సీమాంధ్రుల అభిప్రాయాలు సేకరిస్తాం: దిగ్విజయ్ సింగ్
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై సీమాంధ్రుల అభిప్రాయాలను కాంగ్రెస్ ఉన్నత స్థాయి కమిటీ సేకరిస్తుందని దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు 21న ఉప ఎన్నికలు జరగనున్న సందర్భంగా బుధవారమిక్కడ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనతోపాటు కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పడిందని చెప్పారు.
‘కుటుంబంలాంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడం చాలా కష్టం. తెలంగాణ సమస్య చాలా ఏళ్లుగా నలుగుతోంది. ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి. ఆంటోనీ కమిటీ ఈ రోజు నుంచే పని ప్రారంభిస్తుంది’ అని తెలిపారు. ‘ఎన్జీవోలు, విద్యార్థులు, అన్ని పక్షాల రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను కమిటీకి చెప్పవచ్చు. అందరికీ సంతృప్తికరమైన రీతిలో నిర్ణయం తీసుకుంటాం. ఏపీ ఎన్జీవోలు సమ్మెకు వెళ్లవద్దు. వారు తమ అభిప్రాయాలను కమిటీకి చెప్పవచ్చు. తెలంగాణ సమస్య ఎంతోకాలంగా ఉంది. అందుకే నిర్ణయం తీసుకున్నాం. సీడబ్ల్యూసీ కూడా అందుకే తీర్మానం చేసింది.
అందరూ అర్థం చేసుకుని, ఆందోళన మార్గాన్ని విరమించుకోవాలి. పార్టీలు సంయమనం పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు. విభజనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. అయితే, అన్ని సమస్యలకూ కాంగ్రెస్ పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు. ఉన్నతస్థాయి కమిటీ అభిప్రాయ సేకరణ జరిగే వరకు విభజన ప్రక్రియ ఆగుతుందా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు.