
కృష్ణయ్య, కన్హయ్యా ఇద్దరూ అవసరమే..
న్యూఢిల్లీ: భారత్ మాతాకీ జై నినాదం ఉచ్ఛరిస్తేనే దేశభక్తి ఉన్నట్లు కాదని కాంగ్రెస్ ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ వ్యాఖ్యానించారు. తాను మాత్రం భారత్ మాతా కీ జై అనేందుకు సంతోషిస్తానని, ఇతరులు కూడా అనాలని కోరుకుంటానని ఆయన అన్నారు. జేఎన్ యు ఘటన నేపథ్యంలో బిజెపి ప్రభుత్వంపై విమర్శలు ఎక్కుపెట్టిన శశిథరూర్.. రాజ్యాంగం మనకు స్వేచ్ఛనిచ్చిందని, భారత్ అంటే.. కేవలం, హిందీ, హిందు, హిందుస్థాన్ మాత్రమే కాదన్నారు.
ప్రజలు తాము నమ్మిన సిద్ధాంతాన్ని హక్కుగా భావించడంతోపాటు... ప్రజాస్వామ్యంలో ఇతరుల నమ్మకాలను గౌరవించాల్సిన సహనం అవసరం అని శశిథరూర్ అన్నారు. ఆదివారం రాత్రి ఆయన జేఎన్ యు విద్యార్థులనుద్దేశించి మాట్లాడారు. మన దేశం అంటే కేవలం హిందీ, హిందు, హిందుస్థాన్ మాత్రమే కాదని, మరింత వైవిధ్యాన్ని అంగీకరించడం దేశంలో చారిత్రక సంప్రదాయంగా వస్తోందని అన్నారు. మనకు కృష్ణయ్యా, కన్హయ్య ఇద్దరూ అవసరమేనన్నారు. భవిష్యత్తులో భారత భూభాగంలో నివసించే ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కలిగి ఉండాలని భావిస్తున్నట్లు థరూర్ తెలిపారు.
భారత వ్యతిరేక నినాదాలు చేశారంటూ దేశద్రోహం కేసులో ముగ్గురు విద్యార్థులు అరెస్టయి, ఇటీవల నిరసనలకు కేంద్రంగా మారిన జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం పరిపాలనా కార్యాలయం బయట 'జేఎన్ యు, నేషనలిజం' పై శిశిథరూర్ మాట్లాడారు. భారతదేశంలో కీలక అంశాలపై విద్యార్థులు చర్చించడాన్ని థరూర్ అభినందించారు. విద్యాభ్యాసానికి మీరంతా ఇక్కడకు వచ్చి ఉండొచ్చని, అయితే మీరు కూడ దేశాన్ని విద్యావంతంగా తీర్చి దిద్దడంలో భాగస్వాములేనని అన్నారు.
సుమారు 40 నిమిషాలపాటు విద్యార్థులనుద్దేశించి ప్రసంగించిన శశిథరూర్... అనేక చారిత్రక ఘటనలు, వ్యక్తిగత అనుభవాలను ప్రస్తావించారు. అంతేకాక జవహర్ లాల్ నెహ్రూతో పాటు, పలువురు ప్రముఖ వ్యక్తులను కోట్ చేస్తూ... వారి సహనం, వైవిధ్యం, భారత దేశంలో వారి ప్రాముఖ్యత వంటి ఎన్నో విషయాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు.