suspicious deaths
-
పాక్‌కి వెళ్లి మరీ మట్టుపెడతాం: భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని భారత్ సహించబోదని.. అవసరమైతే పాకిస్థాన్ భూభాగంలోకి చొరబడి మరీ ఉగ్రవాదుల్ని మట్టుపెడుతుందని దేశ రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరించారు. బ్రిటన్ పత్రిక గార్డియన్ తాజాగా భారత్‌పై ఆరోపణలతో కూడిన ఓ కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ స్పందిస్తూ.. పొరుగు దేశాలతో సత్సంబంధాలు నెరపాలనే భారత్ ఎప్పుడూ కోరుకుంటుంది. కానీ, ఉగ్రవాదుల చర్యలను ప్రతీసారి భారత్ ఉపేక్షించదు. భారత్‌లోకి చొరబడి ఉగ్ర కార్యకలాపాలకు పాల్పడితే మాత్రం.. ఈ దేశ ఆగ్రహం ఎలా ఉంటుందో వాళ్లు చవిచూడాల్సి వస్తుంది. ఒకవేళ వాళ్లు(ఉగ్రవాదులు) భారత్‌లో దాడులకు పాల్పడి పాకిస్థాన్‌లోకి గనుక పారిపోతే.. వెంటాడుతాం. ఆ భూభాగంలోకి వెళ్లి మరీ మట్టుపెడతాం. మాకు(భారత సైన్యానికి) ఆ సామర్థ్యం ఉంది. అది చేసి తీరతాం కూడా. పొరుగు దేశం(పాక్) కూడా అది గుర్తిస్తే మంచిది’’ అని కేంద్ర రక్షణ మంత్రి స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే.. పాకిస్తాన్లో వరుసగా ఉగ్రవాద నేతలు చనిపోతున్నారు. అయితే వాళ్లంతా అనుమానాస్పద రీతిలో.. గుర్తు తెలియని దాడుల్లో మృతి చెందడం గమనార్హం. దీంతో.. ఇందులో ఒక ప్లాన్ ప్రకారమే ఈ హత్యలు జరుగుతున్నాయంటూ ప్రపంచవ్యాప్తంగా చర్చ సైతం నడిచింది. ఈ లోపు గార్డియన్ పత్రిక.. ‘‘విదేశాల్లోని ఉగ్రవాదుల ఏరివేత ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లో ముష్కరులను భారత ఇంటర్నేషనల్ నిఘా ఏజెన్సీ హత్యలు చేస్తోంది. ఖలిస్థానీలను కూడా టార్గెట్‌గా చేసుకుంది. మోదీ రెండోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విదేశాల్లో ముఖ్యంగా పాకిస్థాన్‌లో భారత వ్యతిరేకులుగా భావిస్తున్న వారిని హతమార్చే కొత్త ధోరణి మొదలైంది. 2020 నుంచి 2023 వరకు దాదాపు 20 మంది ఈ విధంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్యలన్నీ భారత గూఢచార సంస్థ ‘రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్’ (రా) పర్యవేక్షణలో జరిగాయి. ఈ మేరకు భారత్, పాకిస్థాన్ నిఘా, గూఢచార సంస్థల అధికారులతో మా (గార్డియన్) ప్రతినిధి మాట్లాడి వివరాలు సేకరించారు’’ అని పెద్ద కథనం ప్రచురించింది ది గార్డియన్. అయితే, ఈ హత్యల్లో తమ ప్రమేయం లేదని, ఇది భారత వ్యతిరేక దుష్ప్రచారమని భారత విదేశాంగశాఖ పేర్కొన్నట్లుగా కూడా గార్డియన్ ప్రస్తావించడం గమనార్హం. -
భార్యాబిడ్డల్ని కాల్చి చంపి.. తానూ కాల్చుకుని
వాషింగ్టన్: అమెరికాలో శనివారం అనుమానాస్పదరీతిలో మృతి చెందిన తెలుగు కుటుంబం మిస్టరీ వీడింది. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా వింజనంపాడుకు చెందిన చంద్రశేఖర్‌రెడ్డి తాళి కట్టిన భార్యను, జన్మనిచ్చిన బిడ్డలను కాల్చి చంపి ఆపై తానూ కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్లు అమెరికా పోలీసులు ధ్రువీకరించారు. అమెరికాలోని ఐయోవా రాష్ట్రంలో వెస్ట్‌డెస్ మోయిన్స్‌లో యాష్‌వర్త్ రోడ్డు– అస్పెన్ డ్రైవ్‌ల మధ్య ఉన్న 65వ స్ట్రీట్‌లో నివాసం ఉంటున్న సుంకర చంద్రశేఖరరెడ్డి (44), ఆయన భార్య లావణ్య (41), కుమారులు ప్రభాస్ (15), సుహాన్ (10)లు శనివారం తుపాకీ తూటాల గాయాలతో అనుమానాస్పదరీతిలో మృతి చెందిన విషయం తెలిసిందే. ఆదివారం ఈ నాలుగు మృతదేహాలకు శవపరీక్ష అనంతరం సోమవారం అమెరికాలోని లోవా రాష్ట్ర పోలీసులు మీడియాకు వివరాలు వెల్లడించారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఆయుధం కలిగి ఉండేందుకు చంద్రశేఖర్‌రెడ్డికి ప్రభుత్వం అనుమతిచ్చిందని పోలీసులు తెలిపారు. అయితే ఆయన ఎక్కడ తుపాకీని కొనుగోలు చేసింది విచారిస్తున్నట్లు వివరించారు. అలాగే ఐటీ నిపుణుడిగా పని చేస్తున్న చంద్రశేఖర్‌రెడ్డి 2018లో 1,05,000 డాలర్లు సంపాదన ఆర్జించినట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చి 25న 5,70,000 డాలర్లు వెచ్చించి చంద్రశేఖర్‌రెడ్డి, లావణ్య దంపతులు ఓ ఇంటిని కొనుగోలు చేసినట్లు వివరించారు. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌రెడ్డి ఇలాంటి దుశ్చర్యకు ఎందుకు పాల్పడ్డాడనే దానిపై అన్ని కోణాల్లో విచారిస్తున్నామని, ప్రశ్నలన్నిటికీ సమాధానాలు దొరికే వరకు పూర్తి స్థాయి విచారణ కొనసాగిస్తామని వెల్లడించారు. అయితే ఈ మరణాలకు ముడిపెట్టి ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అమెరికాలో శాంతిభద్రతలు పటిష్టంగా ఉన్నాయని పోలీసులు స్పష్టం చేశారు. -
నలుగురు యువకుల అనుమానాస్పద మృతి
మేడ్చల్: శామీర్‌పేట్ మండలం బొమ్మరాశి పేట్ గ్రామంలో నలుగురు యువకులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో వారు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. మృతులు మహబూబాబాద్ జిల్లా తొర్రూర్ మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన శివశంకర్, మహేందర్ రెడ్డి, అరవింద్, మహేశ్‌లుగా గుర్తించారు. కేసు నమోదు చేసి పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. నలుగురు యువకుల బ్లడ్ శాంపుల్స్‌ను క్లూస్ టీంలు సేకరించాయి. బ్లడ్‌శాంపుల్స్‌లో విషం ఉన్నట్లు ప్రాధమికంగా నిర్ధారణకు వచ్చారు. ఇద్దరికి రక్తవాంతులు, మరో ఇద్దరి నోటి నుంచి నురగలు వచ్చి మృతిచెందినట్లు గుర్తించారు. రాత్రి తిన్న చికెన్‌లో విషం కలిసి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. తిన్న ఆహారంలో విషం ఎలా కలిసిందనే దానిపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పాడుబడ్డ బావిలో రెండు మృతదేహాలు
జహీరాబాద్ : ఈనెల 14వ తేదీన అదృశ్యమైన ఇద్దరు యువకులు అల్గోల్ క్రాస్‌రోడ్డు వద్ద ఓ పాడుబడిన బావిలో గురువారం శవాలై తేలిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని మాడ్గికి చెందిన చాంద్‌పాష కుమారుడు మొయిజొద్దీన్(20), బిక్కు మియా కుమారుడు ఇస్మాయిల్ అలియాస్ సద్దాం(20) ఇద్దరు కలిసి 14వ తేదీన ఉదయం 11.30 గంటలకు మోటార్ సైకిల్‌పై జహీరాబాద్‌కు వచ్చారు. పాడైన టీవీని రిపేర్ నిమిత్తం స్థానికంగా ఓ మెకానిక్కు ఇచ్చి వెళ్లి పోయారు. ఆ రోజు రాత్రికి వీరు ఇంటికి రాక పోవడంతో కంగారు పడిన వారి కుటుంబ సభ్యులు మరుసటి రోజు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో వీరు మూసానగర్కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు అప్పటి నుంచి జహీరాబాద్ పట్టణం, పరిసర గ్రామాల్లో ఎంత గాలించినా ఎలాంటి వివరాలు తెలియలేదు. గురువారం 65వ జాతీయ రహదారి పక్కన ఉన్న పాడు పడిన వ్యవసాయ బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ నల్లమల రవి, సీఐ సైదేశ్వర్, ఎస్.ఐ ప్రభాకర్‌రావు మృతదేహాలను గుర్తించి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతులు మాడ్గి గ్రామానికి చెందిన మొయిజొద్దీన్, సద్దాంగా గుర్తించారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మిస్టరీగా మారిన యువకుల మృతి.. ఆరు రోజుల క్రితం అదృశ్యమైన యువకుల మరణం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి శవాలను బావిలో వేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి కుటుంబాలకు ఎవరితోనైనా పాత కక్షలు ఉన్నాయా, ఇంకేమైన తగాదాలు వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వీరి వెళ్లిన మోటారు సైకిల్ అల్లీపూర్ శివారులో బుధవారం లభ్యం కావడం, గురువారం వీరి మృతదేహాలు బయటపడడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. సద్దాం మృతదేహానికి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉండడం వీటికి బలం చేకూరుస్తుంది. బంధువులు, కుటుంబ సభ్యులు హత్యచేసి బావిలో పడవేశారని అనుమానిస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు అనుమానాస్పద స్థితిలో మరణించిన యువకుల మృతిపై విచారణ చేపట్టినట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మృతదేహాలు లభించిన వ్యవసాయ బావిని సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలకు పాల్పడ్డారా లేక, ఎవరైనా హత్యచేసి బావిలో వేశారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు. మాడ్గిలో విషాదం మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామానికి చెందిన యువకులు మొయిజొద్దీన్, ఇస్మాయిల్‌లు అనుమాన స్పద స్థితిలో మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ నెల 14 వ తేదీన టీవీ రిపేర్ చేయించుకుని వస్తామని చెప్పి వెళ్లిన యువకులు నాలుగు రోజుల అనంతరం మృతదేహాలుగా దొరకంతో బంధువులు, కుటుంబ సభ్యులు సభ్యులు షాక్‌కు గురయ్యారు. చేతికి వచ్చిన కుమారులను కోల్పోయిన తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న మాడ్గి సర్పంచ్ ఆకాష్ జహీరాబాద్‌లోని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల బంధువులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వై.నరోత్తం పరామర్శించి ఓదార్చారు. -
ఇద్దరు వృద్ధుల అనుమానాస్పద మృతి
పటాన్చెరు టౌన్: గుర్తుతెలియని ఇద్దరు వృద్ధులు అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన సంఘటన సంగారెడ్డి జిల్లా బీడీఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ వేణు గోపాల్ రెడ్డి కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. రాంచంద్రాపురం మండలం వెలమెల్ల గ్రామ శివారులోని ఔటర్ రింగ్ రోడ్డు పక్కన సుమారు 65 సంవత్సరాల గుర్తుతెలియని ఓ వృద్ధురాలు, సుమారు 70 సంవత్సరాల మరో వృద్ధుడు రోడ్డు పక్కన చెట్ల మధ్యలో అనుమానాస్పద స్థితిలో మృతిచెందారు. గురువారం ఉదయం ఔటర్ రింగు రోడ్డుపై పెట్రోలింగ్ నిర్వహిస్తున్నవారు ఇద్దరు వృద్ధుల శవాలను చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో సంఘటన స్థలానికి సీఐ వేణుగోపాల్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి, క్లూస్ టీం చేరుకొని పరిశీలించారు. వారి మృతికి గల కారణాలు ఏమిటో? రింగ్ రోడ్డు వద్దకు ఇద్దరు వృద్ధులు ఎలా వచ్చారు? అనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. రెండు మృతదేహాలను పోస్టుమార్టం కోసం పటాన్చెరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వాళ్లది ఆత్మహత్య కాదు.. హత్యే!
న్యూఢిల్లీ: ఢిల్లీలోని బురారీలో ఒకే కుటుంబానికి చెందిన 11 మంది అనుమానాస్పద స్థితిలో చనిపోవడంపై వారి బంధువులు స్పందించారు. తమ కుటుంబం ఆత్మహత్య చేసుకోలేదని, వారిని చంపేశారని మృతుల్లో ఒకరైన నారాయణ్ దేవీ భాటియా కుమార్తె సుజాత ఆరోపించారు. ‘ప్రతి రెండ్రోజులకు ఓసారి నేను మా అమ్మతో మాట్లాడేదాన్ని. అందరూ ఆనందంగా ఉన్నారు. కుటుంబంలో ఎవ్వరూ బాబాలను నమ్మరు.మీడియా అసత్యాలను ప్రచారం చేస్తూ, మా కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారని తప్పుడు కథనాలను ప్రచురిస్తోంది’ అని మండిపడ్డారు. ఊపిరాడకే చనిపోయారు.. చనిపోయిన 11 మందిలో 8 మంది ఊపిరాడకపోవడం వల్లే ప్రాణాలు కోల్పోయారని పోస్ట్‌మార్టంలో తేలినట్లు పోలీస్ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. మృతులకు పోస్ట్‌మార్టం కొనసాగుతోందని పేర్కొన్నారు. మృతుల శరీరంపై ఎలాంటి గాయాలు లేవని వెల్లడించారు. మోక్షం పొందేందుకే.. మోక్షం పొందేందుకు ఎలా ప్రాణత్యాగం చేయాలన్నదానిపై చేతిరాతతో ఉన్న కాగితాలు బాధితుల ఇంట్లో లభ్యమయ్యాయని పోలీసులు తెలిపారు. రెండు రిజిస్టర్లలో లభ్యమైన ఈ కాగితాల్లో ‘మోక్షం పొందాలంటే దీన్ని మంగళ, గురు, శనివారాల్లోనే పాటించాలి. ఆ రోజు ఇంట్లో భోజనం వండకూడదు. మిగతా కుటుంబ సభ్యులు ఉరివేసుకుని ఆత్మహత్యచేసుకునేంతవరకూ ఒకరు పర్యవేక్షించాలి. వాస్తవానికి ఈ బలిదానంతో చనిపోరు. వాళ్లను దేవుడు కాపాడతాడు.’ అని ఉంది. ఈ కుటుంబం బాధ్ తపస్యా అనే విధానాన్ని ఆచరించి ఆత్మహత్య చేసుకుందని ఇంట్లో దొరికిన రిజిస్టర్లను బట్టి తేలిందన్నారు. వీరందరూ మర్రిచెట్టు ఊడల నిర్మాణం తరహాలో ఒకేచోట తాళ్లతో ఉరివేసుకున్నారని వెల్లడించారు. 2015 నుంచి ఈ కుటుంబం తాంత్రిక క్రతువుల్ని నిర్వహించినట్లు రిజిస్టర్లను బట్టి తెలుస్తోందన్నారు. -
కాల్వలో పడి ముగ్గురి అనుమానాస్పద మృతి
నిజామాబాద్: జిల్లాలోని మాక్లూరు మండలం బోర్గం శివారులో విషాద సంఘటన చోటు చేసుకుంది. గ్రామం శివారులో ఉన్న కాల్వలో పడి ముగ్గురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతులు సాయికుమార్(40), దివ్య(30), వర్షిణి(2)గా గుర్తించారు. స్థానికులు ఆదివారం ఉదయం కాల్వలో మృతదేహాలు తేలుతుండడాన్ని గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే దివ్య, వర్షిణి తల్లీబిడ్డలని, సాయికుమార్ నిజామాబాద్‌కు చెందినవాడని స్థానికులు చెబుతున్నారు. వివాహేతర సంబంధం వల్లే మనస్థాపం చెంది వీరు కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుని ఉంటారని ఒక వాదన కాగా ఎవరైనా వీరిని హతమార్చి కాలువలో పడేశారా అన్న అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
టెన్త్ విద్యార్థి మృతిపై తల్లిదండ్రుల ఆందోళన
కృష్ణా జిల్లా కంచికచర్లలోని గౌతమీ పబ్లిక్ స్కూల్లో పదవ తరగతి చదువుకున్న వినయకుమార్ అనే విద్యార్థి ఈనెల 22వ తేదీ అనుమానాస్పదస్థతిలో మృతిచెందాడు. అప్పుడు అనుమానాస్పదస్థితి మృతిగా పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే తమ కుమారుని మృతికి పాఠశాల యాజమాన్యమే కారణమని ఆరోపిస్తూ సోమవారం ఉదయం విద్యార్థి తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు భారీ సంఖ్యలో పాఠశాల ఎదుట ఆందోళన చేస్తున్నారు. పోలీసులు రంగప్రవేశం చేసి ఆందోళనకారులకు నచ్చచెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. పాఠశాలవద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది. -
పూడ్చిన నెల తర్వాత పోస్ట్‌మార్టం
-సాధరణ మరణమని గత నెల 29న అంత్యక్రియలు... -అనుమానం ఉందని ఫిర్యాదు...కేసు నమోదు...పోస్ట్‌మార్టం చిన్నశంకరంపేట(మెదక్ జిల్లా) సాధారణ మరణంగా భావించి అంత్యక్రియలు నిర్వహించారు. తర్వాత తమకు అనుమానాలున్నాయని కుటుంబ సభ్యులు పోలీస్‌లకు పిర్యాదు చేశారు. దీంతో నెల రోజుల క్రితం అంత్యక్రియలు నిర్వహించి పూడ్చిన శవాన్ని బయటకు తీసి పోస్ట్‌మార్టం నిర్వహించిన సంఘటన చిన్నశంకరంపేట మండలం శాలిపేట గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. శాలిపేట గ్రామానికి చెందిన ఐతరబోయిన బుచ్చయ్య(45) డిసెంబర్ 29న వెల్దూర్తి మండలం రామాంతాపూర్‌లో రోడ్డు పనుల నిర్వహణకు వెల్లి మతి చెందాడు. అప్పట్లో సాధారణ మరణంగా భావించిన కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. తీరా ట్రాక్టర్‌ను తీసుకువచ్చి చూడగా ముందు బాగం దెబ్బతినడంతో అనుమానం వచ్చిన కుటుంభ సభ్యులు ఆరాతీయగా, ట్రాక్టర్ ప్రమాదానికి గురైందని, గాయాలైన బుచ్చయ్య మృతి చెందగా స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించినట్లు తెలుసుకున్నారు. దీంతో బార్య శ్యామవ్వ ఈ నెల 18న చేగుంట పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడంతో ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి కేసునమోదు చేసి దర్యాప్తు చేపాట్టారు.ఈ మేరకు బుధవారం మండలంలోని శాలిపేటలో బుచ్చయ్య శవాన్ని వెలికితీసి తహశిల్దార్ విజయలక్ష్మి సమాక్షంలో పంచనామ నిర్వహించారు. గాంధీ అస్పత్రి ప్రొపెసర్ డాక్టర్ మోహన్‌సింగ్ పోస్ట్‌మార్టం చేశారు. ఈ సందర్బంగా ఎస్ఐ శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతు మృతుడు బుచ్చయ్య ట్రాక్టర్ ప్రమాదంలో మతి చెందినట్లు తమకు అనుమానాలున్నాయని అతని బార్య శ్యామవ్వ ఫిర్యాదు చేసిందని.. దీంతో అనుమానస్పద మృతిగా కేసునమోదు చేసుకుని దర్యాప్తు చేపాట్టిన ట్లు తెలిపారు.పోస్ట్‌మార్టం నివేదిక తరువాత విషయాలు వెల్లడించనున్నట్లు తెలిపారు. -
వ్యక్తి అనుమానాస్పద మృతి
ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి అనుమానాస్పదంగా మృతి చెందిన ఘనట ఆదివారం ఆదిలాబాద్ జిల్లా లో చోటు చేసుకుంది. వివరాలు.. అదిలాబాద్ జిల్లా లక్సెట్టిపేట మండలం జెండావెంకటాపూర్ గ్రామానికి చెందిన అర్జయ్య(45) వ్యవసాయం చేసుకుంటు జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న వ్యక్తి ఆదివారం ఉదయానికి విగత జీవిగా పడి ఉన్నాడు. ఇది గుర్తించిన కుటుంబసభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత అనుమానాస్పద మృతి
పురుగుల మందు తాగి మహిళ మృతిచెందిన సంఘటన పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు మండలం పెనకనమెట్ట గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన తోట నాగమణి(43) ఇంట్లో అనుమానాస్పదంగా మృతిచెందింది. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. భర్తే బలవంతంగా పురుగుల మందు తాగించి ఆ తర్వాత ఆత్మహత్యలా చిత్రీకరించేందుకు ప్రయత్నిస్తున్నాడని స్థానికులు అంటున్నారు. -
చిలుకూరు కోనేటిలో వ్యక్తి అనుమానాస్పద మృతి
చిలుకూరు బాలాజీ ఆలయ కోనేటిలో పడి ఒక వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. గురువారం మధ్యాహ్నం ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆలయ మేనేజింగ్ కమిటీ కన్వీనర్ గోపాలకృష్ణ స్వామి సోదరి భర్త రఘునందన్(69)ది తమిళనాడు. బుధవారం చిలుకూరు వచ్చిన ఆయన ఆరోజు సాయంత్రం నుంచి కనిపించలేదు. ఈ విషయమై గోపాలకృష్ణ బుధవారం రాత్రి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా రఘునందన్ ఆలయ కోనేటిలో శవమై తేలగా స్థానికులు గురువారం మధ్యాహ్నం గుర్తించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
భార్యను హతమార్చిన భర్త?
రంగారెడ్డి జిల్లాలో ఓ వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా పుడూరు మండలంలోని ఎన్కేపల్లి గ్రామానికి చెందిన చెంచుపల్లిలో కుక్కుల అంజమ్మ(30) శనివారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. భర్త లక్ష్మయ్యే ఆమెను చంపి ఉంటాడని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. లక్ష్మయ్యకు ఇది నాలుగో వివాహం అనీ.. నలుగురు భార్యలు అనుమానాస్పద స్ధితిలోనే మరణించారని పోలీసులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. -
మృత్యు బేహరి
వ్యాపమ్ స్కామ్‌లో 42 మరణాలు అంతుచిక్కని రీతిలో అనుమానాస్పదంగా చనిపోతున్న నిందితులు, సాక్షులు ఇదీ భారతీయులకు అలవాటైన, సాధారణమైపోయిన కుంభకోణాల్లాంటిదే. కోట్ల రూపాయల గోల్మాల్.. పెద్దల హస్తం.. పెద్దన్నల పాత్ర.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, దర్యాప్తు, విచారణ.. అన్నీ కామనే. ఇందులోనూ అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఈ స్కామ్‌లో ఉన్నవి భయం గొలిపే అసాధారణ, అసహజ, అనుమానాస్పద మరణాలు.. వ్యవస్థ లోలోతుల్లోకి వెళ్లిన మాఫియా మూలాలు. ఏకంగా గవర్నర్ కొడుకు నుంచి శనివారం టీవీ విలేకరి ఆకస్మిక మృతి దాకా.. వ్యాపమ్ కుంభకోణం, ఆ స్కామ్ నిందితులు, సాక్షుల అనుమానాస్పద మరణాలపై ‘సాక్షి’ ఫోకస్... - నేషనల్ డెస్క్ వ్యాపమ్ అంటే? ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్)’. దీనికే మరోపేరు ‘ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్(పీఈబీ)’. మధ్యప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల పరీక్షల నిర్వహణ కోసం 1970లో ‘ప్రి మెడికల్ టెస్ట్ బోర్డ్’గా ఇది ఏర్పడింది. 1981లో ప్రీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ కోసం ‘ప్రి ఇంజనీరింగ్ బోర్డ్’ను ఏర్పాటు చేసి, అనంతరం 1982లో ఈ రెండింటినీ విలీనం చేసి వ్యాపమ్ లేదా పీఈబీగా మార్చారు. ఆ తరువాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో లేని ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల నిర్వహణను కూడా దీనికే అప్పగించారు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ సర్వీసుల్లోని ఉద్యోగాలతో పాటు టీచర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు.. తదితర ప్రభుత్వ ఉద్యోగాల నియామక బాధ్యతను వ్యాపమ్‌కు అప్పగించారు. కుంభకోణం విస్తృతి ఎంత? ఈ స్కాంకు పాల్పడిన మాఫియా మూలాలు చాలా లోతు ఉన్నాయి. ప్రభుత్వంలో, అధికారుల్లో, పోలీసుల్లో, రాజకీయ నేతల్లో.. ప్రతీ రంగంలో, ప్రతీ స్థాయిలో వీరికి ప్రతినిధులున్నారు. ఏజెంట్లున్నారు. 2007 - 2013 మధ్య రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షను.. చివరకు బ్యాంకు పరీక్షలైన ఎస్బీఐ, ఐబీపీఎస్‌లను సైతం వీరు వదల్లేదు. ఇప్పటివరకు తెలిసిన వివరాల మేరకే ఈ కుంభకోణం విలువ రూ.2 వేల కోట్ల పైమాటే. అయితే, అసలు కుంభకోణంలో ఈ 2 వేల కోట్లు కనీసం 5% కూడా కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి 2004 నుంచే రాష్ట్రంలో ఈ మాఫియా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ఏయే పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డారు? 2013లో జరిగిన ప్రి మెడికల్ టెస్ట్(పీఎంటీ), 2012లో జరిగిన మెడికల్ ప్రి పీజీ టెస్ట్, ఫుడ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ టెస్ట్, సుబేదార్- సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ప్లాటూన్ కమాండర్ సెలక్షన్ టెస్ట్, మిల్క్ ఫెడరేషన్ టెస్ట్, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ టెస్ట్, కాంట్రాక్ట్ టీచర్ సెలక్షన్ టెస్ట్. ఇవి అవినీతి జరిగినట్లు బయటపడిన పరీక్షలు మాత్రమే. వీటిలో పీఎంటీలో అవకతవకలు 2008 నుంచే ప్రారంభమయ్యాయని తేలింది. ఇంకా బయటపడని అవినీతి పరీక్షలు మరెన్నో ఉన్నాయన్నది సాక్షాత్తూ దర్యాప్తు అధికారులే చెబుతున్నారు. 2008- 2013 మధ్య 1,087 మంది అనర్హ విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించారు. వారి అడ్మిషన్లను తరువాత రద్దు చేశారు. వేలాది మంది అనర్హులు డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దాంతో అర్హులైన, సమర్ధులైన విద్యార్థులు, అభ్యర్థులు తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారు. ఎలా బయట పడింది? 2013లో ఇండోర్‌కు చెందిన విజిల్ బ్లోయర్ డాక్టర్ ఆనంద్ రాయ్ ప్రి మెడికల్ టెస్ట్ స్కామ్‌ను బయటపెట్టారు. గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిష్ చతుర్వేది ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువుల పాత్రను బయటపెట్టారు. దాంతో, ఈ కుంభకోణం దర్యాప్తును స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్)కు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్టీఎఫ్ దర్యాప్తును పర్యవేక్షించేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను మధ్యప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇతరపరీక్షల్లోనూ అవకతవకలు జరిగిన విషయం బయటపడింది. ఇప్పటికే 2 వేల మంది అరెస్ట్ తక్షణమే రంగంలోకి దిగిన ఎస్టీఎఫ్ వేర్వేరు పరీక్షలకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసి.. అరెస్టుల పర్వం ప్రారంభించింది. ఇప్పటివరకు దాదాపు 2 వేల మందిని అరెస్ట్ చేసింది. ఇంకా 8 వందల మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అరెస్టయిన ప్రముఖుల్లో మాజీ బీజేపీ నేత, విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఆయన ఓఎస్డీ ఓపీ శుక్లా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సన్నిహితుడైన మైనింగ్ దిగ్గజం సుధీర్ శర్మ, గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ ఓఎస్డీ ధన్‌రాజ్ యాదవ్, డీఐజీ ఆర్కే శివహరి, వ్యాపమ్ అధికారులు పంకజ్ త్రివేదీ, సీకే మిశ్రా, నితిన్ మహేంద్ర, అజయ్ సేన్ తదితరులున్నారు. వీరే కాకుండా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డజన్ల సంఖ్యలో దళారులు, వందలాదిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారు అరెస్టైన వారిలో ఉన్నారు. మృత్యుహేల... అన్నీ స్కాముల్లోనూ దర్యాప్తులు, విచారణలు, అరెస్టులు మామూలే. కాని ఈ కుంభకోణం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోని భయానక కోణాన్ని బయటపెట్టింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న నిందితులు, సాక్షులు వరుసగా చనిపోతున్నారు. దాదాపు అవన్నీ ‘అసహజ మరణాలే’ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవి సాధారణ మరణాలు కావని, అనుమానాస్పద మరణాలేనని ఎస్టీఎఫ్ సైతం ఒప్పుకుంది. ఇప్పటివరకు అలా 25 మంది చనిపోయారని అధికారిక ఒప్పుకోలు కాగా.. మొత్తం 42 మంది అసహజ మరణం పాలయ్యారనేది అనధికార సమాచారం. చనిపోయినవారిలో కొందరు పోలీస్ కస్టడీలో మరణించగా, కొందరు బెయిల్‌పై బయట ఉండగా ప్రాణాలు కోల్పోయారు. కుంభకోణంలో తమ పాత్ర బయటపడకూడదని భావిస్తున్న ‘పెద్దలు’ చేయిస్తోన్న హత్యలే ఇవని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. గవర్నర్, ముఖ్యమంత్రి బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు ఈ కుంభకోణంతో జతపడి ఉండటంతో వారి ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన ఆనంద్ రాయ్, ఆశిశ్ చతుర్వేది సహా బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులెందరో తమకు ప్రాణ హాని ఉందని, చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించడం కుంభకోణం వెనకున్న పెద్దల బలాన్ని, స్కామ్ తీవ్రతను తెలియచేస్తుండగా.. ‘పుట్టినవారు గిట్టక తప్పద’ంటూ రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్ గౌర్ మెట్ట వేదాంతం చెబుతుండటం ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, దళసరి చర్మతత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. స్కామ్ ఏంటి? భారీ ఎత్తున డబ్బులు తీసుకుని మెడిసిన్, పీజీ మెడికల్ కాలేజీల్లో వందలాదిగా అనర్హులకు ప్రవేశం కల్పించారు. కానిస్టేబుల్, కాంట్రాక్ట్ టీచర్, ఫుడ్ ఇన్స్పెక్టర్.. తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ విస్తృత స్థాయిలో అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్ష రాయించడం, పరీక్ష హాల్లో అభ్యర్థుల సీటింగ్ స్థానాల్లో మార్పులు చేయడం(మధ్యలో తెలివైన అభ్యర్థిని కూర్చోబెట్టి.. అతని వెనక, ముందు, తమ అభ్యర్థులుండేలా చూసుకుని, చూసి రాసే అవకాశం కల్పించడం) , బయటే జవాబు పత్రాలు రాయించడం, ఓఎంఆర్ షీట్లను మార్చడం.. ఇలా ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో అనర్హులకు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, కనీస విద్యార్హతలు కూడా లేనివారికి ప్రభుత్వోద్యోగాలు కల్పించారు. గవర్నర్ హస్తం ఉందా? ఫారెస్ట్ గార్డుల నియామకం కోసం ఐదుగురి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ పైనా కేసు నమోదైంది. కానీ గవర్నర్‌కున్న రాజ్యాంగ హక్కులను పేర్కొంటూ ఆ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. చనిపోయిన నిందితులు, సాక్షుల్లో ముఖ్యులు.. శైలేశ్యాదవ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడు. ఈ స్కామ్‌లో నిందితుడు. 2015, మార్చి 25న లక్నోలోని తమ బంగళాలో చనిపోయి కనిపించాడు. ఆయనకు మధుమేహం ఉందని, బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మరణానికి కారణమేమిటనేది తెలియలేదని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొనడం గమనార్హం. చనిపోయే ముందురోజు రాత్రి వరకు మామూలుగానే ఉన్నారు. నమ్రత దామర్ ఇండోర్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని. 2010లో మెడికల్ ఎంట్రన్స్‌లో అవకతవకలకు పాల్పడి... వైద్యసీటు పొందిన వారి జాబితాలో ఈమె పేరు కూడా ఉంది. కాలేజీ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయింది. ఎటువెళ్లింది, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడుంది... వీటికి సమాధానాల్లేవు. అంతా మిస్టరీ. అదృశ్యమైన ఏడురోజులకు జనవరి 7, 2012న ఉజ్జయిని జిల్లాలోని కేతా గ్రామసమీపాన రైల్వే ట్రాక్‌పై ఆమె మృతదేహం కనిపించింది. రామేంద్రసింగ్ భడోరియా ఈ ఏడాది జనవరిలో ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొద్దిరోజులకే రామేంద్రసింగ్ (30) ఉరివేసుకొని చనిపోయాడు. కుంభకోణంతో సంబంధమున్న వారు ఎలాంటి విషయాలూ వెల్లడించవద్దని రామేంద్రసింగ్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, దీన్ని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబం ఆరోపించింది. రామేంద్ర చనిపోయిన వారం రోజులకే అతని తల్లి యాసిడ్ తాగి బలవన్మరణం పొందింది. విజయ్ సింగ్ ఈ స్కామ్‌లో కీలక నిందితుడు. పలువురు పెద్దల తరఫున ప్రధాన దళారీ అని సమాచారం. ఈ సంవత్సరం ఏప్రిల్ 28న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలోని ఒక లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది. ఆ లాడ్జి ఒక బీజేపీ ఎమ్మెల్యేది. డాక్టర్ రాజేంద్ర ఆర్య వ్యాపమ్ స్కాంలో అరెస్టవగా ఏడాది కిందటే బెయిల్ వచ్చింది. డాక్టర్ రాజేంద్ర (40) వ్యక్తిగత పనిమీద కోటాకు వెళ్లివస్తుండగా... ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది. జూన్ 28న గ్వాలియర్‌లోని బిర్లా ఆసుపత్రిలో కన్నుమూశారు. డాక్టర్ తోమర్, డాక్టర్ రాజేంద్ర ఆర్యలు కేవలం 24 గంటల వ్యవధిలో అనూహ్యంగా మృతి చెందడం గమనార్హం. డాక్టర్ డీకే సకాలే స్కామ్ నిందితుడు. జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్. అక్రమపద్ధతిలో సీట్లు పొందిన వారిని కోర్సు నుంచి తొలగించగా... వారు సకాలేను నిలదీశారు. వీరి ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు 30 రోజుల మెడికల్ లీవుపై వెళ్లారు. 2014 జులైలో కాలిన గాయాలతో చనిపోయాడు. డాక్టర్ నరేంద్ర సింగ్ తోమర్ అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్. స్కామ్‌లో భాగంగా, అభ్యర్థుల బదులు పరీక్షలు రాసేందుకు సమర్థులైన వారిని ఏర్పాటు చేసేవాడని ఆరోపణ. ఇండోర్ జైల్లో ఉండగా, కిందటినెలలో (జూన్ 27న) గుండెపోటుతో చనిపోయాడు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లనే చనిపోయాడని తోమర్ తండ్రి ఆరోపణ. 27న మధ్యాహ్నం తాము కలిసినపుడు ఆరోగ్యంగా ఉన్నాడని, తీవ్రంగా హింసిస్తున్నారని మొరపెట్టుకున్నాడని కుటుంబీకులు చెప్పారు. అదే రాత్రి మహరాజా యశ్వంత్‌రావు ఆసుపత్రికి తరలించగా... ఆసుపత్రికి తెచ్చేసరికే తుదిశ్వాస విడిచాడని డాక్టర్లు ప్రకటించారు. విమర్శలు వెల్లువెత్తడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అయితే వరుసపెట్టి జరుగుతున్న అనుమానాస్పద, అసహజ మరణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది. -
భారత దంపతుల అనుమానాస్పద మృతి
కొలంబో: శ్రీలంకలోని ఒక హోటల్ గదిలో అనుమానాస్పదరీతిలో మరణించిన భారతీయ దంపతుల మృతదేహాలను శుక్రవారం పోలీసులు గుర్తించారు. పురుషుని వయసు 30 ఏళ్లు, మహిళ వయసు 27 ఏళ్లు ఉండవచ్చని తెలిపారు. కొలంబో సమీపంలోని వెల్లవెట్టాలో ఉన్న ఈ హోటల్లో మార్చి 27 నుంచి వీరు ఉంటున్నారని తెలిపారు. మృతుల బంధువులెవరూ లేకపోవడంతో మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించలేదని, మృతురాలి తల్లిదండ్రులకు సమాచారమిచ్చినట్లు పోలీసులు తెలిపారు. గురువారం రాత్రినుంచి వీరు బయటకు రాకపోవడంతో హోటల్ యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రక్తచరిత్ర
హత్యలు.. ఆత్మహత్యలు.. అనుమానాస్పద మరణాలు.. రోడ్డు ప్రమాదాలు.. వరకట్న మరణాలు.. ఇలా వరుస నేరాలతో.. 2014 సంవత్సరం.. జిల్లాలో రక్తచరిత్ర రాసింది. మామిడికుదురు మండలం నగరం గ్రామంలో.. 22 మందిని బలిగొన్న గెయిల్ పైపులైను పేలుడు ప్రమాదం జిల్లాను వణికించింది. చమురు అన్వేషణ సాగుతున్న కోనసీమ ప్రాంత ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. అలాగే, యు.కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుళ్లు 18 మంది నిర్భాగ్యుల ఉసురు తీశాయి. ఈ ఏడాది జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఏకంగా 577 మంది దుర్మరణం పాలయ్యారు. వివిధ సంఘటనల్లో 115 మంది హత్యకు గురయ్యారు. లైంగిక దాడులు.. దొంగతనాలు.. ఇతర నేరాలు కూడా ఈ ఏడాది ఎక్కువగానే జరిగాయి. - కాకినాడ క్రైం/రాజమండ్రి క్రైం భయంగొలిపిన హత్యలు జనవరి 23న రాజమండ్రి చెరుకూరి సుబ్బారావు నగర్లో గోవిందు అనే వ్యక్తి తన భార్య పాప(30)పై అనుమానం పెంచుకున్నాడు. కత్తితో అతి కిరాతకంగా నరికి ఆమెను హతమార్చాడు. ప్రత్తిపాడు మండలం గజ్జనపూడిలో జూన్ 25న తండ్రీకొడుకులను ప్రత్యర్థులు స్థల వివాదంలో హతమార్చారు. ఆగస్టు 7న కాకినాడ పాతబస్టాండు ప్రాంతానికి చెందిన శ్రీరామకృష్ణ అనే వ్యక్తి అనుమానంతో తన భార్య మరియమ్మను ముక్కలుముక్కలుగా నరికి డస్ట్బిన్లు, ఉప్పుటేరులో పడేయడం సంచలనం రేపింది. అనుమానాస్పద మృతులు... కిర్లంపూడి మండలం శృంగరాయునిపాలేనికి చెందిన బొజ్జపు నర్సరత్నం అలియాస్ లక్ష్మి (24) తన ఇంటి బాత్రూమ్లో కాలిన గాయాలతో ఫిబ్రవరి 13న అనుమానాస్పదంగా మృతి చెందింది. మార్చి 28న రౌతులపూడి మండలం శృంగవరానికి చెందిన మేకల కాపరి ఈగల సత్యనారాయణ (50) కాలిన గాయాలతో అనుమానాస్పదంగా మృతి చెందాడు. కాకినాడ రూరల్ మండలం సూర్యారావుపేట లైట్‌హౌస్ ప్రాంతానికి చెందిన దూడ పుష్ప (20) కాలిన గాయాలతో మార్చి 29న అనుమానాస్పదంగా మరణించింది. ఆత్మహత్యలు.. భర్త శ్రీను వేధింపులు తట్టుకోలేక కడియం మండలం వేమగిరితోటకు చెందిన దంగేటి మంగ (32) జనవరి 10న ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. రాజానగరం జీఎస్ఎల్ వైద్య కళాశాల విద్యార్థిని మెర్ల శ్రీలక్ష్మి (26) యాజమాన్యం వేధింపులతో మనస్తాపం చెంది ఫిబ్రవరి 14న కాకినాడలోని తన నివాసంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పెదపూడి మండలం జి.మామిడాడకు చెందిన వ్యాపారవేత్త కర్రి సుబ్బారెడ్డి (56) పిఠాపురం మండలం చిత్రాడ రైల్వే గేటు వద్ద మార్చి 24న రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏసీబీ వలలో.. రూ.20 వేలు లంచం తీసుకుంటూ బిక్కవోలు ఆర్ఐ ఏప్రిల్ 2న ఏసీబీ అధికారులకు చిక్కాడు. రూ.15 వేలు లంచం తీసుకుంటున్న అమలాపురం మున్సిపల్ కమిషనర్‌ను ఏసీబీ అధికారులు ఆగస్టు 27న వలపన్ని పట్టుకున్నారు. సెప్టెంబర్ 10న రాజమండ్రి నగరపాలక సంస్థలో బిల్లుపై సంతకం చేసేందుకు కాంట్రాక్టర్ నుంచి రూ.20 వేలు తీసుకుంటూ ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ పట్టుబడ్డారు. రహదారుల రక్తదాహం ఆలమూరు మండలం మడికికి చెందిన తండ్రీ కొడుకులు నంద్యాల ధనకృష్ణ, దుర్గాప్రసాద్‌లు ఫిబ్రవరి 24న మోటార్ సైకిల్‌పై వెళ్తుండగా చెముడులంక వద్ద కారు ఢీకొని మృతి చెందారు. కొత్తపేట మండలం గొలకోటివారిపాలెం వద్ద ఏప్రిల్ 6న ఐషర్ వ్యాన్ ఢీకొనడంతో ఆటోలో ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది మృతి చెందారు. సెప్టెంబర్ 12న పెద్దాపురం ఏడీబీ రోడ్డులో 108 అంబులెన్స్, ఆర్టీసీ బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 108 పైలట్, టెక్నీషియన్ మరణించారు. పేట్రేగిన కామాంధులు ఫిబ్రవరి 8న అనపర్తిలో ఓ బాలికపై లక్ష్మీ నరసాపురానికి చెందిన కామాంధుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. రామచంద్రపురం మండలం ఉండూరులో మార్చి 8న కన్నకూతురిపైనే ఓ తండ్రి లైంగికదాడికి యత్నించడం సంచలనం రేపింది. బిక్కవోలు మండలం కొంకుదురులో సెప్టెంబర్ 19న మూగ బాలికపై కామాంధుడి లైంగికదాడికి పాల్పడ్డాడు. వణికించిన ప్రమాదాలు మార్చి 11న ధవళేశ్వరంలో తాటాకిల్లు దగ్ధమై, ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సజీవ దహనమయ్యారు. మామిడికుదురు మండలం నగరంలో జూన్ 27న గెయిల్ గ్యాస్ పైపులైను పేలిపోవడంతో 15 మంది సజీవ దహనమయ్యారు. ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మరో ఏడుగురు మృతి చెందారు. అక్టోబర్ 21న ఉప్పాడ కొత్తపల్లి మండలం వాకతిప్పలోని బాణసంచా తయారీ కేంద్రంలో జరిగిన పేలుడులో 18 మంది మృతి చెందారు. నకిలీ కరెన్సీ రాయవరం మండలం వి.సావరం ఇటుక బట్టీలో పనిచేసే పరదక్షిణ వెంకన్న, వీధి లక్ష్మిలను పోలీసులు జనవరి 14న అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.71 లక్షల నకిలీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. ఫిబ్రవరి 8న దొంగనోట్లతో ఫైనాన్స్ వ్యాపారం చేస్తున్న ముగ్గురిని మండపేట పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 1785 రూ.500 నకిలీ నోట్లు, రూ.3,800 నగదు, 2 బైకులు, 5 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. భారీగా రికవరీలు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పల్లిదేరంగుల శ్రీనివాసులు అనే చైన్స్నాచర్ను పోలీసులు ఫిబ్రవరి 8న అరెస్టు చేశారు. అతడి నుంచి రూ.25 లక్షల సొత్తు స్వాధీనం చేసుకున్నారు. చైన్ స్నాచింగ్‌లకు పాల్పడుతున్న ఏడుగురు ముఠా సభ్యులను కాకినాడ క్రైం పోలీసులు ఫిబ్రవరి 22న అరెస్టు చేసి, వారి నుంచి రూ.11 లక్షల చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో చొరబడి ఒంటరిగా ఉన్న మహిళలను బంధించి దోపిడీ చేసే అంతర్ జిల్లా ముఠాకు చెందిన 12 మందిని రామచంద్రపురం పోలీసులు ఫిబ్రవరి 26న అరెస్టు చేశారు. వారి నుంచి మారణాయుధాలు, 3 కార్లు స్వాధీనం చేసుకున్నారు. గంజాయి రవాణాకు చెక్ విశాఖ ఏజెన్సీ నుంచి ఫిబ్రవరి 22న గంజాయి తరలిస్తున్న తొమ్మిది మంది ముఠా సభ్యులను తుని టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి రూ.1.57 లక్షల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. జగ్గంపేట మండలం రామవరం హైవేలో మే 5న వ్యాన్‌లో తరలిస్తున్న రూ.10 లక్షల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అక్టోబర్ 25న చింతూరు మండలం మోతుగూడెం వద్ద రూ.50 లక్షల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
అనుమానాస్పద స్థితిలో ఇద్దరి మృతి
మంచాల, న్యూస్‌లైన్: అనుమానాస్పద స్థితిలో ఇద్దరు మృతిచెందారు. ఈ సంఘటన శుక్రవారం రాత్రి మంచాల శివారులో చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. మంచాల గ్రామానికి చెందిన ఏర్పుల శంకర్(45), ఆయన బంధువు ఇబ్రహీంపట్నం మండలం ముక్కునూరు గ్రామానికి చెందిన మల్లేశ్(27) శుక్రవారం సాయంత్రం మంచాల నుంచి బయటకు వెళ్లారు. రాత్రి 9:30 గంటల సమయంలో మంచాల-జాపాల రహదారిలో వారు తీవ్రగాయాలతో మృతిచెంది ఉన్నారు. వాహనదారుల సమాచారంతో మంచాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మామ,అల్లుడు దుర్మరణం చెందినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా గుర్తుతెలియని వ్యక్తుల దాడిలో శంకర్, మల్లేశ్ మృతిచెందారని కుటుంబీకులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తులో ఉంది.