‘టార్చర్‌ సెంటర్‌’లో మెహబూబా ముఫ్తీ | That Was A Torutre Centre Where Mehboob Mufti Detained | Sakshi
Sakshi News home page

అక్కడ లేని ‘పాప’ భీతి.. ఇక్కడ ఉంటుందా?!

Published Sat, Aug 10 2019 1:39 PM | Last Updated on Sat, Aug 10 2019 2:34 PM

That Was A Torutre Centre Where Mehboob Mufti Detained - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘మీ వల్ల రాష్ట్ర శాంతి భద్రతలకు ముప్పుంది. మీ కార్యకలాపాలు శాంతికి విఘాతం కల్పించవచ్చు. అందుకే మిమ్మల్ని నిర్బంధించాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేస్తున్నాం’ అంటూ ఆగస్టు 5వ తేదీ సాయంత్రం శ్రీనగర్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్, మాజీ రాష్ట్ర ముఖ్యమంత్రి, పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ నాయకురాలు మెహబూబా ముఫ్తీకి వ్యతిరేకంగా ఆదేశాలు జారీ చేశారు. ముద్రణలో ఉన్న ఈ ఆదేశాల కింద ‘చష్‌మషాహి సూట్, గ్రౌండ్‌ ఫ్లోర్, హరి నివాస్‌ గెస్ట్‌ హౌజ్‌లో ముఫ్తీని ఉంచండి. దీన్ని ఎస్‌ఆర్‌వో-498 కింది తాత్కాలిక జైలుగా మారుస్తున్నాం’ అని చేతి రాతలో ఉంది.

శ్రీనగర్‌లోని గుప్కార్‌ రోడ్డులో ఉన్న ఈ గెస్ట్‌ హౌజ్‌కు పెద్ద చరిత్రే ఉంది. ఇంతకుముందు ఇదొక ‘పెద్ద టార్చర్‌ సెంటర్‌’గా పేరు పొందింది. 1990వ దశకంలో కశ్మీర్‌ మిలిటెన్సీ అణచివేతలో భాగంగా వేలాది మంది యువకులను ఈ గెస్ట్‌హౌజ్‌లోనే నిర్బంధించి హింసించారు. వారిలోని ఒక్కొక్క అవయవాన్ని ఒక్కోరీతిగా తొలగించి ప్రత్యక్షంగా నరకం చూపించే వారన్న ప్రతీతి దీనికుంది. అంతకుముందు ఇది జమ్మూ కశ్మీర్‌ డోగ్రా రాజు మహారాజా హరిసింగ్‌ ప్యాలెస్‌. 1947లో భారత్‌కు స్వాతంత్య్రం వచ్చిన సందర్భంగా జమ్మూ కశ్మీర్‌ను తమ దేశంలో కలిపి వేయాలంటూ మహారాజా హరిసింగ్‌పై ఇటు భారత్‌ నుంచి అటు పాకిస్థాన్‌ నుంచి ఒత్తిళ్లు వచ్చిన విషయం తెల్సిందే.

కశ్మీర్‌ ముస్లిం రాజ్యం కనుక తమ దేశంలో విలీనం చేయాలంటూ పాకిస్థాన్‌ ఒత్తిడి చేయగా, భారత్‌లో విలీనం చేసినట్లయితే పాకిస్థాన్‌ను ఎదుర్కొనేందుకు సైన్యాన్ని పంపిస్తామంటూ భారత్‌ ఒత్తిడి తెచ్చింది. హిందూ రాజైన హరిసింగ్‌ భారత్‌లోనే తన రాజ్యాన్ని కలిపేందుకు మొగ్గుచూపి, భారత్‌లో విలీనం చేస్తున్నట్లు 1947, అక్టోబర్‌ 26వ తేదీతో సంతకం చేసి కశ్మీర్‌ నుంచి అదృశ్యమయ్యారు. ఆయన మళ్లీ ఎప్పుడు కశ్మీర్‌ తిరిగి రాలేదు. భారత ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూతో చర్చలు జరిపి కశ్మీర్‌ ప్రజా నాయకుడు, లౌకికవాది షేక్‌ అబ్దుల్లా కశ్మీర్‌ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించారు. 370 ఆర్టికల్‌ కింద రాష్ట్రానికి ప్రత్యేక ప్రతిపత్తిని సాధించుకున్నారు.

ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల్లో షేక్‌ అబ్బుల్లా జైలుకు వెళ్లడం, పదవీ వ్యామోహంతో కశ్మీర్‌ నాయకులు కాంగ్రెస్‌ పార్టీ చేతిలో కీలు బొమ్మలయ్యారనే ఆరోపణలతో 1989లో కశ్మీర్‌లో మిలిటెన్సీ పెరిగింది. 1985లోనే క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ డిపార్ట్‌మెంట్‌ స్వాధీనం చేసుకున్న ఒకనాటి ప్యాలెస్, నేటి హరి నివాస్‌ గెస్ట్‌హౌజ్‌లో మిలిటెంట్లను నిర్బంధించి టార్చర్‌ చేసేవారు. ప్రస్తుతం ఈ భవనంలోనే నిర్బంధంలో ఉన్న మెహబూబా ముఫ్తీ, ఇతర కశ్మీర్‌ నాయకులకు నాటి చేదు జ్ఞాపకాలు వెంటాడుతుండవచ్చు. ముఫ్తీ సొంతింటికి కొన్ని నిమిషాల్లో వెళ్లే దూరంలోనే ఈ టార్చర్‌ సెంటర్‌ ఉంది. ముఫ్తీ సొంతిల్లు కూడా ఒకప్పుడు టార్చర్‌ సెంటరే. 1990లో క్రిమినల్‌ ఇన్వెస్టిగేషన్‌ విభాగం ‘టార్చర్‌ సెంటర్‌’గా ఉపయోగించిన ఆమె ఇంటిని నాడు ‘పాప-2’ అని పిలిచే వారు. ముఫ్తీకి అక్కడ లేని పాప భీతి ఇక్కడ ఎందుకుంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement