'దేవుడు మమ్మల్ని పరీక్షించాడు'
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ.. పుట్టుకతోనే సంచనాలను సృష్టించిన పార్టీ. 2012 నవంబర్ 26న ఏర్పడిన పార్టీ.. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో 28 సీట్లను దక్కించుకుని పెద్ద పార్టీలకు షాకిచ్చింది. కాంగ్రెస్ తో కలిసి ఢిల్లీలో ప్రభుత్వం ఏర్పాటు చేసినా 49 రోజుల్లోనే తన పాలనకు స్వస్తి పలికింది ఆప్. ఆ సమయంలో ఆప్ చుట్టూ ఎన్నోవివాదాలు రచ్చకెక్కాయి. ఆ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ కు అత్యంత సన్నిహితుడైన వినోద్ కుమార్ బిన్నీ పార్టీని వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంకా ఆప్ నుంచి చాలా మంది బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారంటూ అలజడి రేపారు.
ఇదంతా గతమైనా.. అది దేవుడి పెట్టిన పరీక్ష అంటున్నారు ఆప్ నేత మనీష్ సిసోడియా. ఆ రోజు 28 ఎమ్మెల్యేలతో తాము ఎలా నెట్టుకొస్తామని దేవుడు పరీక్షించాడని ఆయన తాజాగా తెలిపారు. ఇప్పుడు తమ పార్టీలో 67 మంది ఎమ్మెల్యేలు ఉండటంతో ఎటువంటి బెంగలేదన్నాడు. ఈసారి ఎవరైనా (ఎమ్మెల్యేలు) పార్టీ గీత దాటితే మాత్రం చర్యలు తప్పవంటూ హెచ్చరికలు జారీ చేశారు. ఫిబ్రవరి 14(శనివారం) ఆప్ సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తన్న నేపథ్యంలో సిసోడియా ముందుగానే ఆ పార్టీ సభ్యులకు హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం.