
సైబర్ భద్రతకు పరిష్కారాలు
సైబర్ భద్రత ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో..
- ‘క్లౌడ్ గోడౌన్లు, క్లౌడ్ లాకర్ల’ సృష్టికి కృషిచేయాలి
- భారత ఐటీ పరిశ్రమకు ప్రధాని మోదీ పిలుపు
న్యూఢిల్లీ: సైబర్ భద్రత ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న నేపథ్యంలో.. ఈ ప్రపంచ సమస్యను ఎదుర్కొనే పరిష్కారాలు కనుగొనాలని, సమాచారాన్ని భద్రంగా ఉంచేందుకు ‘క్లౌడ్ గోడౌన్లు’, ‘క్లౌడ్ లాకర్లు’ వంటి విప్లవాత్మక ఆలోచనలపై కృషి చేయాలని ప్రధాని మోదీ భారత ఐటీ పరిశ్రమకు పిలుపునిచ్చారు. ఆదివారమిక్కడ నాస్‌కామ్ రజతోత్సవలో మాట్లాడుతూ.. 14,600 కోట్ల డాలర్ల భారత ఐటీరంగం.. భారత్‌ను ప్రపంచం చూసే దృష్టికోణాన్ని మార్చివేసిందన్నారు. ‘ప్రధాని అయినప్పటి నుంచీ నేను కలసిన 50 మంది ప్రపంచ, రాజకీయ నేతల్లో 30 మంది సైబర్ భద్రత అనేది ఆందోళనకరంగా ఉందన్నారు’ అని చెప్పారు.
సైబర్ భద్రతకు పెద్ద మార్కెట్ ఉంటుందని, ఈ అవకాశాన్ని ఎలా వాడుకోవాలనేదానిపై నాస్‌కామ్ ఒక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలన్నారు. బ్యాంకులు, ఇతర సంస్థలు అద్దెకు తీసుకునేలా, లేదా వినియోగించుకునేలా ‘క్లౌడ్ గోడౌన్లు, క్లౌడ్ లాకర్లు’ వంటి వాటిని సృష్టించేందుకు ఐటీ పరిశ్రమ కృషి చేయాలన్నారు. తాజా బడ్జెట్‌లో ప్రకటించిన ‘గోల్డ్ బాండ్ల’ పథకాన్ని ప్రస్తావిస్తూ.. ఇటువంటి వాటిని ‘క్లౌడ్ లాకర్ల’లో భద్రంగా ఉంచుకోవచ్చన్నారు. డిజిటల్ ఇండియా కార్యక్రమాన్ని ప్రస్తావిస్తూ.. ఈ-గవర్నెన్స్ అంటే ఈజీ గవర్నెన్స్(సులభ పాలన), ఎకానమికల్ గవర్నెన్స్ (పొదుపైన పాలన) అనే అర్థం కూడా వస్తుందన్నారు.
ఐటీ మౌలికవసతులను కూడా ప్రభుత్వం నిర్మిస్తోందని, హైవేల తరహాలోనే ‘ఐ-వే’లూ అభివృద్ధికి అవసరమన్నారు. ప్రధానమంత్రి కార్యాలయం కోసం అభివృద్ధి చేయబోయే మొబైల్ ఫోన్ అప్లికేషన్ రూపురేఖలపై ప్రజల నుంచి సూచనలు కోరతామన్నారు. కీలకాంశాలపై ప్రజలఅభిప్రాయాల సేకరణకు ప్రధాని ‘మైగవ్’ వెబ్‌సైట్ ప్రారంభించారు. అవినీతి నిర్మూలనంలోసాంకేతిక పరిజ్ఞానం ఎలా దోహదపడుతోందో వివరిస్తూ వంట గ్యాస్ సబ్సిడీ నగదు బదిలీ,ని ప్రస్తావించారు.