‘వ్యాపమ్’లో మరో మరణం | Vyapam scam: Medical college dean found dead | Sakshi
Sakshi News home page

‘వ్యాపమ్’లో మరో మరణం

Published Mon, Jul 6 2015 8:18 AM | Last Updated on Sun, Sep 3 2017 4:57 AM

డీన్ అరుణ్ శర్మ వ్యాపమ్ ఘటనలపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ భోపాల్ లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు

డీన్ అరుణ్ శర్మ వ్యాపమ్ ఘటనలపై సీబీఐ విచారణ చేపట్టాలంటూ భోపాల్ లో నిరసన తెలుపుతున్న కాంగ్రెస్ నేతలు

ఢిల్లీలో శవమై కనిపించిన జబల్‌పూర్ మెడికల్ కాలేజీ డీన్
మధ్యప్రదేశ్‌కు వెళ్లిన విలేకరి అనూహ్య మరణం మరునాడే
మరో అనుమానాస్పద మృతి
కాలేజీ అడ్మిషన్లలో అక్రమాలపై నివేదిక ఇచ్చిన
రెండు రోజులకే డీన్ అరుణ్‌శర్మ ఢిల్లీ హోటల్‌లో మరణం
అదే కాలేజీలో ఆయనకన్నా ముందు డీన్‌గా పనిచేసిన సకల్లే..
ఏడాది కిందట కాలిన శవంగా ప్రత్యక్షం
ఇప్పటికే అధికారికంగా 25 దాటిపోయిన ‘వ్యాపమ్’ మరణాలు

 
న్యూఢిల్లీ/భోపాల్: మధ్యప్రదేశ్‌లో వ్యాపమ్ కుంభకోణం రోజు రోజుకూ దారుణ మలుపులు తిరుగుతోంది. బడా నేతలు సూత్రధారులుగా ఉన్నారనే ఆరోపణలున్న ఈ కుంభకోణంతో సంబంధమున్న వారి వరుస అసహజ మరణాలు దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఈ స్కాంకు సంబంధించి వార్తా రచనలో భాగంగా మధ్యప్రదేశ్‌లోని జబువా జిల్లాలో పరిశోధనకు వెళ్లిన ఒక టీవీ చానల్ విలేకరి శనివారం అనూహ్యంగా అసహజ రీతిలో మరణించిన మరునాడే.. ఇదే కుంభకోణానికి సంబంధించిన మరో కీలక వ్యక్తి ఆదివారం అనుమానాస్పద స్థితిలో విగతజీవుడయ్యారు.

జబల్‌పూర్‌లోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్ మెడికల్ కాలేజ్ డీన్ అరుణ్‌శర్మ (64) ఢిల్లీలో ఒక హోటల్‌లో అనుమానాస్పద పరిస్థితుల్లో విగతజీవుడై కనిపించారు. అరుణ్‌శర్మకు ముందు అదే కాలేజీకి డీన్‌గా ఉన్న డి.కె.సకల్లే గత ఏడాది జూలై 4వ తేదీన తన ఇంట్లో మంటల్లో కాలిపోయి చనిపోయి కనిపించాడు. ప్రీ-మెడికల్ టెస్ట్‌లో ఏ ఏ అభ్యర్థుల తరఫున నకిలీ అభ్యర్థులు హాజరై పరీక్ష రాశారన్న అంశాన్ని సకల్లే కాలేజీ అడ్మిషన్ల ఆధారంగా దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆయన అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. తాజాగా.. అదే అంశాన్ని పరిశీలిస్తున్న అరుణ్‌శర్మ కూడా ఢిల్లీలో శవమై కనిపించారు. ఇప్పటికే వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి దోషులుగా, సాక్షులుగా ఉన్న వారి వరుస అసహజ మరణాల సంఖ్య అధికారికంగానే 25 దాటిపోతుండటంతో.. దీనిపై సర్వత్రా ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి.  
 
విలేకరి అంత్యక్రియలకు ముందే...
అక్రమ పద్ధతిలో ఎంబీబీఎస్ సీటు సంపాదించారన్న ఆరోపణలపై వ్యాప్ కుంభకోణంలో నిందితురాలిగా ఉన్న 19 ఏళ్ల వైద్య విద్యార్థిని నమ్రతా దామర్.. 2012 జనవరిలో అదృశ్యమై.. వారం రోజుల తర్వాత 7వ తేదీన ఉజ్జయిని జిల్లాలో రైలు పట్టాలపై శవంగా కనిపించింది. ఆమెది ఆత్మహత్య అని పోలీసులు పేర్కొనగా.. కుంభకోణానికి సంబంధించి ఆమె వద్ద ఆధారాలు ఉన్నందునే ఆమెను హత్య చేశారని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.

ఈ అంశంపై హతురాలి తల్లిదండ్రులను ఇంటర్వ్యూ చేయటానికి మధ్యప్రదేశ్‌లోని శనివారం ఆమె స్వస్థలానికి వెళ్లిన టీవీ టుడే టీవీ చానల్ విలేకరి అక్షయ్‌సింగ్ (38).. వారిని ఇంటర్వ్యూ చేయటం ముగిసీ ముగియటంతోనే నురగలు కక్కుతూ కుప్పకూలటం, ఆస్పత్రికి తరలించేటప్పటికే చనిపోవటం తెలిసిందే. అతడి అంత్యక్రియలను ఆదివారం ఢిల్లీలో నిర్వహించగా.. అంతకుముందే నైరుతి ఢిల్లీలో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ద్వారకా ప్రాంతంలో గల ఉపల్ హోటల్‌లో.. జబల్‌పూర్ నేతాజీ సుభాష్ చంద్రబోస్ మెడికల్ కాలేజీ డీన్ అరుణ్‌శర్మ మృతదేహాన్ని గుర్తించారు.

అతడి గదిలో దాదాపు ఖాళీగా ఉన్న మద్యం సీసా, వాంతులు చేసుకున్న ఆనవాళ్లు ఉన్నాయి. అరుణ్‌శర్మ శనివారం సాయంత్రం ఈ హోటల్ గదిలో దిగారని.. ఆయన ఆదివారం ఉదయం అగర్తలలో ఒక వైద్య కళాశాలను అధికారికంగా తనిఖీ చేసేందుకు వెళ్లాల్సి ఉందని పోలీసులు తెలిపారు. హోటల్ సిబ్బంది ఆదివారం ఉదయం ఆయన గది తలుపును ఎంతగా తట్టినా స్పందన లేకపోవటంతో.. వారు డూప్లికేట్ తాళం చెవిని వినియోగించి గదిలోకి ప్రవేశించారని.. అరుణ్‌శర్మ మృతదేహం మంచంపై పడివుండటం గుర్తించి తమకు సమాచారం అందించారని చెప్పారు.

ఆయనకు కొన్ని గుండె సంబంధిత వ్యాధులు ఉన్నట్లు ఆయన కుమారుడు చెప్పారని, హోటల్ గదిలో కొన్ని మందులు (ఔషధాలు) కూడా గుర్తించామని పోలీసులు పేర్కొన్నారు. ఫోరెన్స్‌క్ నిపుణులు ఆధారాలను సేకరించి, మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం పంపించారు. అరుణ్‌శర్మ మరణంపై అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.
 
రెండ్రోజుల కిందటే అరుణ్‌శర్మ నివేదిక!
‘‘డాక్టర్ అరుణ్‌శర్మ మరణం దిగ్భ్రాంతికి గురిచేస్తోంది. ఆయన డాక్టర్ సకల్లేకు చాలా సన్నిహితుడు’’ అని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జబల్‌పూర్ జిల్లా అధ్యక్షుడు సుధీర్ తివారీ పీటీఐ వార్తా సంస్థతో పేర్కొన్నారు. ఏడాది కిందట డాక్టర్ సకల్లే ఆత్మహత్య చేసుకోలేదని పోలీసులు దర్యాప్తు అనంతరం నిర్ధారించారని.. అలాగే అరుణ్‌శర్మ కూడా హత్యకు గురై ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.

వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించి డాక్టర్ అరుణ్‌శర్మ తన నివేదికను రెండు రోజుల కిందట స్పెషల్ టాస్క్ ఫోర్స్ (ఎస్‌టీఎఫ్)కు సమర్పించారని తనకు తెలిసిందని చెప్పారు. డాక్టర్ అరుణ్‌శర్మ తండ్రి ఎన్.కె.శర్మ గతంలో మంత్రిగా, ఎంపీగా, ఎంపీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారని.. మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కూడా అయిన దిగ్విజయ్‌సింగ్ ట్విటర్‌లో పేర్కొన్నారు.
 
‘సుప్రీం పర్యవేక్షణలో సీబీఐ దర్యాప్తు చేయాలి’
మధ్యప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్, ఆప్ పార్టీలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాయి. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధం ఉన్న వారి వరుస మరణాలు.. లోతైన కుట్రలో భాగమని, ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తోందని కాంగ్రెస్ పేర్కొంది. డాక్టర్ అరుణ్‌శర్మతో కలిపి ఇప్పటివరకూ 45 మంది అనుమానాస్పద పరిస్థితుల్లో చనిపోయారని.. ఇది భారతదేశంలో అత్యంత క్రూరమైన కుంభకోణమని కాంగ్రెస్ సమాచార విభాగం ఇన్‌చార్జ్ రణ్‌దీప్‌సుర్జేవాలా అభివర్ణించారు. దీనిపై సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సీబీఐ ద్వారా దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు.
 
‘విలేకరి మరణంపై దర్యాప్తుకు సిట్‌కు లేఖ రాస్తాం’
న్యూఢిల్లీ/భోపాల్: అనుమానాస్పద పరిస్థితుల్లో మృతిచెందిన విలేకరి అక్షయ్‌సింగ్ మృతదేహం నుంచి సేకరించిన నమూనాలను.. నిష్పాక్షిక ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం మధ్యప్రదేశ్ వెలుపలకు పంపించాలని, ఢిల్లీలోని ఎయిమ్స్‌కు పంపించాలని తాము కోరుకుంటున్నామని.. ఇండియా టుడే గ్రూప్ ఆదివారం ఎంపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది.

ఎంపీ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్‌చౌహాన్ భోపాల్‌లో మీడియాతో మాట్లాడుతూ.. విలేకరి అక్షయ్‌సింగ్ మరణంపై కూలంకషంగా దర్యాప్తు చేయించాలని తమ ప్రభుత్వం.. హైకోర్టు నియమించిన ‘సిట్’కు లేఖ రాస్తుందని పేర్కొన్నారు. వ్యాపమ్ కుంభకోణంపై దర్యాప్తును సీబీఐ సహా మరే ఇతర దర్యాప్తు సంస్థకు అప్పగించాలని రాష్ట్ర హైకోర్టు ఆదేశించినా తమ ప్రభుత్వానికి అభ్యంతరం లేదని చెప్పారు. ఈ నేపధ్యంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ ఆదివారం సీఎం చౌహాన్‌తో ఫోన్‌లో మాట్లాడారు. విలేకరి మరణంపై దర్యాప్తు జరిపించాలని పేర్కొన్నారు.
 
అక్షయ్ అంత్యక్రియలకు రాహుల్, కేజ్రీవాల్ హాజరు

న్యూఢిల్లీ: వ్యాపమ్ స్కాంపై పరిశోధన చేస్తూ అనుమానాస్పద స్థితిలో మరణించిన టీవీ చానల్ విలేకరి అక్షయ్‌సింగ్ అంత్యక్రియలను ఆదివారం ఢిల్లీలో నిర్వహించారు. అంత్యక్రియలకు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీలు హాజరయ్యారు. తూర్పు ఢిల్లీలోని నిగంబోధ్ ఘాట్‌లో జరిగిన ఈ అంత్యక్రియలకు బీజేపీ ఢిల్లీ అధ్యక్షుడు సతీష్ ఉపాధ్యాయ, ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, డీపీసీసీ అధ్యక్షుడు అజయ్‌మాకెన్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్‌సింగ్, రణ్‌దీప్‌సింగ్ సుర్జేవాలా తదితరులు హాజరై నివాళులర్పించారు.

మృతి చెందిన విలేకరి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులను కలిశానని.. తనకు ఎంతో బాధ కలిగిందని.. ఈ తీవ్ర విచార సమయంలో తాను వారి కోసం ప్రార్థిస్తున్నానని రాహుల్ ట్విటర్‌లో వ్యాఖ్యానించారు. పాత్రికేయుడి మృతితో పాటు.. వ్యాపమ్ కుంభకోణానికి సంబంధించిన మరణాలన్నిటిపైనా దర్యాప్తు జరిపి, దోషులకు శిక్ష విధించేలా, మరిక ఇటువంటి మరణాలు సంభవించకుండా ఉండేలా చర్యలు చేపట్టాలని కేజ్రీవాల్ ట్విటర్ వ్యాఖ్యల్లో డిమాండ్ చేశారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement