ప్రతి వ్యక్తీ ఆరోగ్యంగా, ఫిట్ గా ఉండాలనుకుంటాడు. అయితే వారసత్వం, ఆహారపు అలవాట్లు తదితర కారణాలతో ఊబకాయులుగా తయారవుతుంటారు. ఆ తర్వాత స్లిమ్ గా కనిపించేందుకు, ఆరోగ్యంగా ఉండేందుకు బరువు తగ్గాలన్న తాపత్రయంలో జిమ్ లకు, యోగాలకు వెళుతుంటారు. కొందరు డైటింగ్ పేరుతో పూర్తిగా ఆహారం తీసుకోవడమే మానేస్తుంటారు. వీటిన్నింటితో బరువు తగ్గుతారో లేదో గానీ అనారోగ్యాలను మాత్రం కొని తెచ్చుకుంటారు. అందుకే బరువు తగ్గడమే ధ్యేయంగా డైటింగ్ పాటించేవారికి సదవకాశాన్ని కల్పించారు డైటీషియన్లు. వారం రోజులపాటు వారు సూచించిన ప్రకారం ఆహారం తీసుకుంటే బరువు తగ్గుతారనడంలో ఏమాత్రం సందేహం లేదంటున్నారు.
కొందరు డైటీషియన్లు ఓ పద్ధతి ప్రకారం బరువు తగ్గేందుకు కావలసిన డైట్ షీట్ ను రూపొందించారు. దీంతో వారంలో ఐదు కిలోల బరువు తప్పనిసరిగా తగ్గే అవకాశం ఉందని చెప్తున్నారు. వారంరోజుల పాటు తీసుకునే ఆహారంలో రోజువారీ షీట్ ను రూపొందించారు. డైట్ ప్లాన్ లో భాగంగా మొదటిరోజు మంచి పుష్టికరమైన, తేలిగ్గా ఉండే ఆహారాన్ని తీసుకోవాలని చెప్తున్నారు. దీనిలో ముఖ్యంగా పళ్ళు, ఫలాలు ఉండాలని రోజంతా వాటినే ఆహారంగా తీసుకోవాలని, వాటిలో అరటి పండును మాత్రం లేకుండా చూసుకోవాలని సూచించారు.
పండ్లతోపాటు రోజంతా కడుపు నిండుగా నీళ్లు తాగుతుండాలి. రెండోరోజు ఆహారంలో కూరగాయలు మాత్రమే తీసుకోవాలి. అయితే కూరలు వండినవి కానీ పచ్చివి గానీ తీసుకోవచ్చు. మూడోరోజు పండ్లు, కూరలు రెండింటినీ రోజంతా ఆహారంగా తీసుకోవాలి. రోజు ప్రారంభంలో ముందుగా ఫలాలను తీసుకొని, లంచ్ లో కూరలు, సలాడ్లు తీసుకోవాలి. తిరిగి రాత్రి డిన్నర్ లో భాగంగా పళ్ళను, లేదా కూరలను భుజించాలి. అయితే వీటిలో కూడ అరటిపండు, బంగాళ దుంప లేకుండా చూసుకోవాలి. నాల్గవ రోజు ఆహారంగా కేవలం పాలు, అరటి పండు మాత్రమే తీసుకోవాలి. మిల్క్ షేక్ తీసుకునేట్టయితే పాలల్లో మీగడ లేకుండా చూసుకోవాలి. లేదంటే ఫ్యాట్ పెరిగే అవకాశం ఉంటుంది.
నాలుగు రోజులపాటు పూర్తిగా పళ్ళు, కూరగాయలతో గడిపిన తర్వాత ఐదవ రోజు మాత్రం ఒక్క కప్పు అన్నం ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. దీంతోపాటు రోజు మొత్తంలో ఏడు నుంచి ఎనిమిది పెద్ద సైజు టమాటాలు తినాలి. ఆహారంతో పాటు మధ్య మధ్యలో పన్నెండు నుంచి, 15 గ్లాసుల వరకు నీటిని తాగాలి.
ఆరవరోజు డైట్ లో భాగంగా కూరగాయలు పచ్చివి, లేదా ఉడికించినవి తినాలి. మధ్యాహ్నం ఓ కప్పు అన్నం కూడ తినొచ్చు. రాత్రి డిన్నర్ లో కూడ కూరగాయలు తినాలి. రోజు మొత్తంలో పది గ్లాసుల వరకూ నీరు తాగాలి. చివరిరోజైన ఏడవరోజు ఒక కప్పు అన్నంతో పాటు.. కూరగాయలు, పళ్ళు తీసుకోవాలి. రోజంతా పళ్ళ రసాలు కూడ తాగుతుండాలి. ఇలా ఏడు రోజులపాటు డైటీషియన్లు సూచించిన మేరకు ఆహార నియమాలను పాటించి ఐదు కిలోల బరువు తగ్గొచ్చట. ఇంకెందుకాలస్యం మీరూ ట్రై చేయండి మరీ...