మృత్యు బేహరి | Vyapam 42 deaths in scam | Sakshi
Sakshi News home page

మృత్యు బేహరి

Published Sun, Jul 5 2015 12:09 AM | Last Updated on Sun, Sep 3 2017 4:53 AM

మృత్యు బేహరి

మృత్యు బేహరి

వ్యాపమ్ స్కామ్‌లో 42 మరణాలు  అంతుచిక్కని రీతిలో అనుమానాస్పదంగా చనిపోతున్న నిందితులు, సాక్షులు
 

ఇదీ భారతీయులకు అలవాటైన, సాధారణమైపోయిన కుంభకోణాల్లాంటిదే. కోట్ల రూపాయల గోల్‌మాల్.. పెద్దల హస్తం.. పెద్దన్నల పాత్ర.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, దర్యాప్తు, విచారణ.. అన్నీ కామనే. ఇందులోనూ అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఈ స్కామ్‌లో ఉన్నవి భయం గొలిపే అసాధారణ, అసహజ, అనుమానాస్పద మరణాలు.. వ్యవస్థ లోలోతుల్లోకి వెళ్లిన మాఫియా మూలాలు. ఏకంగా గవర్నర్ కొడుకు నుంచి శనివారం టీవీ విలేకరి ఆకస్మిక మృతి దాకా.. వ్యాపమ్ కుంభకోణం, ఆ స్కామ్ నిందితులు, సాక్షుల అనుమానాస్పద మరణాలపై ‘సాక్షి’ ఫోకస్...    
 - నేషనల్ డెస్క్
 
 వ్యాపమ్ అంటే?
 ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్)’. దీనికే మరోపేరు ‘ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్(పీఈబీ)’. మధ్యప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల పరీక్షల నిర్వహణ కోసం 1970లో ‘ప్రి మెడికల్ టెస్ట్ బోర్డ్’గా ఇది ఏర్పడింది.  1981లో ప్రీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ కోసం ‘ప్రి ఇంజనీరింగ్ బోర్డ్’ను ఏర్పాటు చేసి, అనంతరం 1982లో ఈ రెండింటినీ విలీనం చేసి వ్యాపమ్ లేదా పీఈబీగా మార్చారు. ఆ తరువాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో లేని ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల నిర్వహణను కూడా దీనికే అప్పగించారు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ సర్వీసుల్లోని ఉద్యోగాలతో పాటు టీచర్లు, ఫుడ్ ఇన్‌స్పెక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు.. తదితర ప్రభుత్వ ఉద్యోగాల నియామక బాధ్యతను వ్యాపమ్‌కు అప్పగించారు.
 
 కుంభకోణం విస్తృతి ఎంత?

 ఈ స్కాంకు పాల్పడిన మాఫియా మూలాలు చాలా లోతు ఉన్నాయి. ప్రభుత్వంలో, అధికారుల్లో, పోలీసుల్లో, రాజకీయ నేతల్లో.. ప్రతీ రంగంలో, ప్రతీ స్థాయిలో వీరికి ప్రతినిధులున్నారు. ఏజెంట్లున్నారు. 2007 - 2013 మధ్య రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షను.. చివరకు బ్యాంకు పరీక్షలైన ఎస్‌బీఐ, ఐబీపీఎస్‌లను సైతం వీరు వదల్లేదు. ఇప్పటివరకు తెలిసిన వివరాల మేరకే ఈ కుంభకోణం విలువ రూ.2 వేల కోట్ల పైమాటే. అయితే, అసలు కుంభకోణంలో ఈ 2 వేల కోట్లు కనీసం 5% కూడా కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి 2004 నుంచే రాష్ట్రంలో ఈ మాఫియా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు.

ఏయే పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డారు?
2013లో జరిగిన ప్రి మెడికల్ టెస్ట్(పీఎంటీ), 2012లో జరిగిన మెడికల్ ప్రి పీజీ టెస్ట్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ సెలక్షన్ టెస్ట్, సుబేదార్-  సబ్ ఇన్‌స్పెక్టర్ అండ్ ప్లాటూన్ కమాండర్ సెలక్షన్ టెస్ట్, మిల్క్ ఫెడరేషన్ టెస్ట్, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్ టెస్ట్, కాంట్రాక్ట్ టీచర్ సెలక్షన్ టెస్ట్. ఇవి అవినీతి జరిగినట్లు బయటపడిన పరీక్షలు మాత్రమే. వీటిలో పీఎంటీలో అవకతవకలు 2008 నుంచే ప్రారంభమయ్యాయని తేలింది. ఇంకా బయటపడని అవినీతి పరీక్షలు మరెన్నో ఉన్నాయన్నది సాక్షాత్తూ దర్యాప్తు అధికారులే చెబుతున్నారు. 2008- 2013 మధ్య 1,087 మంది అనర్హ విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించారు. వారి అడ్మిషన్లను తరువాత రద్దు చేశారు. వేలాది మంది అనర్హులు డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దాంతో అర్హులైన, సమర్ధులైన విద్యార్థులు, అభ్యర్థులు తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారు.
 
 ఎలా బయట పడింది?
 2013లో ఇండోర్‌కు చెందిన విజిల్ బ్లోయర్ డాక్టర్ ఆనంద్ రాయ్ ప్రి మెడికల్ టెస్ట్ స్కామ్‌ను బయటపెట్టారు. గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిష్ చతుర్వేది ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువుల పాత్రను బయటపెట్టారు. దాంతో, ఈ కుంభకోణం దర్యాప్తును స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్‌టీఎఫ్)కు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్‌టీఎఫ్ దర్యాప్తును పర్యవేక్షించేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను మధ్యప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇతరపరీక్షల్లోనూ అవకతవకలు జరిగిన విషయం బయటపడింది.
 
ఇప్పటికే 2 వేల మంది అరెస్ట్

 తక్షణమే రంగంలోకి దిగిన ఎస్‌టీఎఫ్ వేర్వేరు పరీక్షలకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసి.. అరెస్టుల పర్వం ప్రారంభించింది. ఇప్పటివరకు దాదాపు 2 వేల మందిని అరెస్ట్ చేసింది. ఇంకా 8 వందల మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అరెస్టయిన ప్రముఖుల్లో మాజీ బీజేపీ నేత, విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఆయన ఓఎస్‌డీ ఓపీ శుక్లా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సన్నిహితుడైన మైనింగ్ దిగ్గజం సుధీర్ శర్మ,  గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ ఓఎస్‌డీ ధన్‌రాజ్ యాదవ్, డీఐజీ ఆర్‌కే శివహరి, వ్యాపమ్ అధికారులు పంకజ్ త్రివేదీ, సీకే మిశ్రా, నితిన్ మహేంద్ర, అజయ్ సేన్ తదితరులున్నారు. వీరే కాకుండా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డజన్ల సంఖ్యలో దళారులు, వందలాదిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారు అరెస్టైన వారిలో ఉన్నారు.
 
 మృత్యుహేల...
 అన్నీ స్కాముల్లోనూ దర్యాప్తులు, విచారణలు, అరెస్టులు మామూలే. కాని ఈ కుంభకోణం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోని భయానక కోణాన్ని బయటపెట్టింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న నిందితులు, సాక్షులు వరుసగా చనిపోతున్నారు. దాదాపు అవన్నీ ‘అసహజ మరణాలే’ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవి సాధారణ మరణాలు కావని, అనుమానాస్పద మరణాలేనని ఎస్‌టీఎఫ్ సైతం ఒప్పుకుంది. ఇప్పటివరకు అలా 25 మంది చనిపోయారని అధికారిక ఒప్పుకోలు కాగా.. మొత్తం 42 మంది అసహజ మరణం పాలయ్యారనేది అనధికార సమాచారం. చనిపోయినవారిలో కొందరు పోలీస్ కస్టడీలో మరణించగా, కొందరు బెయిల్‌పై బయట ఉండగా ప్రాణాలు కోల్పోయారు. కుంభకోణంలో తమ పాత్ర బయటపడకూడదని భావిస్తున్న ‘పెద్దలు’ చేయిస్తోన్న హత్యలే ఇవని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. గవర్నర్, ముఖ్యమంత్రి బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు ఈ కుంభకోణంతో జతపడి ఉండటంతో వారి ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన ఆనంద్ రాయ్, ఆశిశ్ చతుర్వేది సహా బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులెందరో తమకు ప్రాణ హాని ఉందని, చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించడం కుంభకోణం వెనకున్న పెద్దల బలాన్ని, స్కామ్ తీవ్రతను తెలియచేస్తుండగా.. ‘పుట్టినవారు గిట్టక తప్పద’ంటూ రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్ గౌర్ మెట్ట వేదాంతం చెబుతుండటం ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, దళసరి చర్మతత్వాన్ని తేటతెల్లం చేస్తోంది.
 
స్కామ్ ఏంటి?
భారీ ఎత్తున డబ్బులు తీసుకుని మెడిసిన్, పీజీ మెడికల్ కాలేజీల్లో వందలాదిగా అనర్హులకు ప్రవేశం కల్పించారు. కానిస్టేబుల్, కాంట్రాక్ట్ టీచర్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్.. తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ విస్తృత స్థాయిలో అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్ష రాయించడం, పరీక్ష హాల్లో అభ్యర్థుల సీటింగ్ స్థానాల్లో మార్పులు చేయడం(మధ్యలో తెలివైన అభ్యర్థిని కూర్చోబెట్టి.. అతని వెనక, ముందు, తమ అభ్యర్థులుండేలా చూసుకుని, చూసి రాసే అవకాశం కల్పించడం) , బయటే జవాబు పత్రాలు రాయించడం, ఓఎంఆర్ షీట్లను మార్చడం.. ఇలా ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో అనర్హులకు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, కనీస విద్యార్హతలు కూడా లేనివారికి ప్రభుత్వోద్యోగాలు కల్పించారు.
 
 గవర్నర్ హస్తం ఉందా?
 ఫారెస్ట్ గార్డుల నియామకం కోసం ఐదుగురి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ పైనా కేసు నమోదైంది. కానీ గవర్నర్‌కున్న రాజ్యాంగ హక్కులను పేర్కొంటూ ఆ ఎఫ్‌ఐఆర్‌ను హైకోర్టు కొట్టేసింది.
 
 చనిపోయిన నిందితులు, సాక్షుల్లో ముఖ్యులు..
 
 శైలేశ్‌యాదవ్

 గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడు. ఈ స్కామ్‌లో నిందితుడు. 2015, మార్చి 25న లక్నోలోని తమ బంగళాలో చనిపోయి కనిపించాడు. ఆయనకు మధుమేహం ఉందని, బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మరణానికి కారణమేమిటనేది తెలియలేదని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొనడం గమనార్హం. చనిపోయే ముందురోజు రాత్రి వరకు మామూలుగానే ఉన్నారు.
 
 నమ్రత దామర్
 ఇండోర్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని. 2010లో మెడికల్ ఎంట్రన్స్‌లో అవకతవకలకు పాల్పడి... వైద్యసీటు పొందిన వారి జాబితాలో ఈమె పేరు కూడా ఉంది. కాలేజీ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయింది. ఎటువెళ్లింది, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడుంది... వీటికి సమాధానాల్లేవు. అంతా మిస్టరీ. అదృశ్యమైన ఏడురోజులకు జనవరి 7, 2012న ఉజ్జయిని జిల్లాలోని కేతా గ్రామసమీపాన రైల్వే ట్రాక్‌పై ఆమె మృతదేహం కనిపించింది.
 
 రామేంద్రసింగ్ భడోరియా
 ఈ ఏడాది జనవరిలో ఈయనపై ఎఫ్‌ఐఆర్ నమోదైంది. కొద్దిరోజులకే రామేంద్రసింగ్ (30) ఉరివేసుకొని చనిపోయాడు. కుంభకోణంతో సంబంధమున్న వారు ఎలాంటి విషయాలూ వెల్లడించవద్దని రామేంద్రసింగ్‌పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, దీన్ని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబం ఆరోపించింది. రామేంద్ర చనిపోయిన వారం రోజులకే అతని తల్లి యాసిడ్ తాగి బలవన్మరణం పొందింది.
 
 విజయ్ సింగ్
 ఈ స్కామ్‌లో కీలక నిందితుడు. పలువురు పెద్దల తరఫున ప్రధాన దళారీ అని సమాచారం. ఈ సంవత్సరం ఏప్రిల్ 28న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలోని ఒక లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది. ఆ లాడ్జి ఒక బీజేపీ ఎమ్మెల్యేది.
 
 డాక్టర్ రాజేంద్ర ఆర్య

 వ్యాపమ్ స్కాంలో అరెస్టవగా ఏడాది కిందటే బెయిల్ వచ్చింది. డాక్టర్ రాజేంద్ర (40) వ్యక్తిగత పనిమీద కోటాకు వెళ్లివస్తుండగా... ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది. జూన్ 28న గ్వాలియర్‌లోని బిర్లా ఆసుపత్రిలో కన్నుమూశారు. డాక్టర్ తోమర్, డాక్టర్ రాజేంద్ర ఆర్యలు కేవలం 24 గంటల వ్యవధిలో అనూహ్యంగా మృతి చెందడం గమనార్హం.
 
 డాక్టర్ డీకే సకాలే
 స్కామ్ నిందితుడు. జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్. అక్రమపద్ధతిలో సీట్లు పొందిన వారిని కోర్సు నుంచి తొలగించగా... వారు సకాలేను నిలదీశారు. వీరి ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు 30 రోజుల మెడికల్ లీవుపై వెళ్లారు. 2014 జులైలో కాలిన గాయాలతో చనిపోయాడు.
 
 డాక్టర్ నరేంద్ర సింగ్ తోమర్
 అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్. స్కామ్‌లో భాగంగా, అభ్యర్థుల బదులు పరీక్షలు రాసేందుకు సమర్థులైన వారిని ఏర్పాటు చేసేవాడని ఆరోపణ. ఇండోర్ జైల్లో ఉండగా, కిందటినెలలో (జూన్ 27న) గుండెపోటుతో చనిపోయాడు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లనే చనిపోయాడని తోమర్ తండ్రి ఆరోపణ. 27న మధ్యాహ్నం తాము కలిసినపుడు ఆరోగ్యంగా ఉన్నాడని, తీవ్రంగా హింసిస్తున్నారని మొరపెట్టుకున్నాడని కుటుంబీకులు చెప్పారు. అదే రాత్రి మహరాజా యశ్వంత్‌రావు ఆసుపత్రికి తరలించగా... ఆసుపత్రికి తెచ్చేసరికే తుదిశ్వాస విడిచాడని డాక్టర్లు ప్రకటించారు. విమర్శలు వెల్లువెత్తడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అయితే వరుసపెట్టి జరుగుతున్న అనుమానాస్పద, అసహజ మరణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement