణవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ప్లాస్టిక్ వల్ల మనుషులే కాదు జంతువులు, వన్యజీవులు తీవ్ర ముప్పు ఎదుర్కొంటున్నారు. ఆహారమేదో, ప్లాస్టికేదో గుర్తించలేకపోతున్న జంతువులు.. వాటిని ఆహారంగా తీసుకొని.. ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న ఉదంతాలు ఎన్నో బయటపడుతున్నాయి. తాజాగా ఐఎఫ్‌ఎస్ అధికారి పర్వీన్ కశ్వాన్ పోస్టు చేసిన ఓ వీడియో ప్లాస్టిక్ భూతం వన్యజీవులకు ఎంత ప్రమాదమో చాటుతోంది.
48 సెకన్ల నిడివిగల ఈ వీడియోలో ఓ పాము బద్దకంగా నేలపై పడుండి అవస్థలు పడుతోంది. పాము ఏదో తినడం వల్ల దాని కడుపు ఉబ్బినట్టు కనిపిస్తోంది. ఓ వ్యక్తి దానిని అదిలించడంతో అతికష్టం మీద ఆ పాము తాను తిన్న ఆహారాన్ని బయటకు కక్కడానికి ప్రయత్నించింది. కష్టంగా కదులుతూ కొన్ని ప్రయత్నాల తర్వాత పాము బయటకు కక్కడంతో ఒక గ్రీన్ కలర్ ప్లాస్టిక్ బాటిల్ దాని కడుపులోంచి బయటకు వచ్చింది.
ప్లాస్టిక్ ఎంతగా జంతువులను వేధిస్తుందో ఈ వీడియో చాటుతోంది. ప్లాస్టిక్ వస్తువులను పడేసే విషయంలో ఎంతమాత్రం నిర్లక్ష్యం పనికిరాదని, బాటిల్స్ లాంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వల్ల వన్యజీవుల ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయని ఐఎఫ్‌ఎస్ కశ్వాన్ ఈ వైరల్ వీడియోపై కామెంట్ పెట్టారు. ప్లాస్టిక్ భూతం వల్ల వన్యజీవులకూ ముప్పు తప్పడం లేదని, ప్రకృతి కూడా నాశనం అవుతోందని, ఇప్పటికైనా ప్రజలంతా మేల్కొని.. ప్లాస్టిక్ వినియోగం విషయంలో విచక్షణ పాటిస్తూ పర్యావరణ హితంగా ప్రవర్తించాలని నెటిజన్లు ఈ వీడియోపై స్పందిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment