
బెంగళూరు బాంబుకు వరంగల్ లింకు?
కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలో పేలిన బాంబుకు తెలంగాణలోని వరంగల్ జిల్లాతో సంబంధం ఉన్నట్లు అనుమానాలు తలెత్తుతున్నాయి. బాంబు పేలిన ఘటనాస్థలంలో ఓ తెలుగు వార్తాపత్రిక ముక్కలు కనిపించాయి. అవి వరంగల్ జిల్లా పేపర్ అని పోలీసులు చెబుతున్నారు. అమ్మోనియం నైట్రేట్, గాజుపెంకులు, ఇనుప ముక్కలతో ఐఈడీ బాంబు చేశారని, దీన్ని న్యూస్ పేపర్లో చుట్టి పెట్టారని పోలీసులు అంటున్నారు. సంఘటన స్థలంలో పేపర్ ముక్కలు దొరికినట్లు చెప్పారు.
బాంబు పేలుడు వ్యవహారంపై ఎన్ఐఏ అధికారి అభిషేక్ గోయల్ నేతృత్వంలో దర్యాప్తు సాగుతోంది. మొత్తం ఐదు బృందాలు వేర్వేరు చోట్లకు వెళ్లాయి. ఇదే తరహా బాంబులు ఎక్కడెక్కడ పేలాయి, వాటి వెనక ఎవరెవరు ఉన్నారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. అందులో భాగంగానే హైదరాబాద్కు కూడా ఒక బృందం వచ్చింది. ఇక.. సాయంత్రం ఐదు గంటల తర్వాత బాంబును స్థానికంగానే తయారుచేసి ఇక్కడ పెట్టారని ఫోరెన్సిక్ నిపుణులు అనుమానిస్తున్నారు.