వాళ్లకు చేతులెత్తి దండం పెట్టాల్సిందే
అధికారం ఎక్కడ వస్తుందనుకుంటే అక్కడకు నాయకులు చేరిపోతున్న పరిస్థితిని చూస్తున్నామని, ఇది చాలా దారుణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత, ఎంపీ మేకపాటి రాజమోహనరెడ్డి అన్నారు. అలా వెళ్లకుండా నికరంగా తాము నెగ్గిన పార్టీలోనే ఉంటున్నవాళ్లకు నిజంగా చేతులెత్తి దండం పెట్టాల్సిందేనని ఆయన వ్యాఖ్యానించారు. పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో కలిసి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కలిసి వచ్చిన తర్వాత పార్లమెంటు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. మాజీ ప్రధాని వాజ్‌పేయి కేవలం ఒక్క ఓటు తేడాతో అధికారాన్ని కోల్పోయారని, కావాలనుకుంటే తనకున్న అధికార బలంతో ఆయన నలుగురైదుగురు ఎంపీలను తెప్పించుకోవడం పెద్ద పని కాదని.. అయితే విలువలకు కట్టుబడి ఏకంగా కేంద్రంలో అధికారాన్ని సైతం వదులుకున్నారని గుర్తు చేశారు. ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిన తర్వాత ప్రతిపక్ష నాయకులందరినీ కూడా అధికార పక్షం తీసేసుకున్నా.. చివరకు ప్రజలే ప్రతిపక్షంగా మారుతారని చెప్పారు. గతంలో కాంగ్రెస్ పార్టీ చేసిన దరిద్రపు పనులు చూసి.. అసలు ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ఎన్టీ రామారావు పార్టీ పెడితే ప్రజలు ఆయనకు బ్రహ్మరథం పట్టారని అన్నారు. ఇతర పార్టీల నుంచి సభ్యులను చేర్చుకోవడం అనైతికమేనని, ఇది ఎవరు చేసినా తప్పేనని ఆయన చెప్పారు.
ఇక అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్య పెంపు గురించి తాము రాజ్‌నాథ్ సింగ్‌తో చర్చించామని మేకపాటి రాజమోహనరెడ్డి తెలిపారు. అయితే ఆయన కూడా ప్రస్తుతానికి దాని గురించి కచ్చితంగా ఏమీ చెప్పలేకపోయారన్నారు. అటార్నీ జనరల్ చెప్పిన అభిప్రాయం ప్రకారం మాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో అయితే 2026 వరకు సంఖ్యను పెంచడానికి వీల్లేదని ఎన్నికల కమిషనర్ చెప్పారన్నారు. అయితే రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు అడుగుతున్నారు కాబట్టి, కేంద్రం కూడా పెంచాలని భావిస్తే, రాజ్యాంగ సవరణ లేదా చట్టసవరణ చేసి పెంచే అవకాశం ఉందేమో చూడాలన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఇతర విషయాలపై కూడా ఆయనతో చర్చించామని, అన్ని విషయాలనూ తాను చూస్తానని రాజ్‌నాథ్ హామీ ఇచ్చారని మేకపాటి తెలిపారు.