సార్క్ సదస్సుకు మేమూ వెళ్లం
బంగ్లా, అఫ్గాన్, భూటాన్ ప్రకటన
- భేటీ విఫలమయ్యే వాతావరణాన్ని పాక్ సృష్టించిందని ఆరోపణ
- సదస్సు వాయిదా పడొచ్చని పాక్ సంకేతాలు..
న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై ద్వంద్వనీతి అనుసరిస్తున్న పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ! నవంబర్‌లో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన 19వ సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు తామూ హాజరుకాబోవడం లేదని అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లు బుధవారం ప్రకటించాయి. సదస్సు విఫలమయ్యే వాతావరణాన్ని పాక్ సృష్టించిందని ఆ దేశం పేరు ప్రస్తావించకుండా మండిపడ్డాయి. ఉడీ ఉగ్రవాద దాడి, సీమాంతర చొరబాట్ల నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్లకూడదని భారత్ మంగళవారం నిర్ణయించిన నేపథ్యంలో ఈ దేశాలు పై నిర్ణయం తీసుకున్నాయి. తమ అంతర్గత వ్యవహారాల్లో ఒక సార్క్ దేశం(పాక్) మితిమీరిన జోక్యం వల్ల సమావేశం విఫలమయ్యే పరిస్థితి నెలకొందని బంగ్లాదేశ్ పేర్కొంది. ప్రాంతీయంగా ఉగ్రవాద సమస్య వల్ల గైర్హాజరవుతున్నట్లు అఫ్గాన్ తెలిపింది.
ప్రాంతీయ ఉద్రిక్తత వల్ల సదస్సు విజయవంతమయ్యే పరిస్థితి లేదని భూటాన్ పేర్కొంది. 8 సభ్యదేశాలున్న సార్క్(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమితి)లో నాలుగు గైర్హాజరు కానుండడంతో సమావేశం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సార్క్ నిబంధనల ప్రకారం కూటమిలో ఏ దేశమైనా గైర్హాజరైతే సదస్సు రద్దవడమో, వాయిదా పడడమో జరుగుతుంది. కాగా, భారత్ హాజరయ్యేందుకు నిరాకరిస్తే సదస్సు వాయిదా పడే అవకాశముందని పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సల హాదారైన సర్తాజ్ అజీజ్ సంకేతాలిచ్చారు. సదస్సును చెడగొట్టేందుకు భారత్ దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు. అయితే సదస్సును షెడ్యూలు ప్రకారం(నవంబర్ 9,10) నిర్వహించి తీరతామని అంతకుముందు పాక్ విదేశాంగ ప్రతినిధి జకారియా చెప్పారు. భారత్ నిర్ణయం దురదృష్టకరమని, ఆ దేశం గైర్హాజరవుతున్నట్లు అధికారిక సమాచారమేదీ అందలేదన్నారు. 4 దేశాల గైర్హాజరు నేపథ్యంలో సదస్సును వాయిదా వేయాలని భారత్ సూచించింది. సమావేశం వాయిదాపడినట్లు నేపాల్ మీడియా పేర్కొంది.
‘సానుకూల వాతావరణం కావాలి’
సార్క్ సదస్సులో కూటమికి చెందిన అన్ని దేశాలూ పాల్గొనేలా సానుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సార్క్ అధ్యక్ష దేశమైన నేపాల్ పేర్కొంది. సదస్సులో పాల్గొనడం లేదని నాలుగు దేశాలు తమకు చెప్పాయని వెల్లడించింది. కాగా, ఉగ్రశిబిరాలపై పాక్ చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది.