న్యాయస్థానం ఆవరణలో పోలీసుల కస్టడీ నుంచి తప్పించుకుని పరారైన నిందితుడిని 24 గంటల వ్యవధిలోనే పోలీసులు పట్టుకున్నారు. శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్ సింగ్ బుధవారం తన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. మే 23న నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగిన ఓ లైంగికదాడి కేసులో ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన నిందితులు జితేందర్‌పాల్(20), అరుణ్‌శర్మ(20)ను పోలీసులు అరెస్ట్ చేసి జ్యుడీషియల్ కస్టడీకి తరలించారు.
మంగళవారం నిందితులిద్దరిని రాజేంద్రనగర్ ఉప్పర్‌పల్లి ఎనిమిదో మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపర్చేందుకు తీసుకొచ్చారు. న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చిన తర్వాత ఇద్దరు నిందితులు పోలీసుల నుంచి తప్పించుకున్నారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు జితేందర్‌పాల్‌ను అక్కడే పట్టుకున్నారు. అరుణ్ శర్మ పోలీసులకు దొరకకుండా పరారయ్యాడు.
దీంతో రాజేంద్రనగర్ ఏసీపీ పరిధిలోని పోలీసులను నాలుగు టీంలుగా ఏర్పాటు చేసి అతడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అన్ని రైల్వేస్టేషన్‌లు, బస్టాండ్‌లలో గాలిస్తుండగా నార్సింగి పోలీసులకు బుధవారం నాంపల్లి రైల్వేస్టేషన్‌లో తెలంగాణ ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కుతూ అరుణ్‌శర్మ పట్టుబడ్డాడు. ఈమేరకు జ్యుడీషియల్ కస్టడీ నుంచి తప్పించుకుని పరారైన నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సమావేశంలో రాజేంద్రనగర్ ఏసీపీ గంగిరెడ్డి, నార్సింగి సీఐ రాంచంద్రరావు, ఆర్‌జీఐఏ సీఐ మహేష్ తదితరులున్నారు.