అందరూ కోరుతున్నారని మాత్రమే కాదు... ఆ డిమాండు సహేతుకమైనదని తెలిసినా సరే ఇన్నాళ్లూ నిమ్మకు నీరెత్తినట్టు ఉండిపోయిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఎట్టకేలకు వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరపడానికి సిద్ధపడింది. మొన్నీమధ్యే ఎమర్జెన్సీ విధించి నాలుగు దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా అద్వానీ మొదలుకొని ఎందరో నేతలు వర్తమాన పరిస్థితుల గురించి మాట్లాడారు. అది మరోసారి వచ్చినా రావొచ్చని చాలామంది అభిప్రాయపడ్డారు. ఎమర్జెన్సీ మళ్లీ వచ్చే అవకాశం లేనేలేదని కొందరు వాదించారు. ఈ వాదప్రతివాదాలతో నిమిత్తం లేకుండానే దేశంలో ఆ తరహా వాతావరణం ఉన్నదని చెప్పడానికి మధ్యప్రదేశ్ అన్నివిధాలా సరిపోతుందని వ్యాపమ్ కుంభకోణం విషయంలో ఆ రాష్ట్ర ప్రభుత్వ తీరును గమనిస్తే అర్థమవుతుంది. వివిధ వృత్తి విద్యా కోర్సుల ప్రవేశం, సర్కారీ కొలువుల్లో నియామకాల వ్యవహారాలను చూస్తున్న వ్యాపమ్ కుంభకోణం బయటి ప్రపంచానికి వెల్లడైనప్పటినుంచి చోటుచేసుకుంటున్న పరిణామాలు దిగ్భ్రాంతి కరంగా ఉన్నాయి.
మన దేశంలో కుంభకోణాలు కొత్తగాదు...అలాంటివి బయటపడినప్పుడు కొన్ని అనుమానాస్పద మరణాలు సంభవించడమూ కొత్తగాదు. ఇందుకు 40 ఏళ్లక్రితం జరిగిన ఆనాటి రైల్వేమంత్రి లలిత్ నారాయణ్ మిశ్రా కేసు మొదలుకొని ఎన్నిటినో ఉదహరించవచ్చు. కానీ వ్యాపమ్ స్కాం ఇలాంటివాటన్నిటినీ తలదన్నింది. ప్రవేశపరీక్షల్లో ఫలితాలను తారుమారు చేసేందుకు...సర్కారీ కొలువు ఇప్పించేందుకు ఒక్కొక్కరినుంచి రూ. 15 లక్షలు మొదలుకొని రూ. 50 లక్షల వరకూ వసూలు చేశారని ఈ కుంభకోణాన్ని బయటపెట్టినవారిలో ఒకడైన యువకుడు ఆశిష్ చతుర్వేది చెప్పారంటే దీని విస్తృతి ఏ స్థాయిలో ఉన్నదో అర్థమవుతుంది. ఈ కేసుతో ప్రమేయమున్నవారిలో ఒకరు కాదు..ఇద్దరు కాదు, ఇప్పటికి 48మంది మరణించారు. ఒక కుంభకోణంలో మారణహోమం అనదగ్గ స్థాయిలో ఒక్కొక్కరూ రాలిపోతుంటే చావుపుట్టుకలు అత్యంత సహజమన్నట్టు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ప్రవర్తించింది. ఈ మరణాల విషయంలో మరింత లోతుగా దర్యాప్తు జరగాల్సి ఉన్నది కనుక సీబీఐకి అప్పగించాలని అన్ని పక్షాలూ అడుగుతున్నా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అందుకు ససేమిరా అన్నారు. తాము నియమించిన స్పెషల్ టాస్క్‌ఫోర్స్ (ఎస్టీఎఫ్) నిష్పాక్షికంగా దర్యాప్తు జరుపుతున్నదని, దాన్ని హైకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) పర్యవేక్షిస్తున్నదని ఎదురు వాదనకు దిగారు. హైకోర్టే సీబీఐ దర్యాప్తు అనవసరమని చెప్పి తమ చేతులు కట్టేసిందన్నట్టు మాట్లాడారు. చౌహాన్‌కు తోచకపోతే పోయింది... కనీసం బీజేపీ అధిష్టానమైనా విజ్ఞతతో వ్యవహరిస్తుందనుకుంటే అదీ లేదు. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ చౌహాన్‌ను మించిపోయారు. ‘సుప్రీంకోర్టునో, హైకోర్టునో మేం ఆదేశించలేం. సీబీఐ దర్యాప్తు అవసరమని వారనుకుంటే ఆదేశాలిస్తారు. మేం పాటిస్తాం’ అని ప్రకటించి రాజ్‌నాథ్ అందరినీ ఖంగుతినిపించారు. చావుకు పెడితే లంకణానికి వచ్చినట్టు... వ్యాపమ్ స్కామ్‌పై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరిస్తూ సోమవారం కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాక కదలిక వచ్చింది. ఇన్నాళ్లూ తాము నిస్సహాయులమని మాట్లాడినవారు ఇప్పుడు తీరు మార్చుకున్నారు. ప్రజల మనోభావాలను గౌరవించి సీబీఐ దర్యాప్తునకు ఆదేశించమని హైకోర్టును కోరనున్నట్టు చౌహాన్ ప్రకటించారు.
ఈ కుంభకోణంపై దర్యాప్తు మొదలుపెట్టాక అరెస్టయిన 1,800మందిలో చాలామంది బెయిల్ మంజూరైనా ఈనాటికీ జైళ్లను వదలడంలేదు. అలా బెయిల్ లభించి బయటికెళ్లినవారిలో అనేకులు అనుమానాస్పద స్థితిలో మరణించడమే అందుకు కారణం. ఇంతవరకూ మరణించినవారిలో కొందరు రోడ్డు ప్రమాదాల్లో, మరికొందరు గుండెపోటుతోనో, మరో ఇతర కారణంతోనో ప్రాణాలు పోగొట్టుకున్నారు. మృతుల బంధువులందరూ ఈ మరణాల్లో కుట్ర ఉన్నదని అనుమానించారు. గత అయిదారు రోజుల పరిణామాలను గమనిస్తేనే ఇందులో నిజం ఉన్నదని అనిపిస్తుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇండోర్ జైల్లో ఉన్న పశుసంవర్థక శాఖ అధికారి నరేంద్ర సింగ్ తోమర్ గుండెపోటుతో మరణించారు.
ఇది ఖచ్చితంగా హత్యేనని ఆరోపించిన కుటుంబసభ్యుల్ని అజ్ఞాత వ్యక్తులు బెదిరించారు. ఈ కేసులోనే అరెస్టయి బెయిల్‌పై విడుదలై శవంగా మారిన నమ్రత అనే యువతి మరణంలో మిస్టరీని ఛేదించడానికి వెళ్లిన ఒక చానెల్ పాత్రికేయుడు అక్షయ్‌సింగ్ ఉన్నట్టుండి నురుగలు కక్కుకుని చనిపోయారు. స్కామ్‌కు సంబంధించి అవసరమైన అనేక పత్రాలను దర్యాప్తు బృందానికి అందజేసిన జబల్‌పూర్ వైద్య కళాశాల డీన్ న్యూఢిల్లీలోని ఒక హోటల్ రూంలో కన్నుమూశారు. 6,300 కోట్ల రూపాయల ఈ స్కామ్ వెనక బలమైన మాఫియా ఉన్నదని, అది సాక్ష్యాలను మాయం చేయడానికి ఈ మారణహోమం సాగిస్తున్నదని ఆరోపణలు వచ్చినప్పుడు సున్నితంగా ఆలోచించగలిగిన ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తు జరిపించాలనుకుంటుంది. కానీ, మధ్యప్రదేశ్ సర్కారు, దానికి కర్తవ్య నిర్దేశం చేయాల్సిన బీజేపీ అధిష్టానం ఆ దిశగా ఆలోచించలేకపోయాయి. సాధారణంగా నిలదీసేవారినీ, సవాల్ చేసేవారినీ రాజ్యం క్షమించదు. ఉగ్రరూపమెత్తి విరుచుకుపడుతుంది. అంతా ‘సవ్యంగా’ ఉన్నదనుకునేవరకూ ప్రశాంతంగా ఉండదు. మరి వ్యాపమ్ కుంభకోణంలో దర్యాప్తు చేస్తుండగా వరసబెట్టి నిందితులుగా ఉన్నవారూ, ఈ కేసు గురించి ఆరా తీసేవారూ చనిపోతుంటే రాజ్యం ఇలా చేతగానట్టు, చేష్టలుడిగినట్టు ఎందుకుండిపోయింది? కుంభకోణాన్ని బయటపెట్టినవారు ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటుంటే ఎందుకంత నిస్సహాయతలో పడింది? అధికారంలో ఉన్నవారికీ, కుంభకోణాన్ని నడిపించిన మాఫియాకూ సాన్నిహిత్యం ఉంటే తప్ప ఇలా జరగడం సాధ్యంకాదు. మధ్యప్రదేశ్‌లో అంతుచిక్కని మరణాల రహస్యం అందులో ఉంది. ఇప్పుడు సీబీఐ దర్యాప్తు అయినా సక్రమంగా జరిగి బాధ్యుల్ని గుర్తిస్తే...ఈ మరణాల వెనకున్న కూపీ లాగితే అది వ్యవస్థపై ఉండే నమ్మకాన్ని నిలబెడుతుంది. అలా నమ్మకాన్ని నిలబెట్టదల్చుకున్నారా... ఎప్పటిలా దాన్ని నవ్వులపాలు చేయదల్చుకున్నారా అన్నది పాలకులు తేల్చుకోవాలి.
చౌహాన్‌లో చలనం!
Published Tue, Jul 7 2015 11:39 PM | Last Updated on Mon, Jul 29 2019 7:43 PM
Advertisement
Advertisement