లక్నో : కరోనా వైరస్ కట్టడి కోసం ఏర్పాటుచేసిన కంటైన్‌మెంట్ జోన్లలో ఆగ్రా- మోడల్ ఆదర్శంగా నిలుస్తుందని గొప్పలు చెప్పుకొని ప్రచారం చేసిన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అక్కడి అధికారులు షాక్ ఇచ్చారు. కంటైన్‌మెంట్ జోన్లలో పాటించాల్సన కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఆదివారం ఓ క్వారంటైన్ సెంటర్‌లో బిస్కెట్లు, వాటర్ బాటిళ్లు లాంటి వాటిని గేటు అవతలివైపు నుంచి విసిరేశారు. కొన్నింటిని గ్రిల్స్‌కి దగ్గర్లో ఉంచారు.దీంతో వాటిని తీసుకోవడానికి అక్కడున్న వారు ఎగబడ్డారు. ఏ మాత్రం సామాజిక దూరం పాటించకుండా గ్రిల్స్ దగ్గరగా ప్రజలు ఒక్కసారిగా గుమిగూడారు. కనీస జాగ్రత్త చర్యలు చేపట్టకుండా అధికారులు గేటు అవతలి వైపు చోద్యం చూస్తూ నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
దీనిపై స్పందించిన జిల్లా మెజిస్ట్రేట్ ప్రభు నారాయణ్ సింగ్ మాట్లాడుతూ.. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. మళ్లీ ఇలాంటి ఫిర్యాదుల తలెత్తకుండా చూడాల్సిందిగా ఓ బృందాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఆగ్రాలో కోవిడ్ కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. అంతేకాకుండా మరణాల రేటు ఇప్పటికే 10దాటింది. ఈ నేపథ్యంలో ఆగ్రాలో పరిస్థితి ప్రమాదకరంగా ఉందని..ఇది వూహాన్‌లా మారొచ్చని మేయర్ నవీన్ జైన్ అన్నారు. పరిస్థితిపై సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు లేఖ రాసిన ఆయన.. కరోనా వ్యాప్తిని అడ్డకట్ట వేయడంలో జిల్లా యంత్రాంగం విఫలమైందని ఆరోపించారు. క్వారంటైన్ సెంటర్‌లో ప్రజలను జంతువుల్లా చూస్తారనడానికి ఇదొక ఉదాహరణ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అఖిలేష్‌ప్రతాప్ సింగ్ ట్విట్టర్‌లో పేర్కొన్నారు. ఆగ్రా రోల్ మోడల్ ఇదేనా అని ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment