ఇష్టంగానే సెక్స్ వర్క్ చేస్తున్నాం!
బెంగళూరు: సాటి మనిషికి పట్టించుకునే తీరిక లేనప్పుడు సమస్యలు ఆ వ్యక్తిని చెడుగుడు ఆడేస్తాయి. వాటి బెంగతో కొందరు మహిళలు.. ప్రాణం తీసుకుంటే.. ఇంకొందరు పోరాటానికి నిలబడతారు. మరికొందరు మానం(గౌరవం) ఇచ్చేసైనా బతుకుతారు.. బతికిస్తారు. ఆ సమయంలో గౌరవం లాంటివి వారిని ముందుకు నడిపించలేవు. ఆత్మాభిమానం వారిని అడ్డుకోలేదు. ఎందుకంటే ఆ సమయంలో వారికి అమాంతం తొక్కేస్తున్న సమస్య అనే భూతాన్ని చంపడమే లక్ష్యంగా ఉంటుంది.
బెంగళూరులో సునీత(పేరు మార్చాం) అనే మహిళకు 30 ఏళ్లు. చాలా చిన్న వయసులో పెళ్లి చేశారు. ఇద్దరు పిల్లలు కలగగానే భర్త చనిపోయాడు. పరిస్థితులు వెంటనే ఆమెను వ్యభిచార రొంపిలోకి దింపాయి. అక్కడ అనుభవిస్తున్న బాధ నుంచి ఎలాగైనా విముక్తి పొందాలని ఎదురుచూసింది. పోలీసుల రూపంలో సహాయం దొరకడంతో ఆ కూపంలో నుంచి తప్పించుకోగలిగింది. దాదాపు పదేళ్లపాటు అందులో నరకం అనుభవించి తిరిగి స్వేచ్చను పొందింది. ఇప్పుడు ఆమె ఓ వ్యక్తిని తన పిల్లలకు రక్షణగా, తనకు తోడుగా ఉండేందుకు పెళ్లి చేసుకుంది. అతడు ఆమెకు పూర్తి స్వేచ్ఛను ఇచ్చాడు.
అయితే, ఆమె తన వృత్తిని మాత్రం మానుకోలేదు. భర్త ఇష్టం మేరకే ఆ పనికొనసాగిస్తుంది. అయితే, ఈసారి అలాంటి గృహానికి వెళ్లి కాదు.. బలవంతంగా కాదు. ఆమె ఇష్ట ప్రకారమే.. నచ్చినవారితో మాత్రమే ఆ పనిచేస్తోంది. 'నేనొక సెక్స్ వర్కర్ని.. కానీ బలవంతంగా ఆ పనిచేయడం లేదు.. చాయిస్ ప్రకారం చేస్తున్నాను' అని చెప్తోంది. అలాగే శశికల(పేరు మార్చాం) అనే మరో మహిళ కూడా సెక్స్ వర్కరే.. ఆమె కూడా తన చాయిస్ ప్రకారమే ఆ పనిచేస్తుంది తప్ప బలవంతంగా చేయడం లేదంటూ బదులిచ్చింది.
ఆమెకు ముగ్గురు పిల్లలు.. వారిలో ఇద్దరి పెళ్లిల్లు కూడా చేసింది. ఆమె ఆ పనిచేస్తున్న విషయం తన పిల్లలకు తెలుసని.. తన వృత్తే తమకు భోజనం పెడుతుందని, చదువుకు ఫీజులు కట్టిందని.. తన కోడలికి కూడా తన వృత్తి విషయం చెప్పినట్లు చెప్పింది. ఇలా ఎంతోమంది తమకు ఇష్టం ఉండే, నచ్చినవారితోనే అలాంటి కార్యక్రమాలు చేస్తున్నాం తప్ప ప్రస్తుతం బలవంతంగా ఆ పనిచేయడంలేదని, తమ జీవితాలు ఎలా ఉన్నా తమ పిల్లల భవిష్యత్తు బంగారంగా మారుతుందనే ఈ వృత్తి చేస్తున్నామని చెప్తున్నారు.