బావిలో నుంచి మృతదేహాలను బయటికి తీస్తున్న స్థానికులు
జహీరాబాద్ : ఈనెల 14వ తేదీన అదృశ్యమైన ఇద్దరు యువకులు అల్గోల్ క్రాస్‌రోడ్డు వద్ద ఓ పాడుబడిన బావిలో గురువారం శవాలై తేలిన ఘటన కలకలం రేపింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. మొగుడంపల్లి మండలంలోని మాడ్గికి చెందిన చాంద్‌పాష కుమారుడు మొయిజొద్దీన్(20), బిక్కు మియా కుమారుడు ఇస్మాయిల్ అలియాస్ సద్దాం(20) ఇద్దరు కలిసి 14వ తేదీన ఉదయం 11.30 గంటలకు మోటార్ సైకిల్‌పై జహీరాబాద్‌కు వచ్చారు.
పాడైన టీవీని రిపేర్ నిమిత్తం స్థానికంగా ఓ మెకానిక్‌కు ఇచ్చి వెళ్లి పోయారు. ఆ రోజు రాత్రికి వీరు ఇంటికి రాక పోవడంతో కంగారు పడిన వారి కుటుంబ సభ్యులు మరుసటి రోజు జహీరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరా ఫుటేజీల్లో వీరు మూసానగర్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అక్కడి నుంచి ఎక్కడికి వెళ్లారో ఆచూకీ లభించలేదు. కుటుంబ సభ్యులు అప్పటి నుంచి జహీరాబాద్ పట్టణం, పరిసర గ్రామాల్లో ఎంత గాలించినా ఎలాంటి వివరాలు తెలియలేదు.
గురువారం 65వ జాతీయ రహదారి పక్కన ఉన్న పాడు పడిన వ్యవసాయ బావి నుంచి దుర్వాసన వస్తుండడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న డీఎస్పీ నల్లమల రవి, సీఐ సైదేశ్వర్, ఎస్.ఐ ప్రభాకర్‌రావు మృతదేహాలను గుర్తించి క్రేన్ సహాయంతో బయటకు తీశారు. మృతులు మాడ్గి గ్రామానికి చెందిన మొయిజొద్దీన్, సద్దాంగా గుర్తించారు. ఈ మేరకు జహీరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
మిస్టరీగా మారిన యువకుల మృతి..
ఆరు రోజుల క్రితం అదృశ్యమైన యువకుల మరణం మిస్టరీగా మారింది. ఆత్మహత్య చేసుకున్నారా లేక ఎవరైనా హత్య చేసి శవాలను బావిలో వేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వీరి కుటుంబాలకు ఎవరితోనైనా పాత కక్షలు ఉన్నాయా, ఇంకేమైన తగాదాలు వచ్చాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
వీరి వెళ్లిన మోటారు సైకిల్ అల్లీపూర్ శివారులో బుధవారం లభ్యం కావడం, గురువారం వీరి మృతదేహాలు బయటపడడం అనేక అనుమానాలకు దారి తీస్తోంది. సద్దాం మృతదేహానికి కాళ్లు, చేతులు తాళ్లతో కట్టేసి ఉండడం వీటికి బలం చేకూరుస్తుంది. బంధువులు, కుటుంబ సభ్యులు హత్యచేసి బావిలో పడవేశారని అనుమానిస్తున్నారు.
అన్ని కోణాల్లో దర్యాప్తు
అనుమానాస్పద స్థితిలో మరణించిన యువకుల మృతిపై విచారణ చేపట్టినట్లు ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి పేర్కొన్నారు. గురువారం సాయంత్రం ఆయన మృతదేహాలు లభించిన వ్యవసాయ బావిని సందర్శించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఆత్మహత్యలకు పాల్పడ్డారా లేక, ఎవరైనా హత్యచేసి బావిలో వేశారా అనే కోణంలో దర్యాప్తు జరుపుతున్నట్లు పేర్కొన్నారు.
మాడ్గిలో విషాదం
మొగుడంపల్లి మండలంలోని మాడ్గి గ్రామానికి చెందిన యువకులు మొయిజొద్దీన్, ఇస్మాయిల్‌లు అనుమాన స్పద స్థితిలో మరణించడంతో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ నెల 14 వ తేదీన టీవీ రిపేర్ చేయించుకుని వస్తామని చెప్పి వెళ్లిన యువకులు నాలుగు రోజుల అనంతరం మృతదేహాలుగా దొరకంతో బంధువులు, కుటుంబ సభ్యులు సభ్యులు షాక్‌కు గురయ్యారు.
చేతికి వచ్చిన కుమారులను కోల్పోయిన తల్లి దండ్రుల రోదనలు మిన్నంటాయి. సమాచారం అందుకున్న మాడ్గి సర్పంచ్ ఆకాష్ జహీరాబాద్‌లోని సంఘటనా స్థలాన్ని సందర్శించారు. మృతుల బంధువులను టీడీపీ జిల్లా అధ్యక్షుడు వై.నరోత్తం పరామర్శించి ఓదార్చారు.
Comments
Please login to add a commentAdd a comment