Vyapam scandal
-
‘వ్యాపమ్’ దర్యాప్తునకు 40 మందితో సీబీఐ బృందం
న్యూఢిల్లీ: మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణంపై దర్యాప్తు చేయటానికి కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ఆదివారం 40 మంది అధికారులతో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. జాయింట్ డెరైక్టర్ స్థాయి అధికారి సారథ్యంలోని ఈ బృందం సోమవారం భోపాల్ చేరుకుని దర్యాప్తు స్వీకరిస్తుందని.. సీబీఐ మీడియా సమాచార అధికారి ఆర్.కె.గౌర్ తెలిపారు. వ్యాపమ్ కుంభకోణం పైనా, ఆ కుంభకోణానికి సంబంధించిన వారి అసహజ మరణాలపైనా సీబీఐ దర్యాప్తు జరపాలని సుప్రీంకోర్టు గత గురువారం ఆదేశించిన విషయం తెలిసిందే. సీబీఐ ఈ దర్యాప్తుపై ఈ నెల 24వ తేదీలోగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించాలని కూడా సుప్రీంకోర్టు నిర్దేశించింది. -
సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి
‘వ్యాపమ్’పై హైకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి స్కామ్ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు విచారణ భోపాల్/న్యూఢిల్లీ: వరుస మరణాలతో మృత్యు ఘంటికలు మోగిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో.. ఈ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మంగళవారం మధ్యప్రదేశ్ హైకోర్టును కోరింది. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు మరో రెండు రోజుల్లో(గురువారం) విచారించనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లో మంగళవారం మధ్యాహ్నం హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా హైకోర్టును కోరుతున్నా’నన్నారు. అనుమానాస్పద మరణాలపై కూడా సీబీఐ దర్యాప్తు జరుపుతుందన్నారు. ఆ వెంటనే, ఈ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపమ్ దర్యాప్తును ఇప్పటికే హైకోర్టు నియమించిన సిట్ పర్యవేక్షిస్తున్నందున సీబీఐ విచారణ అవసరం లేదని తాము భావిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరువురూ సోమవారం స్పష్టం చేయడం తెలిసిందే. సీబీఐ దర్యాప్తు ఒక్కటే సరిపోదని, ఆ విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగితేనే న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది. మరోవైపు, ఈ స్కామ్‌పై అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, స్కాం బయటపడడానికి ప్రధానకారకులైన ఆశిశ్ చతుర్వేది, ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండే దాఖలు చేసిన పిటిషన్లనూ సుప్రీంకోర్టు జూలై 9న విచారించనుంది. ఈ స్కామ్‌ను పరిశోధించేందుకు వెళ్లి, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ శరీర అంతర్గత భాగాలను పరీక్షల నిమిత్తం మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. అక్షయ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ ద్వారా విచారణ జరపాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది. ‘సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి’ సీబీఐ ద్వారా విచారణ జరపడం ఒక్కటే సరిపోదని, ఈ స్కామ్‌లో నిజానిజాలు వెల్లడయేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు సాగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని సీఎం శివరాజ్ సింగ్ హైకోర్టును కోరడం.. వాస్తవాలను కప్పిపుచ్చే మరో ప్రయత్నమని పేర్కొంది. అర్థంలేని కారణాలు చూపుతూ నిష్పాక్షిక దర్యాప్తునకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ సమాచార విభాగం చీఫ్ రణదీప్ సూర్జెవాలా విమర్శించారు. ఈ స్కామ్‌పై స్వతంత్ర దర్యాప్తు జరగాలని అరుణ్ జైట్లీ.. తన మద్దతుదారుల ప్రాణాల గురించి భయమేస్తుందని ఉమాభారతి.. కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్టీఎఫ్ అధికారులు కూడా తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారని ఎస్టీఎఫ్ చీఫ్ చంద్రేశ్ భూషణ్.. వ్యాఖ్యానించిన విషయాన్ని సుర్జెవాలా గుర్తు చేశారు. ‘దేశంలో ఏం జరుగుతుందనే విషయాలపై ప్రధాని అస్సలు మాట్లాడరు. టునీసియా, అల్జీరియాల్లో జరిగే ఘటనలపై మాత్రం ట్వీట్లు చేస్తుంటారు’ అని మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. 2జీ స్కామ్‌లో మాదిరిగా వారం వారం ఈ స్కామ్ దర్యాప్తు పురోగతిని సమీక్షించాలని సుప్రీంను కోరుతానన్నారు. ‘అవినీతి, నేరం’ ఈ రెండింటి ప్రమాదకర సమ్మేళనం వ్యాపమ్ అని అభివర్ణించిన సీపీఎం.. దీనిపై సుప్రీం పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తోపాటు, చౌహాన్ రాజీ డిమాండ్‌తో ఈ నెల 16న రాష్ట్రవ్యాప్త బంద్ చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది. శవరాజకీయాలపైనే ఆసక్తి: బీజేపీ వ్యాపమ్‌పై కాంగ్రెస్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ పార్టీకి శవ రాజకీయాలపైనే ఆసక్తి ఉంటుందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. వ్యాపమ్ స్కాంపై ఎలాంటి విచారణ జరపాలన్నది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. కూలంకష దర్యాప్తు సాగాలన్నదే బీజేపీ అభిమతమని, దర్యాప్తు తరువాత కాంగ్రెసే దోషిగా తేలుతుందని అన్నారు. సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలనే విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం సీఎం శివరాజ్ సింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, అలా చేస్తేనే విపక్ష దాడిని ఎదుర్కోగలమని భావించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ స్కామ్ చిన్న విషయమని, దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దానిపై విమర్శలు రావడంతో, ఆ తరువాత ఆ వ్యాఖ్య లలిత్ మోదీ వ్యవహారానికి సంబంధించి చేశానని వివరణ ఇచ్చారు. అసహజమే కానీ.. అనుమానాస్పదం కాదు: సిట్ చీఫ్ వ్యాపమ్ స్కామ్‌తో సంబంధమున్న వ్యక్తుల వరుస మరణాలపై ఆ స్కామ్‌ను పర్యవేక్షిస్తున్న హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రేశ్ భూషణ్ స్పందించారు. వాటిని అనుమానాస్పద మరణాలుగా భావించలేమన్నారు. అయితే, అవి అసహజ మరణాలేనన్న విషయంలో అనుమానం లేదన్నారు. ఆ మరణాలన్నింటి పైనా దర్యాప్తు జరపాలని స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించానన్నారు. ఈ మరణాలకు, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధం ఉన్నట్లు ఏమైనా అధారాలు లభిస్తే మరింత లోతైన దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఈ స్కామ్‌పై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సీబీఐ దర్యాప్తు కోరడంపై తనకెలాంటి అసంతృప్తి లేదన్నారు. ఇదిలా ఉండగా, వ్యామప్ దర్యాప్తులో భాగం పంచుకుని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ శరీర అంతర్గత అవయవ భాగాల శాంపుల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించనున్నారు. -
చౌహాన్లో చలనం!
అందరూ కోరుతున్నారని మాత్రమే కాదు... ఆ డిమాండు సహేతుకమైనదని తెలిసినా సరే ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపడానికి సిద్ధపడింది. మొన్నీమధ్యే ఎమర్జెన్సీ విధించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా అద్వానీ మొదలుకొని ఎందరో నేతలు వర్తమాన పరిస్థితుల గురించి మాట్లాడారు. అది మరోసారి వచ్చినా రావొచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ మళ్లీ వచ్చే అవకాశం లేనేలేదని కొందరు వాదించారు. ఈ వాదప్రతివాదాలతో నిమిత్తం లేకుండానే దేశంలో ఆ తరహా వాతావరణం ఉన్నదని చెప్పడానికి మధ్యప్రదేశ్ అన్నివిధాలా సరిపోతుందని వ్యాపమ్ కుంభకోణం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును గమనిస్తే అర్థమవుతుంది. వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం, సర్కారీ కొలువుల్లో నియామకాల వ్యవహారాలను చూస్తున్న వ్యాపమ్ కుంభకోణం బయటి ప్రపంచానికి వెల్లడైనప్పటినుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు దిగ్భ్రాంతి కరంగా ఉన్నాయి. మన దేశంలో కుంభకోణాలు కొత్తగాదు...అలాంటివి బయటపడినప్పుడు కొన్ని అనుమానాస్పద మరణాలు సంభవించడమూ కొత్తగాదు. ఇందుకు 40 ఏళ్లక్రితం జరిగిన ఆనాటి రైల్వేమంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా కేసు మొదలుకొని ఎన్నిటినో ఉదహరించవచ్చు. కానీ వ్యాపమ్ స్కాం ఇలాంటివాటన్నిటినీ తలదన్నింది. ప్రవేశపరీక్షల్లో ఫలితాలను తారుమారు చేసేందుకు...సర్కారీ కొలువు ఇప్పించేందుకు ఒక్కొక్కరినుంచి రూ. 15 లక్షలు మొదలుకొని రూ. 50 లక్షల వరకూ వసూలు చేశారని ఈ కుంభకోణాన్ని బయటపెట్టినవారిలో ఒకడైన యువకుడు ఆశిష్ చతుర్వేది చెప్పారంటే దీని విస్తృతి ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. ఈ కేసుతో ప్రమేయమున్నవారిలో ఒకరు కాదు..ఇద్దరు కాదు, ఇప్పటికి 48మంది మరణించారు. ఒక కుంభకోణంలో మారణహోమం అనదగ్గ స్థాయిలో ఒక్కొక్కరూ రాలిపోతుంటే చావుపుట్టుకలు అత్యంత సహజమన్నట్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించింది. ఈ మరణాల విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉన్నది కనుక సీబీఐకి అప్పగించాలని అన్ని పక్షాలూ అడుగుతున్నా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందుకు ససేమిరా అన్నారు. తాము నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతున్నదని, దాన్ని హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పర్యవేక్షిస్తున్నదని ఎదురు వాదనకు దిగారు. హైకోర్టే సీబీఐ దర్యాప్తు అనవసరమని చెప్పి తమ చేతులు కట్టేసిందన్నట్టు మాట్లాడారు. చౌహాన్‌కు తోచకపోతే పోయింది... కనీసం బీజేపీ అధిష్టానమైనా విజ్ఞతతో వ్యవహరిస్తుందనుకుంటే అదీ లేదు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చౌహాన్‌ను మించిపోయారు. ‘సుప్రీంకోర్టునో, హైకోర్టునో మేం ఆదేశించలేం. సీబీఐ దర్యాప్తు అవసరమని వారనుకుంటే ఆదేశాలిస్తారు. మేం పాటిస్తాం’ అని ప్రకటించి రాజ్‌నాథ్ అందరినీ ఖంగుతినిపించారు. చావుకు పెడితే లంకణానికి వచ్చినట్టు... వ్యాపమ్ స్కామ్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సోమవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాక కదలిక వచ్చింది. ఇన్నాళ్లూ తాము నిస్సహాయులమని మాట్లాడినవారు ఇప్పుడు తీరు మార్చుకున్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించమని హైకోర్టును కోరనున్నట్టు చౌహాన్ ప్రకటించారు. ఈ కుంభకోణంపై దర్యాప్తు మొదలుపెట్టాక అరెస్టయిన 1,800మందిలో చాలామంది బెయిల్ మంజూరైనా ఈనాటికీ జైళ్లను వదలడంలేదు. అలా బెయిల్ లభించి బయటికెళ్లినవారిలో అనేకులు అనుమానాస్పద స్థితిలో మరణించడమే అందుకు కారణం. ఇంతవరకూ మరణించినవారిలో కొందరు రోడ్డు ప్రమాదాల్లో, మరికొందరు గుండెపోటుతోనో, మరో ఇతర కారణంతోనో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతుల బంధువులందరూ ఈ మరణాల్లో కుట్ర ఉన్నదని అనుమానించారు. గత అయిదారు రోజుల పరిణామాలను గమనిస్తేనే ఇందులో నిజం ఉన్నదని అనిపిస్తుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇండోర్ జైల్లో ఉన్న పశుసంవర్థక శాఖ అధికారి నరేంద్ర సింగ్ తోమర్ గుండెపోటుతో మరణించారు. ఇది ఖచ్చితంగా హత్యేనని ఆరోపించిన కుటుంబసభ్యుల్ని అజ్ఞాత వ్యక్తులు బెదిరించారు. ఈ కేసులోనే అరెస్టయి బెయిల్‌పై విడుదలై శవంగా మారిన నమ్రత అనే యువతి మరణంలో మిస్టరీని ఛేదించడానికి వెళ్లిన ఒక చానెల్ పాత్రికేయుడు అక్షయ్‌సింగ్ ఉన్నట్టుండి నురుగలు కక్కుకుని చనిపోయారు. స్కామ్‌కు సంబంధించి అవసరమైన అనేక పత్రాలను దర్యాప్తు బృందానికి అందజేసిన జబల్పూర్ వైద్య కళాశాల డీన్ న్యూఢిల్లీలోని ఒక హోటల్ రూంలో కన్నుమూశారు. 6,300 కోట్ల రూపాయల ఈ స్కామ్ వెనక బలమైన మాఫియా ఉన్నదని, అది సాక్ష్యాలను మాయం చేయడానికి ఈ మారణహోమం సాగిస్తున్నదని ఆరోపణలు వచ్చినప్పుడు సున్నితంగా ఆలోచించగలిగిన ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలనుకుంటుంది. కానీ, మధ్యప్రదేశ్ సర్కారు, దానికి కర్తవ్య నిర్దేశం చేయాల్సిన బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచించలేకపోయాయి. సాధారణంగా నిలదీసేవారినీ, సవాల్ చేసేవారినీ రాజ్యం క్షమించదు. ఉగ్రరూపమెత్తి విరుచుకుపడుతుంది. అంతా ‘సవ్యంగా’ ఉన్నదనుకునేవరకూ ప్రశాంతంగా ఉండదు. మరి వ్యాపమ్ కుంభకోణంలో దర్యాప్తు చేస్తుండగా వరసబెట్టి నిందితులుగా ఉన్నవారూ, ఈ కేసు గురించి ఆరా తీసేవారూ చనిపోతుంటే రాజ్యం ఇలా చేతగానట్టు, చేష్టలుడిగినట్టు ఎందుకుండిపోయింది? కుంభకోణాన్ని బయటపెట్టినవారు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటే ఎందుకంత నిస్సహాయతలో పడింది? అధికారంలో ఉన్నవారికీ, కుంభకోణాన్ని నడిపించిన మాఫియాకూ సాన్నిహిత్యం ఉంటే తప్ప ఇలా జరగడం సాధ్యంకాదు. మధ్యప్రదేశ్‌లో అంతుచిక్కని మరణాల రహస్యం అందులో ఉంది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అయినా సక్రమంగా జరిగి బాధ్యుల్ని గుర్తిస్తే...ఈ మరణాల వెనకున్న కూపీ లాగితే అది వ్యవస్థపై ఉండే నమ్మకాన్ని నిలబెడుతుంది. అలా నమ్మకాన్ని నిలబెట్టదల్చుకున్నారా... ఎప్పటిలా దాన్ని నవ్వులపాలు చేయదల్చుకున్నారా అన్నది పాలకులు తేల్చుకోవాలి. -
‘వ్యాపమ్’లో మరో మరణం
ఢిల్లీలో శవమై కనిపించిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ ♦ మధ్యప్రదేశ్‌కు వెళ్లిన విలేకరి అనూహ్య మరణం మరునాడే ♦ మరో అనుమానాస్పద మృతి ♦ కాలేజీ అడ్మిషన్లలో అక్రమాలపై నివేదిక ఇచ్చిన ♦ రెండు రోజులకే డీన్ అరుణ్‌శర్మ ఢిల్లీ హోటల్లో మరణం ♦ అదే కాలేజీలో ఆయనకన్నా ముందు డీన్‌గా పనిచేసిన సకల్లే.. ♦ ఏడాది కిందట కాలిన శవంగా ప్రత్యక్షం ♦ ఇప్పటికే అధికారికంగా 25 దాటిపోయిన ‘వ్యాపమ్’ మరణాలు న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం రోజు రోజుకూ దారుణ మలుపులు తిరుగుతోంది. బడా నేతలు సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలున్న ఈ కుంభకోణంతో సంబంధమున్న వారి వరుస అసహజ మరణాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి వార్తా రచనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లాలో పరిశోధనకు వెళ్లిన ఒక టీవీ చానల్ విలేకరి శనివారం అనూహ్యంగా అసహజ రీతిలో మరణించిన మరునాడే.. ఇదే కుంభకోణానికి సంబంధించిన మరో కీలక వ్యక్తి ఆదివారం అనుమానాస్పద స్థితిలో విగతజీవుడయ్యారు. జబల్పూర్లోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్‌శర్మ (64) ఢిల్లీలో ఒక హోటల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవుడై కనిపించారు. అరుణ్‌శర్మకు ముందు అదే కాలేజీకి డీన్‌గా ఉన్న డి.కె.సకల్లే గత ఏడాది జూలై 4వ తేదీన తన ఇంట్లో మంటల్లో కాలిపోయి చనిపోయి కనిపించాడు. ప్రీ-మెడికల్ టెస్ట్‌లో ఏ ఏ అభ్యర్థుల తరఫున నకిలీ అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారన్న అంశాన్ని సకల్లే కాలేజీ అడ్మిషన్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తాజాగా.. అదే అంశాన్ని పరిశీలిస్తున్న అరుణ్‌శర్మ కూడా ఢిల్లీలో శవమై కనిపించారు. ఇప్పటికే వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి దోషులుగా, సాక్షులుగా ఉన్న వారి వరుస అసహజ మరణాల సంఖ్య అధికారికంగానే 25 దాటిపోతుండటంతో.. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. విలేకరి అంత్యక్రియలకు ముందే... అక్రమ పద్ధతిలో ఎంబీబీఎస్ సీటు సంపాదించారన్న ఆరోపణలపై వ్యాప్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న 19 ఏళ్ల వైద్య విద్యార్థిని నమ్రతా దామర్.. 2012 జనవరిలో అదృశ్యమై.. వారం రోజుల తర్వాత 7వ తేదీన ఉజ్జయిని జిల్లాలో రైలు పట్టాలపై శవంగా కనిపించింది. ఆమెది ఆత్మహత్య అని పోలీసులు పేర్కొనగా.. కుంభకోణానికి సంబంధించి ఆమె వద్ద ఆధారాలు ఉన్నందునే ఆమెను హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ అంశంపై హతురాలి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయటానికి మధ్యప్రదేశ్‌లోని శనివారం ఆమె స్వస్థలానికి వెళ్లిన టీవీ టుడే టీవీ చానల్ విలేకరి అక్షయ్‌సింగ్ (38).. వారిని ఇంటర్వ్యూ చేయటం ముగిసీ ముగియటంతోనే నురగలు కక్కుతూ కుప్పకూలటం, ఆస్పత్రికి తరలించేటప్పటికే చనిపోవటం తెలిసిందే. అతడి అంత్యక్రియలను ఆదివారం ఢిల్లీలో నిర్వహించగా.. అంతకుముందే నైరుతి ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ద్వారకా ప్రాంతంలో గల ఉపల్ హోటల్లో.. జబల్పూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్‌శర్మ మృతదేహాన్ని గుర్తించారు. అతడి గదిలో దాదాపు ఖాళీగా ఉన్న మద్యం సీసా, వాంతులు చేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. అరుణ్‌శర్మ శనివారం సాయంత్రం ఈ హోటల్ గదిలో దిగారని.. ఆయన ఆదివారం ఉదయం అగర్తలలో ఒక వైద్య కళాశాలను అధికారికంగా తనిఖీ చేసేందుకు వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు. హోటల్ సిబ్బంది ఆదివారం ఉదయం ఆయన గది తలుపును ఎంతగా తట్టినా స్పందన లేకపోవటంతో.. వారు డూప్లికేట్ తాళం చెవిని వినియోగించి గదిలోకి ప్రవేశించారని.. అరుణ్‌శర్మ మృతదేహం మంచంపై పడివుండటం గుర్తించి తమకు సమాచారం అందించారని చెప్పారు. ఆయనకు కొన్ని గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు ఆయన కుమారుడు చెప్పారని, హోటల్ గదిలో కొన్ని మందులు (ఔషధాలు) కూడా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఫోరెన్స్‌క్ నిపుణులు ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పంపించారు. అరుణ్‌శర్మ మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. రెండ్రోజుల కిందటే అరుణ్‌శర్మ నివేదిక! ‘‘డాక్టర్ అరుణ్‌శర్మ మరణం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయన డాక్టర్ సకల్లేకు చాలా సన్నిహితుడు’’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జబల్పూర్ జిల్లా అధ్యక్షుడు సుధీర్ తివారీ పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఏడాది కిందట డాక్టర్ సకల్లే ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు దర్యాప్తు అనంతరం నిర్ధారించారని.. అలాగే అరుణ్‌శర్మ కూడా హత్యకు గురై ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి డాక్టర్ అరుణ్‌శర్మ తన నివేదికను రెండు రోజుల కిందట స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్టీఎఫ్)కు సమర్పించారని తనకు తెలిసిందని చెప్పారు. డాక్టర్ అరుణ్‌శర్మ తండ్రి ఎన్.కె.శర్మ గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎంపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారని.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన దిగ్విజయ్‌సింగ్ ట్విటర్లో పేర్కొన్నారు. ‘సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలి’ మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఆప్ పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధం ఉన్న వారి వరుస మరణాలు.. లోతైన కుట్రలో భాగమని, ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. డాక్టర్ అరుణ్‌శర్మతో కలిపి ఇప్పటివరకూ 45 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని.. ఇది భారతదేశంలో అత్యంత క్రూరమైన కుంభకోణమని కాంగ్రెస్ సమాచార విభాగం ఇన్చార్జ్ రణ్‌దీప్‌సుర్జేవాలా అభివర్ణించారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. ‘విలేకరి మరణంపై దర్యాప్తుకు సిట్‌కు లేఖ రాస్తాం’ న్యూఢిల్లీ/భోపాల్: అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విలేకరి అక్షయ్‌సింగ్ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను.. నిష్పాక్షిక ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం మధ్యప్రదేశ్ వెలుపలకు పంపించాలని, ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించాలని తాము కోరుకుంటున్నామని.. ఇండియా టుడే గ్రూప్ ఆదివారం ఎంపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విలేకరి అక్షయ్‌సింగ్ మరణంపై కూలంకషంగా దర్యాప్తు చేయించాలని తమ ప్రభుత్వం.. హైకోర్టు నియమించిన ‘సిట్’కు లేఖ రాస్తుందని పేర్కొన్నారు. వ్యాపమ్ కుంభకోణంపై దర్యాప్తును సీబీఐ సహా మరే ఇతర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా తమ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం సీఎం చౌహాన్‌తో ఫోన్లో మాట్లాడారు. విలేకరి మరణంపై దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు. అక్షయ్ అంత్యక్రియలకు రాహుల్, కేజ్రీవాల్ హాజరు న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కాంపై పరిశోధన చేస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించిన టీవీ చానల్ విలేకరి అక్షయ్‌సింగ్ అంత్యక్రియలను ఆదివారం ఢిల్లీలో నిర్వహించారు. అంత్యక్రియలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు హాజరయ్యారు. తూర్పు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో జరిగిన ఈ అంత్యక్రియలకు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, డీపీసీసీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా తదితరులు హాజరై నివాళులర్పించారు. మృతి చెందిన విలేకరి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలిశానని.. తనకు ఎంతో బాధ కలిగిందని.. ఈ తీవ్ర విచార సమయంలో తాను వారి కోసం ప్రార్థిస్తున్నానని రాహుల్ ట్విటర్లో వ్యాఖ్యానించారు. పాత్రికేయుడి మృతితో పాటు.. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించిన మరణాలన్నిటిపైనా దర్యాప్తు జరిపి, దోషులకు శిక్ష విధించేలా, మరిక ఇటువంటి మరణాలు సంభవించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని కేజ్రీవాల్ ట్విటర్ వ్యాఖ్యల్లో డిమాండ్ చేశారు. -
మృత్యు బేహరి
వ్యాపమ్ స్కామ్‌లో 42 మరణాలు అంతుచిక్కని రీతిలో అనుమానాస్పదంగా చనిపోతున్న నిందితులు, సాక్షులు ఇదీ భారతీయులకు అలవాటైన, సాధారణమైపోయిన కుంభకోణాల్లాంటిదే. కోట్ల రూపాయల గోల్మాల్.. పెద్దల హస్తం.. పెద్దన్నల పాత్ర.. ఆరోపణలు, ప్రత్యారోపణలు, దర్యాప్తు, విచారణ.. అన్నీ కామనే. ఇందులోనూ అవన్నీ ఉన్నాయి. వాటితో పాటు ఈ స్కామ్‌లో ఉన్నవి భయం గొలిపే అసాధారణ, అసహజ, అనుమానాస్పద మరణాలు.. వ్యవస్థ లోలోతుల్లోకి వెళ్లిన మాఫియా మూలాలు. ఏకంగా గవర్నర్ కొడుకు నుంచి శనివారం టీవీ విలేకరి ఆకస్మిక మృతి దాకా.. వ్యాపమ్ కుంభకోణం, ఆ స్కామ్ నిందితులు, సాక్షుల అనుమానాస్పద మరణాలపై ‘సాక్షి’ ఫోకస్... - నేషనల్ డెస్క్ వ్యాపమ్ అంటే? ‘వ్యవసాయిక్ పరీక్షా మండల్(వ్యాపమ్)’. దీనికే మరోపేరు ‘ప్రొఫెషనల్ ఎగ్జామినేషన్ బోర్డ్(పీఈబీ)’. మధ్యప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల్లో ప్రవేశాల పరీక్షల నిర్వహణ కోసం 1970లో ‘ప్రి మెడికల్ టెస్ట్ బోర్డ్’గా ఇది ఏర్పడింది. 1981లో ప్రీ ఇంజనీరింగ్ ఎంట్రెన్స్ పరీక్షల నిర్వహణ కోసం ‘ప్రి ఇంజనీరింగ్ బోర్డ్’ను ఏర్పాటు చేసి, అనంతరం 1982లో ఈ రెండింటినీ విలీనం చేసి వ్యాపమ్ లేదా పీఈబీగా మార్చారు. ఆ తరువాత రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరిధిలో లేని ప్రభుత్వ ఉద్యోగాల నియామక పరీక్షల నిర్వహణను కూడా దీనికే అప్పగించారు. పోలీస్, రెవెన్యూ, ఎక్సైజ్ సర్వీసుల్లోని ఉద్యోగాలతో పాటు టీచర్లు, ఫుడ్ ఇన్స్పెక్టర్లు, ఆయుర్వేద డాక్టర్లు.. తదితర ప్రభుత్వ ఉద్యోగాల నియామక బాధ్యతను వ్యాపమ్‌కు అప్పగించారు. కుంభకోణం విస్తృతి ఎంత? ఈ స్కాంకు పాల్పడిన మాఫియా మూలాలు చాలా లోతు ఉన్నాయి. ప్రభుత్వంలో, అధికారుల్లో, పోలీసుల్లో, రాజకీయ నేతల్లో.. ప్రతీ రంగంలో, ప్రతీ స్థాయిలో వీరికి ప్రతినిధులున్నారు. ఏజెంట్లున్నారు. 2007 - 2013 మధ్య రాష్ట్రంలో నిర్వహించిన ఏ పరీక్షను.. చివరకు బ్యాంకు పరీక్షలైన ఎస్బీఐ, ఐబీపీఎస్‌లను సైతం వీరు వదల్లేదు. ఇప్పటివరకు తెలిసిన వివరాల మేరకే ఈ కుంభకోణం విలువ రూ.2 వేల కోట్ల పైమాటే. అయితే, అసలు కుంభకోణంలో ఈ 2 వేల కోట్లు కనీసం 5% కూడా కాదని పరిశీలకులు అంటున్నారు. నిజానికి 2004 నుంచే రాష్ట్రంలో ఈ మాఫియా కార్యకలాపాలు ప్రారంభమయ్యాయని చెబుతున్నారు. ఏయే పరీక్షల్లో అవినీతికి పాల్పడ్డారు? 2013లో జరిగిన ప్రి మెడికల్ టెస్ట్(పీఎంటీ), 2012లో జరిగిన మెడికల్ ప్రి పీజీ టెస్ట్, ఫుడ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ టెస్ట్, సుబేదార్- సబ్ ఇన్స్పెక్టర్ అండ్ ప్లాటూన్ కమాండర్ సెలక్షన్ టెస్ట్, మిల్క్ ఫెడరేషన్ టెస్ట్, పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ టెస్ట్, కాంట్రాక్ట్ టీచర్ సెలక్షన్ టెస్ట్. ఇవి అవినీతి జరిగినట్లు బయటపడిన పరీక్షలు మాత్రమే. వీటిలో పీఎంటీలో అవకతవకలు 2008 నుంచే ప్రారంభమయ్యాయని తేలింది. ఇంకా బయటపడని అవినీతి పరీక్షలు మరెన్నో ఉన్నాయన్నది సాక్షాత్తూ దర్యాప్తు అధికారులే చెబుతున్నారు. 2008- 2013 మధ్య 1,087 మంది అనర్హ విద్యార్థులు మెడికల్ కాలేజీల్లో సీట్లు సంపాదించారు. వారి అడ్మిషన్లను తరువాత రద్దు చేశారు. వేలాది మంది అనర్హులు డబ్బులు పెట్టి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు. దాంతో అర్హులైన, సమర్ధులైన విద్యార్థులు, అభ్యర్థులు తమ ఉజ్వల భవిష్యత్తును కోల్పోయారు. ఎలా బయట పడింది? 2013లో ఇండోర్‌కు చెందిన విజిల్ బ్లోయర్ డాక్టర్ ఆనంద్ రాయ్ ప్రి మెడికల్ టెస్ట్ స్కామ్‌ను బయటపెట్టారు. గ్వాలియర్‌కు చెందిన సామాజిక కార్యకర్త ఆశిష్ చతుర్వేది ఈ స్కామ్‌లో ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ బంధువుల పాత్రను బయటపెట్టారు. దాంతో, ఈ కుంభకోణం దర్యాప్తును స్పెషల్ టాస్క్‌ఫోర్స్(ఎస్టీఎఫ్)కు అప్పగిస్తున్నట్లు ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అసెంబ్లీలో ప్రకటించారు. ఎస్టీఎఫ్ దర్యాప్తును పర్యవేక్షించేందుకు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక ప్రత్యేక విచారణ బృందం(సిట్)ను మధ్యప్రదేశ్ హైకోర్టు ఏర్పాటు చేసింది. ఆ తరువాత ఇతరపరీక్షల్లోనూ అవకతవకలు జరిగిన విషయం బయటపడింది. ఇప్పటికే 2 వేల మంది అరెస్ట్ తక్షణమే రంగంలోకి దిగిన ఎస్టీఎఫ్ వేర్వేరు పరీక్షలకు సంబంధించి వేర్వేరు కేసులు నమోదు చేసి.. అరెస్టుల పర్వం ప్రారంభించింది. ఇప్పటివరకు దాదాపు 2 వేల మందిని అరెస్ట్ చేసింది. ఇంకా 8 వందల మందిని అదుపులోకి తీసుకోవాల్సి ఉందని పేర్కొంది. అరెస్టయిన ప్రముఖుల్లో మాజీ బీజేపీ నేత, విద్యా శాఖ మాజీ మంత్రి లక్ష్మీకాంత్ శర్మ, ఆయన ఓఎస్డీ ఓపీ శుక్లా, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కు సన్నిహితుడైన మైనింగ్ దిగ్గజం సుధీర్ శర్మ, గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ ఓఎస్డీ ధన్‌రాజ్ యాదవ్, డీఐజీ ఆర్కే శివహరి, వ్యాపమ్ అధికారులు పంకజ్ త్రివేదీ, సీకే మిశ్రా, నితిన్ మహేంద్ర, అజయ్ సేన్ తదితరులున్నారు. వీరే కాకుండా పదుల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, డజన్ల సంఖ్యలో దళారులు, వందలాదిగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, అక్రమంగా ఉద్యోగాలు సంపాదించిన వారు అరెస్టైన వారిలో ఉన్నారు. మృత్యుహేల... అన్నీ స్కాముల్లోనూ దర్యాప్తులు, విచారణలు, అరెస్టులు మామూలే. కాని ఈ కుంభకోణం మాత్రం ప్రజాస్వామ్య వ్యవస్థలోని భయానక కోణాన్ని బయటపెట్టింది. ఈ కుంభకోణంలో ప్రమేయమున్న నిందితులు, సాక్షులు వరుసగా చనిపోతున్నారు. దాదాపు అవన్నీ ‘అసహజ మరణాలే’ కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. అవి సాధారణ మరణాలు కావని, అనుమానాస్పద మరణాలేనని ఎస్టీఎఫ్ సైతం ఒప్పుకుంది. ఇప్పటివరకు అలా 25 మంది చనిపోయారని అధికారిక ఒప్పుకోలు కాగా.. మొత్తం 42 మంది అసహజ మరణం పాలయ్యారనేది అనధికార సమాచారం. చనిపోయినవారిలో కొందరు పోలీస్ కస్టడీలో మరణించగా, కొందరు బెయిల్‌పై బయట ఉండగా ప్రాణాలు కోల్పోయారు. కుంభకోణంలో తమ పాత్ర బయటపడకూడదని భావిస్తున్న ‘పెద్దలు’ చేయిస్తోన్న హత్యలే ఇవని ప్రతిపక్షాలు, ప్రజాసంఘాలు ఆరోపిస్తున్నాయి. గవర్నర్, ముఖ్యమంత్రి బంధువులు, ఇద్దరు ఆరెస్సెస్ నేతలు, డజన్ల సంఖ్యలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల పేర్లు ఈ కుంభకోణంతో జతపడి ఉండటంతో వారి ఆరోపణలకు బలం చేకూరుతోంది. ఈ కుంభకోణాన్ని బయటపెట్టిన ఆనంద్ రాయ్, ఆశిశ్ చతుర్వేది సహా బెయిల్‌పై బయటకు వచ్చిన నిందితులెందరో తమకు ప్రాణ హాని ఉందని, చంపేస్తామని బెదిరింపు కాల్స్ వస్తున్నాయని, తమకు రక్షణ కల్పించాలని కోర్టును ఆశ్రయించడం కుంభకోణం వెనకున్న పెద్దల బలాన్ని, స్కామ్ తీవ్రతను తెలియచేస్తుండగా.. ‘పుట్టినవారు గిట్టక తప్పద’ంటూ రాష్ట్ర హోంమంత్రి బాబూలాల్ గౌర్ మెట్ట వేదాంతం చెబుతుండటం ప్రభుత్వ నిష్క్రియా పరత్వాన్ని, దళసరి చర్మతత్వాన్ని తేటతెల్లం చేస్తోంది. స్కామ్ ఏంటి? భారీ ఎత్తున డబ్బులు తీసుకుని మెడిసిన్, పీజీ మెడికల్ కాలేజీల్లో వందలాదిగా అనర్హులకు ప్రవేశం కల్పించారు. కానిస్టేబుల్, కాంట్రాక్ట్ టీచర్, ఫుడ్ ఇన్స్పెక్టర్.. తదితర ప్రభుత్వ ఉద్యోగ నియామకాల్లోనూ విస్తృత స్థాయిలో అవినీతికి పాల్పడి పెద్ద ఎత్తున సొమ్ము చేసుకున్నారు. ఒకరి స్థానంలో మరొకరితో పరీక్ష రాయించడం, పరీక్ష హాల్లో అభ్యర్థుల సీటింగ్ స్థానాల్లో మార్పులు చేయడం(మధ్యలో తెలివైన అభ్యర్థిని కూర్చోబెట్టి.. అతని వెనక, ముందు, తమ అభ్యర్థులుండేలా చూసుకుని, చూసి రాసే అవకాశం కల్పించడం) , బయటే జవాబు పత్రాలు రాయించడం, ఓఎంఆర్ షీట్లను మార్చడం.. ఇలా ఏ పద్ధతిలో వీలైతే ఆ పద్ధతిలో అనర్హులకు మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు, కనీస విద్యార్హతలు కూడా లేనివారికి ప్రభుత్వోద్యోగాలు కల్పించారు. గవర్నర్ హస్తం ఉందా? ఫారెస్ట్ గార్డుల నియామకం కోసం ఐదుగురి నుంచి లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ పైనా కేసు నమోదైంది. కానీ గవర్నర్‌కున్న రాజ్యాంగ హక్కులను పేర్కొంటూ ఆ ఎఫ్ఐఆర్ను హైకోర్టు కొట్టేసింది. చనిపోయిన నిందితులు, సాక్షుల్లో ముఖ్యులు.. శైలేశ్యాదవ్ గవర్నర్ రామ్ నరేశ్ యాదవ్ కుమారుడు. ఈ స్కామ్‌లో నిందితుడు. 2015, మార్చి 25న లక్నోలోని తమ బంగళాలో చనిపోయి కనిపించాడు. ఆయనకు మధుమేహం ఉందని, బ్రెయిన్ హెమరేజ్‌తో చనిపోయాడని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అయితే మరణానికి కారణమేమిటనేది తెలియలేదని పోస్ట్‌మార్టమ్ నివేదిక పేర్కొనడం గమనార్హం. చనిపోయే ముందురోజు రాత్రి వరకు మామూలుగానే ఉన్నారు. నమ్రత దామర్ ఇండోర్ మెడికల్ కాలేజ్ విద్యార్థిని. 2010లో మెడికల్ ఎంట్రన్స్‌లో అవకతవకలకు పాల్పడి... వైద్యసీటు పొందిన వారి జాబితాలో ఈమె పేరు కూడా ఉంది. కాలేజీ హాస్టల్ నుంచి కనిపించకుండా పోయింది. ఎటువెళ్లింది, ఎవరు తీసుకెళ్లారు, ఎక్కడుంది... వీటికి సమాధానాల్లేవు. అంతా మిస్టరీ. అదృశ్యమైన ఏడురోజులకు జనవరి 7, 2012న ఉజ్జయిని జిల్లాలోని కేతా గ్రామసమీపాన రైల్వే ట్రాక్‌పై ఆమె మృతదేహం కనిపించింది. రామేంద్రసింగ్ భడోరియా ఈ ఏడాది జనవరిలో ఈయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది. కొద్దిరోజులకే రామేంద్రసింగ్ (30) ఉరివేసుకొని చనిపోయాడు. కుంభకోణంతో సంబంధమున్న వారు ఎలాంటి విషయాలూ వెల్లడించవద్దని రామేంద్రసింగ్పై తీవ్ర ఒత్తిడి తెచ్చారని, దీన్ని తట్టుకోలేకే ప్రాణాలు తీసుకున్నాడని కుటుంబం ఆరోపించింది. రామేంద్ర చనిపోయిన వారం రోజులకే అతని తల్లి యాసిడ్ తాగి బలవన్మరణం పొందింది. విజయ్ సింగ్ ఈ స్కామ్‌లో కీలక నిందితుడు. పలువురు పెద్దల తరఫున ప్రధాన దళారీ అని సమాచారం. ఈ సంవత్సరం ఏప్రిల్ 28న ఛత్తీస్‌గఢ్‌లోని కాంకెర్ జిల్లాలోని ఒక లాడ్జిలో అనుమానాస్పద స్థితిలో ఆయన మృతదేహం కనిపించింది. ఆ లాడ్జి ఒక బీజేపీ ఎమ్మెల్యేది. డాక్టర్ రాజేంద్ర ఆర్య వ్యాపమ్ స్కాంలో అరెస్టవగా ఏడాది కిందటే బెయిల్ వచ్చింది. డాక్టర్ రాజేంద్ర (40) వ్యక్తిగత పనిమీద కోటాకు వెళ్లివస్తుండగా... ఒక్కసారిగా ఆరోగ్యం విషమించింది. జూన్ 28న గ్వాలియర్‌లోని బిర్లా ఆసుపత్రిలో కన్నుమూశారు. డాక్టర్ తోమర్, డాక్టర్ రాజేంద్ర ఆర్యలు కేవలం 24 గంటల వ్యవధిలో అనూహ్యంగా మృతి చెందడం గమనార్హం. డాక్టర్ డీకే సకాలే స్కామ్ నిందితుడు. జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్. అక్రమపద్ధతిలో సీట్లు పొందిన వారిని కోర్సు నుంచి తొలగించగా... వారు సకాలేను నిలదీశారు. వీరి ఒత్తిడి నుంచి తప్పించుకునేందుకు 30 రోజుల మెడికల్ లీవుపై వెళ్లారు. 2014 జులైలో కాలిన గాయాలతో చనిపోయాడు. డాక్టర్ నరేంద్ర సింగ్ తోమర్ అసిస్టెంట్ వెటర్నరీ ఆఫీసర్. స్కామ్‌లో భాగంగా, అభ్యర్థుల బదులు పరీక్షలు రాసేందుకు సమర్థులైన వారిని ఏర్పాటు చేసేవాడని ఆరోపణ. ఇండోర్ జైల్లో ఉండగా, కిందటినెలలో (జూన్ 27న) గుండెపోటుతో చనిపోయాడు. పోలీసులు చిత్రహింసలకు గురిచేయడం వల్లనే చనిపోయాడని తోమర్ తండ్రి ఆరోపణ. 27న మధ్యాహ్నం తాము కలిసినపుడు ఆరోగ్యంగా ఉన్నాడని, తీవ్రంగా హింసిస్తున్నారని మొరపెట్టుకున్నాడని కుటుంబీకులు చెప్పారు. అదే రాత్రి మహరాజా యశ్వంత్‌రావు ఆసుపత్రికి తరలించగా... ఆసుపత్రికి తెచ్చేసరికే తుదిశ్వాస విడిచాడని డాక్టర్లు ప్రకటించారు. విమర్శలు వెల్లువెత్తడంతో మధ్యప్రదేశ్ ప్రభుత్వం మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించింది. అయితే వరుసపెట్టి జరుగుతున్న అనుమానాస్పద, అసహజ మరణాలపై సీబీఐ చేత విచారణ చేయించాలని కాంగ్రెస్ గట్టిగా డిమాండ్ చేస్తోంది.