సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి | direct the CBI to probe | Sakshi
Sakshi News home page

సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి

Published Wed, Jul 8 2015 12:02 AM | Last Updated on Sun, Sep 3 2017 5:04 AM

సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి

సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలి

‘వ్యాపమ్’పై హైకోర్టుకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం విజ్ఞప్తి
స్కామ్ పిటిషన్లపై రేపు సుప్రీంకోర్టు విచారణ

 
భోపాల్/న్యూఢిల్లీ: వరుస మరణాలతో మృత్యు ఘంటికలు మోగిస్తున్న వ్యాపమ్ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తునకు మధ్యప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి తీవ్ర స్థాయిలో ఒత్తిడి వస్తున్న నేపథ్యంలో.. ఈ స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని మంగళవారం మధ్యప్రదేశ్ హైకోర్టును కోరింది. వ్యాపమ్ స్కామ్‌కు సంబంధించిన పిటిషన్లను సుప్రీంకోర్టు మరో రెండు రోజుల్లో(గురువారం) విచారించనుండగా.. రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ భోపాల్‌లో మంగళవారం మధ్యాహ్నం హడావుడిగా విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయం వెల్లడించారు. ‘ప్రజాస్వామ్యంలో ప్రజల ఆకాంక్షలకు ప్రముఖ స్థానం ఉంటుంది. ప్రజాభిప్రాయాన్ని గౌరవించి స్కామ్‌పై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాల్సిందిగా హైకోర్టును కోరుతున్నా’నన్నారు. అనుమానాస్పద మరణాలపై కూడా సీబీఐ దర్యాప్తు జరుపుతుందన్నారు. ఆ వెంటనే, ఈ స్కామ్‌లో సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని కోరుతూ మధ్యప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. వ్యాపమ్ దర్యాప్తును ఇప్పటికే హైకోర్టు నియమించిన సిట్ పర్యవేక్షిస్తున్నందున సీబీఐ విచారణ అవసరం లేదని తాము భావిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్, సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఇరువురూ సోమవారం స్పష్టం చేయడం తెలిసిందే.

సీబీఐ దర్యాప్తు ఒక్కటే సరిపోదని, ఆ విచారణ సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగితేనే న్యాయం జరుగుతుందని కాంగ్రెస్ పేర్కొంది.  మరోవైపు, ఈ స్కామ్‌పై అత్యున్నత న్యాయస్థానం పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తు జరగాలని కోరుతూ.. కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, స్కాం బయటపడడానికి ప్రధానకారకులైన ఆశిశ్ చతుర్వేది, ఆనంద్ రాయ్, ప్రశాంత్ పాండే దాఖలు చేసిన పిటిషన్లనూ సుప్రీంకోర్టు జూలై 9న విచారించనుంది. ఈ స్కామ్‌ను పరిశోధించేందుకు వెళ్లి, అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయిన జర్నలిస్ట్ అక్షయ్ సింగ్ శరీర అంతర్గత భాగాలను పరీక్షల నిమిత్తం మంగళవారం ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తీసుకువచ్చారు. అక్షయ్ అనుమానాస్పద మృతిపై సీబీఐ ద్వారా విచారణ జరపాలని ఎడిటర్స్ గిల్డ్ డిమాండ్ చేసింది.

 ‘సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలి’
 సీబీఐ ద్వారా విచారణ జరపడం ఒక్కటే సరిపోదని, ఈ స్కామ్‌లో నిజానిజాలు వెల్లడయేందుకు సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు సాగాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సీబీఐ దర్యాప్తునకు ఆదేశాలివ్వాలని సీఎం శివరాజ్ సింగ్ హైకోర్టును కోరడం.. వాస్తవాలను కప్పిపుచ్చే మరో ప్రయత్నమని పేర్కొంది. అర్థంలేని కారణాలు చూపుతూ నిష్పాక్షిక దర్యాప్తునకు ప్రభుత్వం అడ్డంకులు సృష్టిస్తోందని ఆ పార్టీ సమాచార విభాగం చీఫ్ రణదీప్ సూర్జెవాలా విమర్శించారు. ఈ స్కామ్‌పై స్వతంత్ర దర్యాప్తు జరగాలని అరుణ్ జైట్లీ.. తన మద్దతుదారుల ప్రాణాల గురించి భయమేస్తుందని ఉమాభారతి.. కేసును దర్యాప్తు చేస్తున్న ఎస్‌టీఎఫ్ అధికారులు కూడా తమకు ప్రాణహాని ఉందని భయపడుతున్నారని ఎస్‌టీఎఫ్ చీఫ్ చంద్రేశ్ భూషణ్.. వ్యాఖ్యానించిన విషయాన్ని సుర్జెవాలా గుర్తు చేశారు. ‘దేశంలో ఏం జరుగుతుందనే విషయాలపై ప్రధాని అస్సలు మాట్లాడరు. టునీసియా, అల్జీరియాల్లో జరిగే ఘటనలపై మాత్రం ట్వీట్లు చేస్తుంటారు’ అని  మరో సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఎద్దేవా చేశారు. 2జీ స్కామ్‌లో మాదిరిగా వారం వారం ఈ స్కామ్ దర్యాప్తు పురోగతిని సమీక్షించాలని సుప్రీంను కోరుతానన్నారు. ‘అవినీతి, నేరం’ ఈ రెండింటి ప్రమాదకర సమ్మేళనం వ్యాపమ్ అని అభివర్ణించిన సీపీఎం.. దీనిపై సుప్రీం పర్యవేక్షణలోనే సీబీఐ దర్యాప్తు జరగాలని డిమాండ్ చేసింది. ఈ డిమాండ్‌తోపాటు, చౌహాన్ రాజీ డిమాండ్‌తో ఈ నెల 16న రాష్ట్రవ్యాప్త బంద్ చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.

శవరాజకీయాలపైనే ఆసక్తి: బీజేపీ
వ్యాపమ్‌పై కాంగ్రెస్ ఆరోపణలపై స్పందిస్తూ.. ఆ పార్టీకి శవ రాజకీయాలపైనే ఆసక్తి ఉంటుందని బీజేపీ ఎదురుదాడికి దిగింది. వ్యాపమ్ స్కాంపై ఎలాంటి విచారణ జరపాలన్నది న్యాయస్థానాలు నిర్ణయిస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా పేర్కొన్నారు. కూలంకష దర్యాప్తు సాగాలన్నదే బీజేపీ అభిమతమని, దర్యాప్తు తరువాత కాంగ్రెసే దోషిగా తేలుతుందని అన్నారు. సీబీఐ దర్యాప్తు కోసం హైకోర్టుకు విజ్ఞప్తి చేయాలనే విషయంలో బీజేపీ అగ్రనాయకత్వం సీఎం శివరాజ్ సింగ్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందని, అలా చేస్తేనే విపక్ష దాడిని  ఎదుర్కోగలమని భావించిందని పార్టీ వర్గాలు వెల్లడించాయి. మరోవైపు, ఈ స్కామ్ చిన్న విషయమని, దీనిపై ప్రధాని నరేంద్రమోదీ స్పందించాల్సిన అవసరం లేదని కేంద్ర న్యాయ శాఖ మంత్రి సదానంద గౌడ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. దానిపై విమర్శలు రావడంతో, ఆ తరువాత ఆ వ్యాఖ్య లలిత్ మోదీ వ్యవహారానికి సంబంధించి చేశానని వివరణ ఇచ్చారు.
 
అసహజమే కానీ.. అనుమానాస్పదం కాదు: సిట్ చీఫ్
వ్యాపమ్ స్కామ్‌తో సంబంధమున్న వ్యక్తుల వరుస మరణాలపై ఆ స్కామ్‌ను పర్యవేక్షిస్తున్న హైకోర్టు రిటైర్డ్ జడ్జి చంద్రేశ్ భూషణ్ స్పందించారు. వాటిని అనుమానాస్పద మరణాలుగా భావించలేమన్నారు. అయితే, అవి అసహజ మరణాలేనన్న విషయంలో అనుమానం లేదన్నారు. ఆ మరణాలన్నింటి పైనా దర్యాప్తు జరపాలని స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ను ఆదేశించానన్నారు. ఈ మరణాలకు, వ్యాపమ్ స్కామ్‌కు సంబంధం ఉన్నట్లు ఏమైనా అధారాలు లభిస్తే మరింత లోతైన దర్యాప్తు జరుపుతామని తెలిపారు. ఈ స్కామ్‌పై ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ సీబీఐ దర్యాప్తు కోరడంపై తనకెలాంటి అసంతృప్తి లేదన్నారు. ఇదిలా ఉండగా, వ్యామప్ దర్యాప్తులో భాగం పంచుకుని అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించిన జబల్పూర్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్ శర్మ శరీర అంతర్గత అవయవ భాగాల శాంపుల్స్‌ను ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం హైదరాబాద్‌లోని సెంట్రల్ ఫొరెన్సిక్ సైన్స్ లాబోరేటరీకి పంపించనున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement