స్పీకర్ చర్యలు ఏకపక్షం.. అన్యాయం
♦ ఫిరాయింపుదారులపై చర్యలు తీసుకోవట్లేదు
♦ మా ఫిర్యాదుల్ని తక్షణమే పరిష్కరించేలా స్పీకర్‌ను ఆదేశించండి
♦ ఫిరాయింపుదారులకు నోటీసులు జారీచేసేలా కూడా ఆదేశాలివ్వండి
♦ సుప్రీంకోర్టులో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తమ పార్టీ నుంచి అధికార తెలుగుదేశం పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కాలయాపన చేయడాన్ని ప్రశ్నిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పార్టీ ఫిరాయించిన శాసనసభ్యులపై అనర్హత వేటేయాలంటూ తామిచ్చిన ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించేలా స్పీకర్‌ను ఆదేశించాలని కోరుతూ వైఎస్సార్‌సీపీకి చెందిన నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి శుక్రవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అనర్హత వేటేయాలంటూ తాము ఎవరిపై అయితే ఫిర్యాదు చేశామో వారందరికీ నోటీసులు జారీచేసేలా కూడా స్పీకర్‌ను ఆదేశించాలని ఆయన సర్వోన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ వ్యాజ్యంలో స్పీకర్, అసెంబ్లీ కార్యదర్శి, 16 మంది ఎమ్మెల్యేలు.. భూమా నాగిరెడ్డి, భూమా అఖిలప్రియ, సి.ఆదినారాయణరెడ్డి, జలీల్‌ఖాన్, టి.జయరాములు, పి.డేవిడ్‌రాజు, ఎం.మణిగాంధీ, కె.వెంకటరమణమూర్తి, పాశం సునీల్‌కుమార్, జ్యోతుల నెహ్రూ, వరుపుల సుబ్బారావు, ఆర్.వి.సుజయ రంగారావు, అత్తర్ చాంద్‌బాషా, జి.రవికుమార్, కె.సర్వేశ్వరరావు, బి.రాజశేఖరరెడ్డిలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. మేకపాటి పిటిషన్‌లోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి.
పోరాటం చేస్తున్నందునే...
‘‘వైఎస్సార్‌సీపీ ప్రతిపక్ష పార్టీగా నిస్వార్థంతో ప్రజాసమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తోంది. అధికారపార్టీ అక్రమాలను ప్రశ్నిస్తోంది. ఇది తట్టుకోలేకనే ఫిరాయింపులకు అధికారపార్టీ తెరలేపింది. ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలకు పలు ఆశలు కల్పిస్తోంది. మంత్రి పదవులను ఎరగా చూపుతోంది. అధికారపార్టీ ప్రోత్సహిస్తున్న ఈ సామూహిక ఫిరాయింపులు ప్రజాస్వామ్య మౌలిక స్వరూపాన్ని దెబ్బతీసేవిధంగా ఉన్నాయి. ఫిరాయింపుల్ని మొగ్గలోనే తుంచి, ప్రజాస్వామ్య, రాజ్యాంగ విలువలను పరిరక్షించాల్సిన స్పీకర్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. మొదటిబ్యాచ్ ఫిరాయింపులపై ఫిర్యాదులు చేసి నెలరోజులు గడిచిపోయాయి. ఇప్పటివరకు స్పీకర్ చర్యలు తీసుకోలేదు.ఫిరాయింపుదారులకు నోటీసులు ఇవ్వలేదు. దీంతో అధికారపార్టీ ఫిరాయింపుల్ని యథేచ్ఛగా ప్రోత్సహిస్తోంది. ఫిరాయింపుదారులు దర్జాగా అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతున్నారు. పదవ షెడ్యూల్‌లో నిర్దేశించిన విధివిధానాలను స్పీక ర్ ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఈ విధంగా స్పీకర్ వ్యవహరించడం ఏకపక్షం, అన్యా యం, రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధం.
ప్రజల్ని వంచించడమే...
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు వైఎస్సార్‌సీపీ నామినేషన్‌పై పోటీచేసి ఈ పార్టీ గుర్తుపైనే ఎన్నికల్లో గెలుపొందారు. ప్రజల్లో పార్టీకున్న పేరును, ప్రతిష్టను, పార్టీ సిద్ధాంతాలను, నిధులను ఉపయోగించుకుని గెలిచారు. తరువాత మా పార్టీకి ప్రధాన శత్రువుగా ఉన్న టీడీపీలోకి ఫిరాయించారు. ఇలా చేయడం వైఎస్సార్‌సీపీ విధానాలను, ఆశయాలను, ఆకాంక్షలను అమలు చేస్తారన్న ఉద్దేశంతో ఓటేసి గెలిపించిన ప్రజల్ని వంచించడమే. ఇలా పార్టీ ఫిరాయించిన సభ్యులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత స్పీకర్‌పై ఉంది. పార్టీ ఫిరాయించిన వ్యక్తులపై అనర్హత వేటేయాలంటూ అన్ని ఆధారాలతోసహా స్పీకర్‌కు ఫిర్యాదు చేశాం.
ఫిరాయింపుదారులు ఏవిధంగా అధికారపార్టీలోకి చేరింది.. ఆ పార్టీలో సభ్యులుగా కొనసాగుతున్నదీ.. ఆ పార్టీని ఎలా కీర్తిస్తున్నదీ పత్రికల్లో, మీడియాలో సవివరంగా వచ్చింది. ఈ విషయాలను ఫిరాయింపుదారులు కూడా ఖండించలేదు. వీటన్నింటినీ స్పీకర్ దృష్టికి తీసుకెళ్లాం. పదవ షెడ్యూల్ ప్రకారం వారు ఏవిధంగా అనర్హులవుతారో కూడా వివరించాం. ఫిరాయింపుల్ని అడ్డుకునేందుకు రాజ్యాంగంలో 10వ షెడ్యూల్‌ను చేర్చారు. ఫిరాయింపుదారులపై చర్యలకోసం ఫిర్యాదులు అందినప్పుడు వాటిపై స్పీకర్ ఎంతకాలంలోపు స్పందించాలన్నది అటు పదో షెడ్యూల్‌లోగానీ, ఇటు ఏపీ అసెంబ్లీ నిబంధనల్లోగానీ స్పష్టంగా లేదు. దీనిని అడ్డంపెట్టుకుని స్పీకర్ కాలయాపన చేస్తున్నారు. మేం ఫిర్యాదు చేసి నెలకుపైగా కావస్తున్నా ఇప్పటివరకు ఎటువంటి చర్యలు లేవు.
న్యాయసమీక్ష చేయవచ్చు..
పక్షపాతంతో స్పీకర్ తీసుకునే నిర్ణయాలకు, అతని చర్యలకు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం ఎటువంటి రక్షణ లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చింది. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను అడ్డుకుని ప్రజాస్వామ్య విలువలను పరిరక్షించేందుకు పదవ షెడ్యూల్‌ను తీసుకొచ్చిన విధానాన్ని, ఆ షెడ్యూల్ లక్ష్యాలను సుప్రీంకోర్టు 1992లో కియోటో హోల్లోహన్ వర్సెస్ జచిల్లు కేసులో స్పష్టంగా వివరించింది. అనర్హత విషయంలో తన ముందున్న ఫిర్యాదులను పరిష్కరించడంలో స్పీకర్ జాప్యం చేయడమంటే రాజ్యాంగ బాధ్యతలను విస్మరించడమే అవుతుంది.
ఫిర్యాదులపై చర్యలు తీసుకోవడంలో స్పీకర్ విఫలమైతే ఫిరాయింపుల భూతాన్ని అడ్డుకోవడంలో విఫలమైనట్లే. ఈ మొత్తం వ్యవహారంలో స్పీకర్ తీరు ప్రజాస్వామ్య విలువలకు, అసెంబ్లీ సమగ్రతకు హాని కలిగించేలా ఉంది. సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పీకర్ విధులను స్పష్టంగా తెలియపరచింది. తన ముందున్న ఫిర్యాదులపై నిర్ణయం తీసుకోవడంలో స్పీకర్ చేసే అసాధారణ జాప్యంపై న్యాయ సమీక్ష చేయవచ్చు. స్పీకర్ చేస్తున్న ఉద్దేశపూర్వక కాలయాపన వల్ల అధికారపార్టీ తమ ఫిరాయింపుల్ని యథేచ్చగా కొనసాగిస్తూనే ఉంది. ఈ పరిస్థితుల్లో విధిలేక ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేస్తున్నాం’’ అని మేకపాటి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.