ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యను సందర్శించనున్న ప్రధాని
పనాజీ: గోవా తీరంలో ఉన్న దేశ అతిపెద్ద యుద్ధనౌక ఐఎన్‌ఎస్ విక్రమాదిత్యలో ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ప్రయాణించనున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత దేశ సైనిక సంపత్తిని మోడీ పరిశీలించడం ఇదే తొలిసారి. అరేబియా సముద్ర జలాల్లో నిలిచిన ఈ యుద్ధనౌకపైకి ప్రధాని నేవీ హెలికాప్టర్‌లో వెళతారు. యుద్ధనౌక, నేవీ యుద్ధ విమానాలు సంయుక్తంగా చేపట్టే విన్యాసాలను మోడీ తిలకిస్తారని రక్షణ శాఖ అధికారులు తెలిపారు. గత మే 26న ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసిన తర్వాత మోడీ ఢిల్లీ దాటి వెళ్లడం కూడా ఇదే మొదటిసారి కావడం విశేషం. రష్యా నుంచి 15 వేల కోట్లతో కొనుగోలు చేసిన 44,500 టన్నుల బరువైన విక్రమాదిత్య నౌకలో ఆయన 3 గంటలపాటు గడుపుతారు.
గిన్నిస్ రికార్డుగా మోడీ ప్రచార సభలు: ప్రధాని నరేంద్ర మోడీ సుడిగాలి ఎన్నికల ప్రచారం గిన్నిస్ బుక్‌లోకి ఎక్కేలా కన్పిస్తోంది. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయన ఏకంగా 1,800 ఎన్నికల ప్రచార ర్యాలీల్లో పాల్గొనడం తెలిసిందే. దీన్ని గిన్నిస్ రికార్డుగా గుర్తించాలంటూ పార్థసారథి శర్మ అనే హోమియోపతీ వైద్యుడు లండన్‌లోని గిన్నిస్ నిర్వాహకులను సంప్రదించారు. పూర్తి వివరాలు పంపాల్సిందిగా వారు కోరినట్టు శుక్రవారం ఆయన తెలిపారు. ఈ విషయమై ఏప్రిల్లోనే బీజేపీ వర్గాలను కలిశానని, మోడీ పాల్గొన్న ఎన్నికల ర్యాలీలు 5,000 పైచిలుకని వారు చెప్పారని అన్నారు.
యుద్ధనౌకలో మోడీ ప్రయాణం నేడు
Published Sat, Jun 14 2014 1:35 AM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement