మంగళూరు: తోటి మనిషి ఆపదలో ఉన్నాడంటే ముందుకొచ్చి సాయం చేసేవాళ్లు అరుదుగా ఉంటారు. మరి మూగజీవాలకు ఆపద వస్తే.. ఇదిగో నేనున్నాంటూ వాటిని రక్షించేందుకు పూనుకుందో మహిళ. తన ప్రాణాలను పణంగా పెట్టి మరీ బావిలో పడ్డ కుక్కను రక్షించి అందరిచేత శభాష్ అనిపించుకుంటోంది. మంగళూరు ప్రాంతంలో ఓ కుక్క ఆకస్మాత్తుగా బావిలో పడింది. దాని కేకలు విన్న స్థానికులు అయ్యో పాపం అంటున్నారే తప్పితే దాన్ని ఎలా రక్షించాలో తెలియక చూస్తూ ఉండిపోయారు. ఇంతలో ఓ మహిళ తన నడుముకు తాడు కట్టుకుని ఎంతో లోతుగా ఉన్న బావిలోకి దిగింది. కుక్కకు కట్టడానికి పైనున్న వాళ్లు ఓ తాడును విసిరేయగా ఆమె దాన్ని చేతబుచ్చుకుని శునకానికి కట్టింది. దీంతో బావి వెలుపల ఉన్నవాళ్లు ఆ తాడును పైకి లాగడంతో శునకం సునాయాసంగా పైకి వెళ్లింది.
|
ముందుగా ఏం జరుగుతుందో అర్థం కాని ఆ కుక్క బయటకు రాగానే తనదారివైపు పరుగందుకుంది. అయితే దాన్ని రక్షించిన మహిళకు మాత్రం పైకి రావడం అంత సులువు కాలేదు. కాస్త కష్టపడుతూనే మరింత జాగ్రత్తగా బావి పైకి చేరుకుంది. ఇక ఈ సాహస వీడియోను ఓ యువతి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది. నాకు మాత్రం తనే హీరో అంటూ క్యాప్షన్ జోడించింది. ప్రస్తుతం అది వైరల్‌గా మారింది. ప్రజలు జంతువుల పట్ల మరింత సున్నితంగా మెలుగుతారని ఆశిద్దాం. తద్వారానైనా జంతు వధ, కౄరత్వం లేని ప్రపంచం ఆవిష్కృతమవుతుంది.’ అని ఓ నెటిజన్ భావోద్వేగంగా కామెంట్ చేశాడు. అయితే ఆ సాహస మహిళ పేరు రజనీ శెట్టిగా ఓ నెటిజన్ పేర్కొన్నాడు.
Comments
Please login to add a commentAdd a comment